భారతీయత మూర్తీభవించిన విప్లవ జాతీయవాది
స్వతంత్ర సాధనకు ముందటి దశకు చెందిన అరుదైన భారతీయ యోధుడు భగత్ సింగ్. సిద్ధాంత విభేదాలతో నిమిత్తం లేకుండా అన్ని రకాల వారూ ఆఖరుకు సిక్కు ఉగ్రవాదులూ పాకిస్తానీలు కూడా తన వారసులమంటుంటారు. ఈ విచిత్ర పరిస్థితిని ఎలా అర్థం చేసుకోవాలన్న దానిపై చరిత్రకారుడు ఇర్ఫాన్ ఎస్ హబీబ్‌తో మణిముగ్ధశర్మ ఎస్ చేసిన ఇంటర్వ్యూ ఇది.
భగత్ సింగ్ మాకంటే మాకు చెందుతాడని మితవాదులు, వామపక్ష వాదుల మధ్య సాగే పోరాట నేపథ్యంలో మీరు ఆయనకు ఎలాంటి స్థానమిస్తారు?
ఒక అమరవీరుడుగా, జాతీయవాదిగా ఆయన వారసత్వాన్ని ఖాతాలో వేసుకోవడం చాలా సుఖప్రదమైంది, సులభం కూడా. మితవాదులు ఆ పని ఎప్పుడూ చేస్తూనే వున్నారు. కాని భగత్ సింగ్ దేనికోసమైతే నిలబడ్డారో ఆ విధానాలతో వారికి ఏ కోశాన సంబంధమే లేదు. తన స్వల్ప కాల జీవితంలో ఆయన ఎప్పుడూ వ్యవస్థాగతమైన ఏ వామపక్షంలోనూ భాగం కాలేదు. కాని స్వతంత్ర భారతాన్ని గురించిన ఆయన దృక్పథం సామ్యవాద భావజాలంతో కూడి వుంది. విస్తారమైన వామపక్ష ఛాయలలో ఏదో ఒక దానికి ఆయన చెందుతారు. దేశ స్వాతంత్య్రం తర్వాత కూడా బతికి వున్న ఆయన సహచరులు చాలా మంది కమ్యూనిస్టు పార్టీలోనో కాంగ్రెస్‌లోనో పనిచేశారు. దాదాపు ఎవరూ మితవాదం వైపు వెళ్లలేదు.
భగత్ సింగ్ అంటే తుపాకీ చేబూని బ్రిటిష్ అధికారులపై తూటాలు కురిపించి హతమార్చే జాతీయవాది అన్నట్టు ప్రాచుర్యంలో వున్న భావనను మీరెలా చూస్తారు?
ఈ భావం సృష్టించింది బ్రిటిష్ వలస పాలన నాటి రికార్డులే. వాటిలో ఆయనను ఎప్పుడూ రక్తపిపాసుడైన జాతీయవాదిగా చిత్రించారు. దురదృష్టవశాత్తూ మనలో చాలా మందిమి ఒక వీర ఆరాధనతో ఆ కాల్పనిక ప్రతిమనే గర్వంగా స్వీకరించాము. ఈ క్రమంలో మనం ప్రపంచాన్ని మార్చాలనే మార్క్సిస్టు దృక్పథం ఆయనకు వుందన్న వాస్తవం నుంచి దారి తప్పి పోయాం. ఇప్పుడు ఆ భావానికి తిరిగి వెళ్లడం కష్టం. అయినా సరే ఆయన వదలి వెళ్లిన విస్తార విప్లవ సాహిత్యాన్ని మనం ఆకళింపు చేసుకోవాలి.
భగత్ సింగే స్వయంగా తాను టెర్రరిస్టునని ప్రకటించాడు. తర్వాత అది నిరర్థక మార్గమని గుర్తించాడు. ఈ విషాయాన్ని విశదీకరిస్తారా?
తరచుగా అలా జరుగుతుంటుంది. ఒక విప్లవకారుడుగా రూపొందే క్రమంలో భగత్ సింగ్ తనను తాను టెర్రరిస్టుగా చెప్పుకోవడం నిజమే. ఆయన దాన్నుంచి స్పష్టంగా విడగొట్టుకుని విస్త్రుత జన సమీకరణ అవసరాన్ని నొక్కి చెబుతూ వచ్చాడు.కార్మికులు, రైతులు, యువతను కూడగట్టాలన్నాడు.ఎనభైల మధ్య కాలం వరకూ చాలా మంది చరిత్రకారులు ఆయనను విప్లవ టెర్రరిస్టు అంటున్నా ఎలాంటి తీవ్ర అభ్యంతరాలు చెలరేగలేదు.అప్పుడాయన సోదరులు కూడా వుండేవారు గాని వారైనా ఈ లోపం ఎత్తి చూపలేదు. తర్వాత కాలంలో ప్రపంచవ్యాపితంగా టెర్రరిజం మరింత వికృత రూపం తీసుకున్నాకే ఈ అంశం పట్ల మనలో నిశితమైన స్పందన వచ్చింది. నా వరకు నాకు భగత్ సింగ్ ఎప్పుడూ జాతీయ విప్లవకారుడే.
భగత్ సింగ్ 'వసుధైక కుటుంబక' అంటూ విశ్వజనీన సహోదరత్వాన్ని ప్రబోధించినపుడు 'విశ్వ బంధుత' అన్నప్పుడు ఆయన భారతీయ సాంస్కృతిక విలువలనూ సామ్యవాద అంతర్జాతీయను మేళవించినట్టు భావించవచ్చునా?
