అక్కినేని నాగేశ్వరరావు. ఆయన 1923 సెప్టెంబరు 20న ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణాజిల్లా, గుడివాడ తాలూకాలోని రామాపురంలో జన్మించారు. తండ్రి అక్కినేని వెంకటరత్నం, తల్లి పున్నమ్మ. అక్కినేని
1949లో అన్నపూర్ణను వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు కుమారులు, ముగ్గురు కూతుర్లు. ప్రముఖ కథానాయకుడు అక్కినేని నాగార్జున వారి కుమారుడే. మొదటి నుంచి నాటక రంగంపై అక్కినేనికి మక్కువ ఎక్కువ. నాటకాల్లో ఎక్కువగా స్త్రీ పాత్రలు పోషించేవారు. ఆ నాటక రంగంపై ఉన్న అభిమానమే అక్కినేనిని తెలుగు చిత్ర పరిశ్రమకు దగ్గర చేసింది. అందమైన రాకుమారుడైనా, అమ్మాయిలను అల్లరి చేసే కళాశాల కుర్రాడైనా, భగ్న ప్రేమికుడైనా ప్రేక్షకులకు గుర్తుకు వచ్చే తొలిరూపం అక్కినేని. అంతలా ఆయా పాత్రల్లో తనదైన నటనతో ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేశారు అక్కినేని.
1941లో పి. పుల్లయ్య దర్శకత్వంలో వచ్చిన ‘ధర్మపత్ని’తో బాల నటుడిగా ఏఎన్నార్ సినీ ప్రయాణం మొదలైంది. ఆయన పూర్తి స్థాయి కథానాయకుడిగా నటించిన చిత్రం 1944లో ఘంటసాల బలరామయ్య తీసిన ‘సీతారామ జననం’. ఏఎన్నార్ దాదాపు తన 80 ఏళ్ల సినీ ప్రయాణంలో తెలుగు, తమిళ, హిందీ భాషల్లో సుమారు 250 పైగా సినిమాల్లో నటించారు. అనేక సాంఘిక, పౌరాణిక, జానపద సినిమాల్లో విభిన్నమైన పాత్రలు చేసి ప్రేక్షకులను మెప్పించారు. ఎక్కువగా విషాదాంతమైన ప్రేమ కథల్లో భగ్నప్రేమికుడిగా కనిపించిన అక్కినేని, ‘లైలా మజ్ను’, ‘అనార్కలి’, ‘బాటసారి’, ‘ప్రేమనగర్’, ‘ప్రేమాభిషేకం’, ‘మేఘసందేశం’ వంటి చిత్రాలతో పేరు తెచ్చుకున్నాడు. తెలుగు తెరకు తొలిసారి ద్విపాత్రాభినయాన్ని పరిచయం చేసిన అక్కినేని ‘నవరాత్రి’ సినిమాలో ఏకంగా తొమ్మిది పాత్రల్లో కనిపించి ప్రేక్షకులకు ఆశ్చర్యపరిచారు. ఏఎన్నార్ సినిమా కెరీర్‌లో మరపురాని చిత్రం ‘దేవదాసు’. ప్రేమలో ఓడిపోయి మందుకు బానిసైన భగ్నప్రేమికుడిగా అందులో అక్కినేని చూపిన అభినయానికి యావత్ భారత సినీ పరిశ్రమ దాసోహమైంది. ఆ తర్వాత మిగతా భాషల్లోనూ ‘దేవదాసు’ తెరకెక్కినా ఏఎన్నార్ స్థాయి నటనను ఏ నటుడు ప్రదర్శించలేక పోయాడు. ఇక సామాజిక నేపథ్యంగా తెరకెక్కిన ‘సంసారం’, ‘బతుకుదెరువు’, ‘ఆరాధన’, ‘దొంగరాముడు’, ‘డాక్టర్ చక్రవర్తి’, ‘అర్థాంగి’, ‘మాంగల్యబలం’, ‘ఇల్లరికం’, ‘దసరాబుల్లోడు’, ‘కాలేజీ బుల్లోడు’ వంటి సినిమాలు అక్కినేనికి మంచి పేరుతో పాటు లాభాలను అందించాయి. కేవలం నటుడుగానే కాకుండా నిర్మాతగానూ ఎన్నో చక్కని చిత్రాలు నిర్మించారు ఏఎన్నార్. 1975లో భార్య అన్నపూర్ణ పేరు మీద ‘అన్నపూర్ణ స్టూడియోస్’ స్థాపించిన అక్కినేని.. తొలి సినిమాగా ‘కళ్యాణి’ని తెరకెక్కించారు. ఇక ఆయన బ్యానర్ నుంచి వచ్చిన మొదటి బ్లాక్‌బస్టర్ మూవీ ‘ప్రేమాభిషేకం’. తెలుగు చలన చిత్ర పరిశ్రమను హైదరాబాదుకు రావడంలో ఏఎన్నార్ కృషి మరువలేనిది. తాను జీవించినంత కాలం నటుడుగానే జీవిస్తానన్న అక్కినేని.. తాను కోరుకున్నట్లుగానే చివరి వరకు సినిమాల్లో నటిస్తూనే ఉన్నారు. ఆయన చివరిగా నటించిన చిత్రం ‘మనం’. నిజంగా అది వారి కుటుంబానికి ఒక మధుర జ్ఞాపకం. 2014 జనవరి 22న 91 సంవత్సరాల వయసులో అక్కినేని కన్నుమూశారు.
అక్కినేని నాగేశ్వరరావు తన సినీ ప్రయాణంలో అనేక అవార్డులు అందుకున్నారు. ఆయన సినీ పరిశ్రమకు చేసిన సేవలను గుర్తించి.. భారత ప్రభుత్వం 1968లో పద్శశ్రీ, 1988లో పద్మభూషణ్, 2011లో పద్మవిభూషణ్ పురస్కారాలతో ఆయన్ను సత్కరించింది. భారత చలన చిత్ర రంగంలో అత్యున్నత పురస్కారమైన ‘దాదా సాహెబ్ ఫాల్కే’ అవార్డును 1991లో ఆనాటి రాష్ట్రపతి ఆర్.వెంకట్రామన్ చేతుల మీదుగా తీసుకున్నారు ఏఎన్నార్. 1994లో కౌన్సిల్ ఆఫ్ ఇండియన్ అసోసియేషన్ నుంచి ‘లైఫ్‌టైమ్ అఛీవ్‌మెంట్ అవార్డు’ అందుకున్నారు. వీటితో పాటు పలు జాతీయ, రాష్ట్ర స్థాయి అవార్డులు అందుకున్నారు అక్కినేని