" ఇచ్చోటనే సత్కవీంద్రుని కమ్మని
కలము,నిప్పులలోన గరిగిపోయే..
యిచ్చోటనే భూములేలు రాజన్యుని
యధికారముద్రికలంతరించె!
యిచ్చోటనే లేత ఇల్లాల నల్లసౌరు
గంగలోన గలిసిపోయే...
"యిచ్చోటనే వెట్టి పేరెన్నికం గనుగొన్న
చిత్రలేఖుని కుంచియ నశించిపోయే!
"
శ్మశానం గురించి అద్భుతమైన వర్ణన"
" చాలరోజుల క్రితం ఒక బాటసారుల కుటుంబం ఒక ఇంటినందు రాత్రి ఆశ్రయం పొందింది. ఆ ఇంటివారు తమకు పేదవారైనా తమకున్నంతలో ఆథిత్యం ఇచ్చారు. ఉదయం బాటసారులు వెళుతూ కృతజ్ఞతలు తెలిపారు. సామానులన్నీ మూటగట్టుకుంటూ పక్షుల బోనులోని "కముజు"పక్షి లేకపోవడం గమనించారు.ఇంటి యజమాని తన ఐదేండ్ల పిల్లాడిని పిలిచి ,పక్షిని చూసావా అని అడిగాడు. లేదని సమాధానం చెప్పాడు..ఇంతలో ఇంటి మూలన గంప క్రింద కప్పిపెట్టిన పక్షి పెద్దగా అరిచింది.. ఇంకేముంది ? దొంగ దొరికిపోయాడు..అవమానంతో తలదించుకున్నాడు..అవమానభారం ఎలా వుంటుందో తెలుసుకున్నాడు..ఇంకెప్పుడు తలదించుకోకూడదనుకున్నాడు.
అయితే అప్పటి వరకు పచ్చిని పొలాల మధ్య హాయిగా సాగిన బాల్యం ఆరేళ్ళుదాటగానే "పాఠశాల"లోనికి అడుగుపెట్టింది. అంతే కులవివక్ష మాటలతో ఆ బాలుని మనసు కలతచెందింది.అవమానాలు భరించలేక ఆ బాలుడు ఎదురుతిరిగాడు..తనను అవమానించేవారిని చితకగొట్టేవాడు. ఆ బాలుని తండ్రిది కులాంతరవివాహం..తండ్రి యాదవ.తల్లి మాదిగకులస్థులు.ఆ రోజులలో సాంఘికదురాచారాలు ఎక్కువ. అంటరానితనం ఎక్కువ.. విద్యార్థి దశలోనే తనను అవమానించేవారిని వెంటనే ఎదరించడం అలవాటు చేసుకున్నాడు. ఆ బాలుడే మహాకవి సామ్రాట్ గా పేరుబడ్డ.గుర్రం.జాషువా!!
జాషువా గారు చిన్నతనం నుండే పాటలు బాగా పాడేవారు. చిత్రాలు బాగా వేసేవారు. క్రమంగా అతని మనసు కవిత్వం వైపు మళ్ళింది. దీనికి అతని బాల్య స్నేహితుడు తర్వాత మంచికవిగా పేరుబడ్డ దీపాల.పిచ్చయ్యశాస్త్రి. ఆయన సలహాలతో కవిత్వంలో మెళకువులు నేర్చుకున్నారు జాషువాగారు. తర్వాత జూపూడి.హనుమశాస్త్రి దగ్గర మేఘసందేశం,రఘువంశం,కుమారసంభవం నేర్చుకున్నాడు. మొదటిలో భావకత్వానికి ప్రాధాన్యతనిచ్చిన జాషువాగారు క్రమంగా సాంఘికదురాచారాలపై బాణం ఎక్కుబెట్టి,అభ్యుదయ కవిత్వం పై దృష్టిపెట్టారు. ఇలా సమకాలీన కవులలో సాంప్రదాయకవిత్వం నుండి అభ్యుదయ కవిత్వం వైపు మళ్ళించినవారిలో ఈయనే మొదటివారు.