ప్రగాఢమైన సామ్యవాద భావజాలంతో పాటు భారతీయ సాంస్కృతిక మూలాలు కూడా భగత్ సింగ్‌లో లోతుగా వేళ్లూనుకున్నాయి. ఈ రెంటినీ అతను చాలా అలవోకగా సమ్మిళితం చేయగలిగారు. తన చాలా రచనల్లో ఇది మనం చూడొచ్చు. ఆయన విశ్వ బంధుతతో మొదలుపెట్టాడు గాని అక్కడే ఆగిపోలేదు. నల్లవారు, తెల్లవారు, నాగరికులు, అనాగరికులు, పాలకులు, పాలితులు, స్పృశ్యులు, అస్పృశ్యులు వంటి పదాలు తేడాలు వున్నంత వరకూ విశ్వమానవ సహోదరత్వం సాధ్యం కాదని చెప్పే దశ వరకూ వెళ్లాడు.
జవహర్‌లాల్ నెహ్రూ, సుభాస్ చంద్రబోస్ గురించి భగత్ సింగ్ భావన ఏమిటి? ఈ రోజు నెహ్రూ, బోస్ పేరిట స్పర్థ నేపథ్యంలో ఆయన చారిత్రిక స్థానం ఏమిటి?
భగత్ సింగ్ వారిద్దరి గురించిన తన అభిప్రాయాలు ఒక వ్యాసంలో వివరంగా పేర్కొన్నారు. వారిద్దరూ అత్యంత ప్రసిద్ధులైన యువ నాయకులనీ, ఉనికిని చాటుతున్నారని తెలిపారు. 'వారిద్దరూ నిజమైన దేశభక్తులు. అయినా ఈ ఇద్దరు నాయకుల అభిప్రాయాల మధ్య చెప్పుకోదగిన విభేదాలు వున్నాయి' అని ఆయన అన్నారు. బోస్ ఒక సంస్కరణ వాది, ఆవేశపరుడైన బెంగాలీ. మరోవైపున భగత్ దృష్టిలో నెహ్రూ ఒక విప్లవకారుడు. యువతీయువకులను, మహిళలను నూతన సమాజం కోసం తిరుగుబాటు వైపు నడిపించగలిగాడు.'పంజాబీ యువత ఆయనను (నెహ్రూను) అనుసరించాలి. అ విధంగా విప్లవం అంటే నిజమైన అర్థం తెలుసుకోవాలి. హిందూస్తాన్‌లో విప్లవం అవసరాన్ని గుర్తించాలి. ప్రపంచంలో విప్లవం స్థానాన్ని తెలుసుకోవాలి.
మతతత్వం భగత్ సింగ్‌కు చాలా ఆందోళన కలిగించింది. అందుకు కొన్ని పత్రికలు కారణమని మతతత్వ నేతలు వాదించారు. ఆ వాదన ఇంకా వర్తిస్తుందా?
దురదృష్టవశాత్తూ నిజమే. ఈనాటి మన రాజకీయవేత్తలు, పార్టీలూ పచ్చి మతతత్వ విచ్ఛిన్నకర రాజకీయాల్లో మునిగి తేలుతున్నారు. అలాంటి నాయకులు రాజకీయంగా దివాళాకోరులని భగత్ సింగ్ భావించారు. భగత్ సింగ్‌ను ఆకాశానికెత్తుతున్నారు గాని చాలా రాజకీయ పార్టీలు ఆయన చిత్తరువును కేవలం ఓట్లు సంపాదించుకోవడానికే ఉపయోగిస్తున్నారు. అయితే అది ఆయనకున్న సమ్మిళిత దృక్పథం, విశ్వజనీన భావనకు విరుద్ధమైంది. అనైతికమైంది. ఒకప్పుడు గౌరవ ప్రదమైన వృత్తిగా వున్న జర్నలిజం ఇప్పుడు దుష్టశక్తిగా మారిందని భగత్ సింగ్ 1928లో రాశాడు. సంచలనాత్మక శీర్షికలతో ఉద్రేకాలు రెచ్చగొట్టి ప్రజలను ఒకరికి వ్యతిరేకంగా ఒకరిని రెచ్చగొడుతున్నారు. 'వార్తా పత్రికల నిజమైన కర్తవ్యం ప్రజలను విజ్ఞానవంతులను చేయడం, సంకుచితత్వం నుంచి విముక్తి కలిగించడం, మూఢత్వాన్ని తుదముట్టించడం, ప్రజలలో ఒక సౌభ్రాతృత్వ భావన సృష్టించడం, భారత దేశంలో ఉమ్మడి జాతీయ భావన తీసుకురావడం' అని రాశారు.
విద్యార్థులకు ఆయన ఇచ్చిన సందేశం ఇప్పుడు వర్తిస్తుందా?
పరాయి ప్రభుత్వ విధానాల గురించి చెబుతూ భగత్ సింగ్ ఇలా రాశాడు: 'అందువుల్ల ఇక్కడ ప్రభుత్వానికి నచ్చేదేది, కోపం తెప్పించేదేది? అన్న ప్రశ్న ముందుకొస్తుంది. పుట్టినప్పటి నుంచి మనం పిల్ల బుర్రలో వందిమాగధ తత్వం ఎక్కించేద్దామా?' అని ప్రశ్నించాడు. ఇది ఎంతగా అన్వయిస్తుందనేది సుస్పష్టం.