*చరిత్రలో నేటి ప్రముఖ వ్యక్తి*
దాసరి సుబ్రహ్మణ్యం
*చందమామ కథా రచయిత మరియు చందమామ తొలితరం సంపాదకవర్గ సభ్యుడు. 1952లో (కొడవటిగంటి కుటుంబరావు కంటే నాలుగు సంవత్సరాల ముందు) చందమామలో చేరి, 2006 దాకా (అంటే 55 సంవత్సరాల కాలం) అందులోనే కొనసాగాడు.*
*జీవిత సంగ్రహం*
*తెనాలి ప్రాంతంలోని చుండూరు రైల్వేస్టేషన్ కు దగ్గర్లో ఉన్న పెదగాదెలవర్రులో జన్మించిన ఆయన, 2010 జనవరి 27వ తేది సా. 5 గం.లకు విజయవాడలో వారి అన్నయ్య శ్రీ ఈశ్వర ప్రభు గారి కుమార్తె శ్రీమతి గోళ్ళ ఝాన్సి గారి ఇంట్లో కన్నుమూశాడు.*
*పెద్దగా చదువుకోక పోయినా నిరంతర అధ్యయనంతో, పెద్దన్నయ్య ఈశ్వర ప్రభు సాహచర్యంలో బాల్యంలోనే తెలుగు ప్రబంధ కావ్యాలు, పంచతంత్ర కథలు, కథా సరిత్సాగరం లాంటి పుస్తకాలను ఆపోశన పట్టాడు.*
*ధారావాహికల రచనలో మంచి ప్రతిభ కలిగిన దాసరి 12 ధారావాహికలను రాశాడు. ఆయన సృష్టించిన ఖడ్గవర్మ, జీవదత్తుడు, పింగళుడు, శిఖిముఖి, విక్రమ కేసరి, మౌగ్లీ, కాలశంబరుడు మొదలైన పాత్రలు తెలుగు వారికి సుపరిచితాలు.*
*చందమామలో చేరక ముందు ఆయన కమ్యూనిజాన్నీ, హేతువాదాన్ని అధ్యయనం చేశాడు. పదహారేళ్ళకే కమ్యూనిస్టు ఉద్యమంలో పాలుపంచుకున్నాడు. జైలుకు వెళ్ళాడు. బోధన్ చక్కెర కర్మాగారంలో, మహారాష్ట్రలోని ఆంగ్లేయుల సైనిక శిక్షణా శిబిరంలో కూడా కొద్ది రోజుల పాటు పనిచేశాడు. తరువాత ఆ ఉద్యోగాన్ని వదిలి పాండిచ్చేరి చేరుకున్నాడు. అక్కడ అరవిందాశ్రమం ప్రెస్ లో తెలుగు కంపోజర్ గా, ప్రూఫ్ రీడర్ గా పనిచేశాడు. మెల్ల మెల్లగా పత్రికా సంపాదకులతో పరియాలు పెరిగాయి.*
*వాటి ప్రభావంతో చిత్రగుప్త, తెలుగు స్వతంత్ర, అభిసారిక వంటి పత్రికల్లో సాంఘిక కథలు రాయటం అలవాటయ్యింది. అప్పుడే చక్రపాణి నుంచి పిలుపు రావడంతో చందమామలో చేరాడు. అక్కడ చేరిన మొదట్లో సాదా కథలతో సరిపెట్టుకున్న ఆయన రాజారావు ఆకస్మిక మరణంతో ఆయన రాస్తూ వచ్చిన సీరియల్ విభాగంలో దాసరికి అవకాశం వచ్చింది. ఆయన రాసిన మొట్ట మొదటి సీరియల్ తోకచుక్క. అది బాల సాహిత్య చరిత్రలో సంచలనం సృష్టించింది. ఆ తర్వాత మరో పాతికేళ్ళపాటు ఆయన ధారావాహికలు చందమామలో నిరాటంకంగా ప్రచురితమయ్యాయి. వ్యక్తిగత కారణాలతో 1978 తర్వాత ఆయన సీరియల్స్ రాయడం మానుకున్నాడు.*
*ఆయనకు కుటుంబం అంటూ ఏదీ ఉండేది కాదు. చందమామ ఆఫీసు ప్రాంతంలోనే గది తీసుకుని ఒంటరిగా ఉండేవాడు. ఆయనకు పెళ్ళి అయి, ఒక కూతురు కూడా ఉన్నప్పటికీ ఆయనతో ఎవరూ ఉండేవారు కారని ఒక సందర్భంలో కొడవటిగంటి కుటుంబరావు తెలియజేశాడు.*