1915లో మేరీ అనే అమ్మాయిని పెళ్ళి చేసుకొని ,,మిషనరీ పాఠశాలలో "మూడు"రూపాయలకు ఉపాధ్యాయుడిగా చేరాడు. అదీ సంవత్సరంలో పోయింది. 1916లో రాజమండ్రిలో సినిమా వాచకుడిగా పని చేశాడు.
తర్వాత గుంటూరు లూథరన్ ఉపాధ్యాయశిక్షణాలయంలో 10సంవత్సరాలు ఉపాధ్యాయుడిగా పనిచేశాడు. అయితే క్ర్రెస్తవునిగా వుంటూ హిందూ దేవుళ్ళను గురించి రాస్తున్నాడని ఆయనను క్ర్రెస్తవమతం నుండి బహిష్కరించారు. 1928 నుండి 1942 వరకు గుంటూరు ఉన్నతపాఠశాలలో తెలుగుపండితుడిగా పనిచేశాడు.
హిందూవులు అంటరానివాడిగా ఈసడించగా క్ర్రెస్తవులు వేరే మతాలగురించి రాస్తున్నాడని క్రీస్తుమతం నుండి వెలివేయగా మనసు విరిగిన జాషువా గారు "నాస్థికత్వం" వైపు వెళ్ళారు. ఆయన 1932లో రాసిన ఫిరదౌసీ లేఖ విమర్శకుల మన్నలను పొందింది, అలాగే 1941 లో ఆయన రాసిన "గబ్బిలం" సంచలనం సృష్టించింది.అంటరానితనం పై చర్చలకు దారితీసింది. గబ్బిళంలో ఒక అంటరాని యువకుడు కథానాయకుడు..కాశీనాధునికి విన్నవించుకుంటూ కవిత్వం చెబుతాడు. ఒక గబ్బిలం దేవాలయం లోనికి ప్రవేశించ వచ్చు..ఒక మనిషి ప్రవేశించరాదా అంటూ ఆవేధన చెందుతాడు.
1957_59 మధ్య మద్రాసు రేడియోకేంద్రంలో కార్యక్రమాల నిర్మాతగా పనిచేశారు.
1964లో ఆంథ్రప్రదేశ్ శాసనమండలిలో సభ్యుడిగా నియమించబడ్డారు.
జాషువా గారు 36 గ్రంధాలు రాశారు. చాలా కవితా ఖండికలు రాశారు.పిల్లల గురించి గేయాలు రాసారు.
క్రీస్తుచరిత్ర రాసినందుకు కేంద్రసాహిత్యఅకాడమీ బహుమతి వచ్చింది. విద్మవిభూషణ్ బిరుదు ఇచ్చారు. తిరుపతి వెంకటకవులలో ఒకరైన చెళ్ళపిళ్ళ వెంకటశాస్త్రి కి గండపెండేరం తొడిగి,కాళ్ళు కడిగి ఆ నీటిని తలపై జల్లుకొంటూ ..కంటి నిండా కన్నీరు ఒలుకుతుండగా "నా జన్మధన్యమైయ్యింది" అని గద్గత స్వరంతో అన్నారాయన.
ఎక్కడైతే అవమానాలు పడ్డారో అక్కడే సత్కారాలు పొందిన మహాకవి జాషువాగారు. కవి విశారద, కవికోకిల,కవి దిగ్గజ, నవయుగ చక్రవర్తి, మధుర శ్రీనాథ, విశ్వకవి సామ్రాట్ మొదలగు బిరుదులు పొందారాయన. ఎన్నో అవమానాలు పడ్డా .క్రుంగిపోకుండా తను అనుకున్నది సాధించిన జాషువా గారు ఆదర్శప్రాయుడు.. 1971 జూలై 24న అంటే ఇదే రోజు పరమదించారు. ఆయన పద్యాలు "హరిశ్ఛంద్ర"నాటకం ద్వారా ఆంథ్రదేశమంతా మారుమ్రోగాయి...