✳ఒకప్పుడు 'కీ' ఇవ్వడం ద్వారా ఒక సర్పిలాకార స్ప్రింగ్‌లోకి శక్తిని నింపినపుడు, అది తిరిగి యధాస్థితికి చేరే క్రమంలో విడుదల చేసే యాంత్రిక శక్తిని ఉపయోగించుకుని గడియారపు ముళ్లు తిరగేవి. నేడు ఎలక్ట్రానిక్స్ పరిజ్ఞానంలో వచ్చిన విప్లవాత్మక మార్పుల ద్వారా ప్రత్యేకమైన విద్యుత్ సర్క్యూట్ ద్వారా క్వార్ట్ ్జ(Quartz) స్ఫటికానికి విద్యుత్‌ను పంపినప్పుడు అది జరిపే సంకోచ వ్యాకోచాల యాంత్రిక శక్తితో గడియారపు ముళ్లను నడిపిస్తున్నారు.
ఈ సర్క్యూట్‌కు కావలసిన శక్తిని చిన్న బొత్తాము ఘటం(button cell) ద్వారా సమకూరుస్తారు. కాబట్టి పాత 'కీ' గడియారమైనా కొత్త క్వార్ట్ ్జ గడియారమైనా మొదట తన శక్తిని ఓ చక్రానికి బదలాయిస్తుంది. ఇది ఓ పళ్ల చక్రం (toothwheel). దీనికి వివిధ వ్యాసార్థాలు ఉన్న మూడు వేర్వేరు పళ్ల చక్రాలను అనుసంధానిస్తారు. ప్రధాన చక్రానికి ఉండే పళ్లకు అనుగుణంగా అనుసంధాన చక్రాలకు ఉన్న పళ్ల సంఖ్యను మార్చడం ద్వారా అవి వేర్వేరు వేగాలతో తిరిగేలా చేస్తారు. ఆ చక్రాలకే గడియారం డయల్‌పై తిరిగే ముళ్లను కలుపుతారు. ఆయా చక్రాల వేగాన్ని బట్టి గడియారంలో ఒక ముల్లు గంటలను, ఒక ముల్లు నిమిషాలను, మరో ముల్లు సెకన్లను సూచించేలా వేర్వేరు వేగాలతో తిరుగుతాయి. ఇలా అవసరాన్ని బట్టి మరిన్ని చక్రాలను, ముళ్లను కూడా అనుసంధానించుకోవచ్చును.