ఒక అడవిలో మూడు కోతులు ఉండేవి. మూడు కోతులూ
ఒకసారి 'చెడు వినకూడదు; చెడు మాట్లాడకూడదు;
చెడు చూడకూడదు' అని నిర్ణయించుకున్నాయి.
సరిగ్గా ఆ సమయానికి ప్రక్క
కొమ్మ మీద గూడు కట్టుకొని ఉన్న కోకిలమ్మ తన పిల్లలను గూటిలోనే వదిలి, మేతకోసం బయటికి వెళ్ళింది.
అది అటు వెళ్ళగానే పరదేశం నుండి వచ్చిన గద్ద ఒకటి ఆ పిల్లల్ని ఎత్తుకు పోయేందుకు
వచ్చి వాలింది. "ఓ! చెడు! చెడు! నేను దీన్ని చూడలేను!" అని ఒక కోతి కళ్ళు
మూసుకున్నది. ఊఊఊ " అంటూ నోరు మూసుకున్నది మరొక కోతి. "నేను ఈ అరుపులు వినలేను!
వినలేను!" అంటూ చెవులు మూసుకున్నది మూడో కోతి. సంతోష పడిన గద్ద కోకిల పిల్లలకు ఇంకా
దగ్గరికి వచ్చింది.
కోకిల పిల్లలు ప్రాణ భయంతో అరవటం మొదలెట్టాయి. అంతలో మూడు కోతులకూ చాలా సిగ్గు
వేసింది. "అసలు మంచి అంటే ఏమిటి?! చెడు అంటే ఏమిటి?!
ఇతర జంతువులకూ, పక్షులకూ, కీటకాలకూ అబద్ధాలు చెప్పడం చెడు. అట్లాగే తోటి పక్షులను, జంతువులను ఆపదల్లోకి నెట్టటం చెడు. అసలు అక్రమాలను చూడకుండా, వాటిని గురించి వినకుండా, వాటిని గురించి మాట్లాడకుండా
ఉండకూడదు! చెడును అర్థం చేసుకొని, ఎన్ని కష్టాలెదురైనా సరే,
పోరాడి చెడును అరికట్టాలి!
మనం 'చెడును వినకూడదు,చెడు మాట్లాడ కూడదు, చెడును చూడకూడదు' అనుకోవడం అసలు సరైనది కాదు! పోరాటమే మేలు!" అనుకున్నాయి.
చటుక్కున కోకిల పిల్లలను అవి ఉండే గూటితో
సహా- తీసుకెళ్ళి చెట్టు తొర్రలో పెట్టి, తొర్రకు
అడ్డంగా నిలబడ్డాయి. బెదిరించబోయిన గద్దన మూడూ
కలిసి తరిమేసాయి. కోకిల పిల్లల్ని కాపాడాయి.