🐺🐇
ఒక అడవిలో ఒక నక్క ఉండేది. దానికి మూడు పిల్లలున్నాయి. తల్లి నక్క రోజూ తన పిల్లలకి కాసేపు వేట నేర్పించేది.
తమకంటే చిన్న జంతువులను ఎలా వేటాడాలో తర్ఫీదు ఇచ్చేది. ఒకరోజు అది తన పిల్లల్ని వెంట బెట్టుకుని, ఒక చెట్ల గుబురు చాటున మాటు వేసింది. అదుగో ఆ పొదలో ఒక కుందేలు వుంటుంది. అది తిండికోసం బయటకు వస్తుంది. అది కనిపించగానే మీలో ఎవరైనా ఒక్కరు- అమాంతం పోయి దాని మీద పడాలి” పిల్లలతో చెప్పింది తల్లి, నెమ్మదిగా అమ్మా నేనెళ్తానే…. నేనెళ్తానే….” అంటూ ఉత్సాహంగా అరిచింది అన్నింటిలోకీ పెద్ద దైన నక్కపిల్ల. “సరేలే, నువ్వే ముందు దూకు” అనుమతి ఇచ్చింది తల్లి నక్క ఇంతలో కుందేలు బయటికి వచ్చింది పొదలోంచి.
దాన్ని చూసీ చూడగానే నక్కపిల్ల అమాంతం ముందుకు ఉరికింది. అయితే కుందేలు మాత్రం ఏం చిన్నది నక్క రాకను పసికట్టనే కట్టింది కుందేలు. నక్కపిల్లకు చిక్కకుండా వాయువేగంతో పరుగు తీసింది.
నక్కపిల్ల దాన్ని వెంబడించింది- కానీ చూస్తూ చూస్తూండగానే అది ఇక నక్కకు అందనంత దూరం వెళ్ళిపోయింది. ముఖం వేలాడేసుకొని తల్లి దగ్గరి తిరిగి వచ్చింది నక్కపిల్ల. ఏంటమ్మా గొప్ప గొప్పగా కూసి వెళ్ళావు ఇప్పుడు ఆ చిట్టి కుందేలు కూడా తప్పించుకుపోయిందా, చేతులు ఊపుకుంటూ వస్తున్నావు మిగతా పిల్లలు దాన్ని వేళాకోళం చేసాయి.
అమ్మా నాకు అసలు వేటాడటంరాదేమోనమ్మా, అంత చిన్నకుందేలునుకూడా పట్టలేకపోయాను చూడు అవమానం పాలై, అనుమానంతో కన్నీళ్ళు పెట్టుకుంది నక్కపిల్ల. తల్లి నక్క దాన్ని ఓదారుస్తూ అన్నది- లోపం నీలో లేదు నాయనా నువ్వు నీ తమాషా కోసం దాని వెనక పరిగెత్తావు. అదేమో తన ప్రాణాలు రక్షించుకునేందుకు పరుగు పెట్టింది.
నిజంగా చూడు- నీ తమాషా కంటే దాని ప్రాణాలు బలమైనవి. అందుకని నీకంటే అదే వేగంగా పారిపోగల్గుతుంది. ఒకసారి నీ కడుపు ఆకలితో మాడిందనుకో, అప్పుడు నువ్వు ఇలాంటి కుందేళ్ళని ఎన్నింటినయినా పట్టగలవు అన్నది.