హిందువులకు పూజలు, వ్రతాలు ఎక్కువే.
ఒక్కో పండుగకూ ఒక్కో రకమైన పూజ, వ్రత విధానాలు ఉంటాయి. ఎలా
చేసినా... భక్తితో, నిర్మలమైన మనస్సుతో పూజ చేస్తే... ఏ
దైవమైనా కరుణిస్తారు. మరి చంద్రమానం, సౌరమానం కలయికతో
జరుపుకునే వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశికి ఎలాంటి పూజా విధానం పాటించాలి. 33 కోట్ల మంది దేవతలతో కలిసి... విష్ణుమూర్తి... భూలోకానికి విచ్చేసే అద్భుత
ఘడియలు ఇవి. ఈ రోజున ఉత్తర ద్వారం గుండా స్వామిని దర్శించుకుంటే... అంతకంటే
కావాల్సినది ఏముంటుంది? గ్రహ దోషాలు తొలగిపోతాయి. అందుకే...
ఈ అవకాశం కల్పిస్తూ... తిరుమలలో ఈనెల 6న (సోమవారం) ఉదయం
ధనుర్మాస కైంకర్యాల తర్వాత తెల్లవారు జామున 2 గంటల నుంచి
వైకుంఠ ద్వార దర్శనం ప్రారంభం అవుతుంది.
ఉదయం 5
గంటల నుంచి సర్వదర్శనం ప్రారంభిస్తారు.
పూజా విధానం
ముక్కోటి ఏకాదశి రోజున పూజ, ఉపవాస
దీక్ష చేస్తే... పాపాలు తొలగిపోవడమే కాదు... అష్టైశ్వర్యం కలుగుతుందని పండితులు
చెబుతున్నారు. ఈ రోజు చేసే పూజలు, దానాల వల్ల ఏడాదిలో ప్రతి
ఏకాదశికీ చేసినంత పుణ్యం దక్కుతుంది. ఈ రోజున ఏ చిన్న మంచి పని చేసినా... ఏడు
జన్మల పాపాలు తొలగిపోతాయని ప్రతీతి. వైకుంఠ ఏకాదశి నాడు సూర్యోదయానికి ముందే
నిద్రలేచి, తలస్నానం చేయాలి. ఆల్రెడీ ముందుగానే శుభ్రపరచి
ఉంచుకున్న పూజ గదిలో... వీలైతే మామిడి ఆకుల్ని తోరణాలుగా కట్టాలి. పసుపు, కుంకుమ బొట్లతో అలంకరించాలి. విష్ణుమూర్తి విగ్రహాన్ని ఉంచి... పూజ
చెయ్యాలి. పూలు, తులశిదళాలతో పూజించాలి. కొద్దికొద్దిగా పూల
రేకులు స్వామి విగ్రహంపైగానీ... స్వామి పాదాలపై గానీ వేస్తూ... పూజ చేస్తే...
స్వామి పరమానందభరితులై కటాక్షిస్తారని ప్రతీతి.
స్వామిని పూజించేందుకు ప్రత్యేక
పూజా పఠన పుస్తకాలుంటాయి. వాటిని కొనుక్కొని పూజించవచ్చు. లేదంటే... స్వామిని
మనసారా తలచుకుంటూ... పూలు చల్లుతూ మీకు వచ్చినట్లుగా పూజ చెయ్యవచ్చు. ఎలా
చేసినా... నిర్మలమైన మనసుతో... జ్ఞానేంద్రియాలన్నీ లగ్నం చేసి పూజించాలి. అప్పుడు
పూజా ఫలం దక్కుతుందని పండితులు చెబుతున్నారు. దీక్షా సమయంలో తులసితీర్థం తీసుకుంటూ
పూజ చేస్తే... మంచి ఫలితం దక్కుతుంది.
పురాణ గాథ
హైందవుల పండుగలన్నీ అయితే చంద్రమానం
ప్రకారమో లేక సౌరమానం ప్రకారమో జరుపుకొంటారు. కానీ ఈ రెండింటి కలయికతో ఆచరించే
పండుగ ఒకే ఒక్కటి. అదే ముక్కోటి! సూర్యుడు ధనుసు రాశిలో ప్రవేశించిన తరువాత
(సౌరమానం) వచ్చే శుద్ధ ఏకాదశి (చంద్రమానం) రోజున ముక్కోటి ఏకాదశిని వైభవంగా
జరుపుకొంటారు. ఈ పుణ్యతిథి గురించి మరిన్ని విశేషాలు…
Mukkoti Ekadasi / Vaikunta Ekadasi ముక్కోటి ఏకాదశి / వైకుంఠ ఏకాదశి - పురాణ గాధ ,ప్రాముఖ్యత
ఈ రోజున ముక్కోటి దేవతలందరూ
విష్ణుమూర్తిని దర్శించుకున్నారని ఓ గాథ. అందుకనే ఈ రోజుకి ముక్కోటి ఏకాదశి అన్న
పేరు వచ్చిందట. ఇక ఈనాడే మధుకైటభులనే రాక్షసులకి శాపవిమోచనం కలిగించి, వారికి
తన వైకుంఠ ద్వారం వద్ద దర్శనాన్ని అనుగ్రహించాడు విష్ణుభగవానుడు. తమలాగే ఈరోజున
ఎవరైతే వైకుంఠ ద్వారాన్ని పోలిన ఉత్తరద్వారాన్ని నిర్మించి స్వామిని
దర్శించుకుంటారో, వారికి మోక్షాన్ని ప్రసాదించమని
వేడుకున్నారట వారిరువురూ. అప్పటినుంచీ ఉత్తర ద్వారం గుండా శ్రీవారిని దర్శించుకునే
ఆచారం మొదలైంది. ఈ ఏకాదశినాడే వైకుంఠంలోని విష్ణుమూర్తివారి ఆంతరంగిక ద్వారాలు
తెరుచుకున్నాయి కాబట్టి దీనికి ‘వైకుంఠ ఏకాదశి’ అన్న పేరూ స్థిరపడింది.
అసలు ఏకాదశి అంటేనే హిందువులకి పరమ
పవిత్రమైన రోజు. పూర్వం మురాసురుడనే రాక్షసుని సంహరించేందుకు, విష్ణుమూర్తి
నుంచి ఒక అంశ వెలువడిందట. ఆమే ఏకాదశి అనే దేవత! ఏకాదశి సేవకు మెచ్చిన విష్ణుమూర్తి,
తిథులలోకెల్లా ఏకాదశి గొప్ప తిథిగా ఎంచబడుతుందనీ, ఎవరైతే ఆ రోజు నిష్ఠగా ఏకాదశి వ్రతాన్ని చేస్తారో వారు వైకుంఠాన్ని
చేరుకుంటారనీ వరాన్ని ఒసగాడు. అందుకనే ప్రతి ఏకాదశినాడూ మన పెద్దలు క్రమం
తప్పకుండా ఉపవాసం చేసేవారు. దీని వల్ల ఏకాదశి ఫలం అనే పుణ్యమూ, ఆరోగ్యమనే పురుషార్థమూ రెండూ లభించేవి. అయితే సూర్యడు ఉత్తరాయణంలోకి
ప్రవేశించే ఈ ధనుర్మాసంలోని ముక్కోటి ఏకాదశినాడు కనుక ఉపవాసం చేస్తే, మిగతా ఏకాదశి రోజులలన్నింటిలోనూ ఉపవాసం ఉన్నంత ఫలం దక్కుతుందని నమ్మకం.
వైకుంఠ ఏకాదశినాడు తప్పకుండా
ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ వ్రత విధానం ప్రకారం దశమినాటి రాత్రి నుంచే
ఉపవాసానికి ఉపక్రమించాలి. ఏకాదశినాడు కేవలం తులసితీర్థాన్ని మాత్రమే సేవిస్తూ
ఆహారానికి దూరంగా ఉండాలి. ముఖ్యంగా ఏకాదశినాడు బియ్యంలో మురాసురుడు నివసిస్తాడని
చెబుతారు. బియ్యంతో చేసిన ఆహారం పూర్తిగా నిషిద్ధం అని కరాఖండిగా చెప్పేందుకే ఈ
మాట అని ఉంటారు. ఏకాదశినాడు కేవలం ఉపవాసం ఉండటమే కాదు… ధ్యానంతోనూ,
జపతపాలతోనూ కాలం గడపమని సూచిస్తారు పెద్దలు. ఇక ఆ రాత్రి కూడా
భగవన్నామస్మరణతో జాగరణ చేయాలి. ఆకలి రుచి ఎరుగదు, నిద్ర
సుఖమెరుగదు అన్నారు కదా! ఆ ఆకలి, నిద్రలు రెంటినీ తట్టుకుని,
వాటిని అదుపులో ఉంచుకోవడమే ఏకాదశి వ్రత విశిష్ఠత. ఇక మరునాడు
ద్వాదశినాడు ఎవరికన్నా అన్నదానం చేసి ఆ తరువాత ఉపవాసాన్ని విరమించాలి.
వైకుంఠ ఏకాదశినాడు వైష్ణవాలయాల్లో
ప్రత్యేకంగా తెరిచి ఉంచే వైకుంఠ ద్వారంగుండా స్వామివారిని దర్శించుకునేందుకు
భక్తులు ఎదురుచూస్తారు. కలియుగ వైకుంఠమైన తిరుమలలో కూడా ఈనాడు, శ్రీవారి
గర్భాలయాన్ని ఆనుకుని ఉన్న వైకుంఠప్రదక్షిణ మార్గం ద్వారా భక్తులు నడిచే భాగ్యం
లభిస్తుంది. ఏకాదశినాడు తిరుమలలో జరిగే మలయప్ప స్వామివారి ఊరేగింపు, ద్వాదశినాడు స్వామివారి పుష్కరణిలో జరిగే చక్రస్నానాలను దర్శించిన భక్తులు
పుణీతులవుతారు.
ముక్కోటి ఏకాదశి మార్గశిర మాసంలో
వస్తే కనుక ఆ ఏకాదశిని మోక్షదైకాదశి అని కూడా అంటారు. వైఖానసుడు అనే ఒక రాజు తన
తండ్రిని నరకలోకం నుంచి తప్పించేందుకు ఏకాదశి వ్రతాన్ని నిష్ఠాగా ఆచరించాడట. ఆతని
వ్రత ఫలితంగా తండ్రి నరకం నుంచి విడుదలై స్వర్గలోకానికి చేరుకున్నాడట. అందుకని ఈ
ఏకాదశికి మోక్షదైకాదశి అన్న పేరు వచ్చింది.