అందుకోవమ్మా ఈ మా గండపెండేరం.. అందుకోవమ్మా..
************
నారుమడిలో మన్నుతో తడిసిన బుట్టబొమ్మ ;
పచ్చపచ్చని పైరు పండడానికి నడ్డి వంచి మడ్డిలో తిరుగాడే చింతలేని చిలుకమ్మా !
మన్నునే పసిడిపూత పూసుకున్న పుత్తడి బొమ్మ !!
వాన చినుకుల్లో తడిసి ముద్ద ఐన ముత్యాల సిరిమువ్వ !
నీవు ఎలాంటి దానవో తెలుసా !!
వంటినిండా మన్ను,చేతినిండా మన్నికైన పని,పైరుపైనే ధ్యాస,
కంటి నిండా ఆనందపు ధరహాస్యంలాడే ధాన్యసిరులు పండించే ధాన్యలక్ష్మీ !!!
నీ చెమట( స్వేదన) ధారలతో పలువురికి కడుపు నింపే అన్నపూర్ణేశ్వరివి !
కలాకపటం ఎరుగని ధరణి పుత్రికవు !!
కష్టాలసుఖాలు ఎరిగిన కరుణా నేత్రివి !!
నీ మోమున తరగని నీ అందచందాలు,
నీ హృదయాన్ని కదిలించే మా ఆకలి దప్పికలు తీర్చే రాజ్యలక్ష్మీవి !!
నీ నల్లని వర్ణం మా తెల్లని బువ్వ !
నీ కాయ కష్టం మాకు అందే జీవరస మయం !!
నీ కాళ్ళతో నిసార మన్నును సారవంతం చేసి ,
కలుపుమొక్కలను కూకటి వేళ్లతో పెకలించి,
అందరినోటిలో అమృతరసం పోయుదువు !
నీ చేతికి కులం లేదు, మతం లేదు,
నీకు రంగులేదు,పొంగులేదు,ఎగిరే గుణం లేదు,
నీకు ఉండేది ఒకటే ,పిడికిలితో పంట పండించి అందరి ