శ్రీ గరిమెళ్ళ సత్యనారాయణ గారి జయంతి జులై14న ఆసందర్భముగా
శ్రీ గరిమెళ్ళ సత్యనారాయణ గారు స్వాతంత్ర సమరయోధుడు జాతీయ గేయ కవి. రచయిత. గంజాం కలెక్టర్ కార్యాలములో గుమస్తాగా పనిచేశాడు, విజయనగరం ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయుడు, ప్రియాగ్రహారములో గ్రంధాలయ కార్యదర్శి, ఆనందవాణికి సంపాదకుడు. ఆచార్య రంగా, వాహిని పత్రికలో సహాయ సంపాదకుడుగా పనిచేశాడు. భారత స్వాతంత్ర్య సమర కాలంలో ఆంధ్రులను ఉత్తేజపరచి ప్రజా పాటల త్యాగయ్య గా ప్రశంశలు అందుకున్నాడు. భారత జాతీయ భక్తి భావము, వీర రసముతో ఉత్తేజ భరితంగా ఉండేవి. ఆయన రచన చేసిన గేయాలలో అనేక గీతాలు అమితంగా రంజింపచేసి స్వతంత్ర ఉద్యమానికి వన్నె తెచ్చాయి. " దండాలు దండాలు భారత మాత ' అనే గీతం కూడా ప్రజలను ఎంతగానో జాగృతం చేసి స్వాతంత్ర్య ఉద్యమంలోకి దేశము కొరకు సామాన్య జనానికి సయితం సాహసాన్ని నింపింది. మాకొద్దీ తెల్ల దొరతనం అంటు సాగె ఈ పాట ప్రతి వూరు, ప్రతి తెలుగు వాడి నోటా మార్మోగేది. స్వతంత్ర స్వచ్ఛంద సేవకులు ఖద్దరు దుస్తులు ధరించి, గాంధీటోపి పెట్టుకుని, బారులు తీరి మువ్వన్నెల జెండా ఎగరవేసుకుంటూ.
మాకొద్దీ తెల్లదొరతనం- దేవ, మాకొద్దీ తెల్లదొరతనం అంటూ ఆకాశం దద్దరిల్లేలా పాడుతూ వీధుల్లో కవాతు చేసేవారట. ఈ పాటను వ్రాసినందుకు ఆనాటి బ్రిటీషు కలెక్టరు బ్రేకన్ గరిమెళ్ళకు ఒక సంవత్సరం కఠిన కారాగార శిక్ష విధించాడు. జైలు నుంచి విడుదల కాగానే ప్రజలు ఆయనకు ఎన్నోచోట్ల సన్మానాలు చేశారు.
సత్యాగ్రహులకు గొప్ప తెగువను, ఉత్తేజాన్ని, ఉత్సాహాన్ని కలిగించింది. దేశభక్తి కవితలు వ్రాసి జైలుశిక్ష అనుభవించిన వారిలో ప్రథముడు గరిమెళ్ళ. నిజాయితీకి, సాహసానికి, దేశము కొరకు పోరాటము చేయటంలో పట్టుదల గలిగిన వాడు, నిర్భీతికి గరిమెళ్ళ మారుపేరుగా నిలిచాడు. ఆయనంత ప్రసిద్ధినొందిన జాతీయకవి ఆయన సమకాలీనులలో మరొకరులేరు. తెలుగునాట జాతీయ కవిత్వానికి నూతన ఒరవడి సృష్టించిన కవి ప్రముఖుడు గరిమెళ్ళ సత్యనారాయణ.
గరిమెళ్ళ రచనలు:
- స్వరాజ్య గీతాలు
- హరిజన పాటలు
- ఖండ కావ్యాలు, బాల గీతాలు
- భోగరాజు పట్టాభి సీతారామయ్య గారి - ఎకనామిక్ కాంక్ వెస్ట్ ఆఫ్ ఇండియా తెనుగనువాదం
- తిరుకురాళ్, నాందియార్ తమిళ రచనల తెనుగీకరణ
గరిమెళ్ళ సత్యనారాయణ సాహితీ సంకలనాలు - నాటి మేటి పత్రికలు కృష్ణ పత్రిక, ఆనందవాణి, ఢంకా, ఆంధ్ర ప్రభ, భారతి పత్రికలలో ప్రచురించబడ్డాయి.
స్వతంత్ర సమరయోదుడుగా జాతీయ కవిగా ప్రఖ్యాతి గాంచిన శ్రీ గరిమెళ్ళ సత్యనారాయణ గారు తెలుగు నాట భారతీయ భావాన్ని, స్వతంత్ర కాంక్షను ఆంధ్రులకు గేయ రూపములో కలగజేయటంలో సంపూర్ణముగా సఫలీకృతులు అయినారని చెప్పవచ్చు, భారతదేశానికి నిజాయితీగా, నిస్వార్ధముగా సేవలనందించిన మహోన్నత వ్యక్తి ఈ భారతీయుడు.