ఆగస్టు 29 ‘తెలుగు భాషా దినోత్సవము’... గిడుగు రామమూర్తి పంతులు గారి జయంతి సందర్భంగా కొన్ని విషయాలు..🌹
👉తెలుగులో వాడుక భాషా ఉద్యమ పితామహుడైన గిడుగు వెంకట రామమూర్తి ఆగష్టు 29, 1863న శ్రీకాకుళం జిల్లా పర్వతాలపేట గ్రామంలో జన్మించారు. తండ్రి వీర్రాజు పర్వతాలపేట ఠాణాలో రెవెన్యూ అధికారిగా పనిచేస్తుండేవారు. రామమూర్తి ప్రాథమిక విద్య స్థానికంగానే కొనసాగింది. చిన్న వయస్సులోనే రామమూర్తి తండ్రిని కోల్పోయారు. విజయనగరంలో మేనమామగారి ఇంట్లో ఉంటూ రామమూర్తి చదువు కొనసాగించారు. 1879లో మెట్రిక్యులేషన్ పరీక్షలో ఉత్తీర్ణుడయ్యారు. ఆ రోజుల్లో గురజాడ అప్పారావు రామమూర్తికి సహాధ్యాయి. 1880లో పర్లాకిమిడి రాజావారి స్కూల్లో చరిత్ర బోధించే అధ్యాపకుడైనారు. ప్రైవేటుగా 1886లో ఎఫ్.ఏ., 1896లో బి.ఏ. పట్టా పొందారు. గ్రాంధికభాషలో ఉన్న తెలుగు వచనాన్ని ప్రజల వాడుకభాషలోకి తీసుకు వచ్చి, తెలుగులో వ్యావహారిక భాషోద్యమానికి మూలపురుషుడైనారు. గిడుగు రామ్మూర్తి జనవరి 22, 1940న మరణించారు. గిడుగు రామ్మూర్తి జయంతి ఆగష్టు 29 ని “తెలుగు భాషా దినోత్సవం” గా జరుపుకుంటున్నాము.
👉జననం : ఆగష్టు 29, 1863
👉స్వస్థలం : పర్వతాలపేట
జిల్లా శ్రీకాకుళం జిల్లా
👉మరణం: జనవరి 22, 1940
🍁సవర భాష పాండిత్యం:🍁
👉ఆరోజుల్లోనే అతనికి దగ్గర అడవుల్లో ఉండే సవరల భాష నేర్చుకొని వాళ్ళకు చదువు చెప్పాలనే కోరిక కలిగింది. తెలుగు, సవరభాషలు రెండూ వచ్చిన ఒక సవర వ్యవహర్తను ఇంట్లోనే పెట్టుకొని సవర భాష నేర్చుకున్నారు. సవరభాషలో పుస్తకాలు రాసి సొంతడబ్బుతో స్కూళ్ళు పెట్టి అధ్యాపకుల జీతాలు చెల్లించి సవరలకు వాళ్ళ భాషలోనే చదువు చెప్పే ఏర్పాట్లు చేశారు. మద్రాసు ప్రభుత్వం వారు ఈ కృషికి మెచ్చి 1913లో "రావ్ బహదూర్" బిరుదు ఇచ్చారు. భాషాశాస్త్రంలో అప్పుడప్పుడే వస్తున్న పుస్తకాలు చదివి వ్యాకరణ నిర్మాణ విధానం నేర్చుకొన్నారు. ముప్ఫై అయిదేళ్ళ కృషితో 1931లో ఇంగ్లీషులో సవరభాషా వ్యాకరణాన్ని, 1936లో సవర-ఇంగ్లీషు కోశాన్ని నిర్మించారు. మద్రాసు ప్రభుత్వం వారు గిడుగు ఆంగ్లంలో తయారుచేసిన సవరభాషా వ్యాకరణాన్ని 1931లోను, సవర-ఇంగ్లీషు కోశాన్ని 1938లోను అచ్చువేశారు. 1934లో ప్రభుత్వం అతనికి 'కైజర్-ఇ-హింద్ ' అనే స్వర్ణ పతకాన్నిచ్చి గౌరవించింది. "సవర" దక్షిణ ముండా భాష. మనదేశంలో మొట్టమొదట ముండా ఉపకుటుంబ భాషను శాస్త్రీయంగా పరిశీలించినవాడు గిడుగు రామమూర్తి. ఆస్ట్రో-ఏషియాటిక్ భాషా కుటుంబంలో ఒక శాఖ ముండాభాషలు. ఆర్యభాషా వ్యవహర్తలు మన దేశానికి రాకముందు (క్రీ.పూ. 15వ శతాబ్ది) నుంచి వీళ్ళు మనదేశంలో స్థిరపడ్డారు. వీరిని "శబరు"లనే ఆదిమజాతిగా ఐతరేయ బ్రాహ్మణం (క్రీ.పూ. 7వ శతాబ్ది) లో పేర్కొన్నారు.
🍁గుర్తింపులు, పురస్కారాలు:🍁
👉1934లో ప్రభుత్వం కైజర్ ఎ హింద్ బిరుదు ఇచ్చి గౌరవించింది
👉1913లో ప్రభుత్వం రావు సాహెబ్ బిరుదు ఇచ్చింది.
👉1938లో ఆంధ్ర విశ్వకళాపరిషత్తు కళాప్రపూర్ణతో గౌరవించింది.
రామ్మూర్తి జన్మదినాన్ని మాతృభాషాదినంగా జరుపుకుంటారు.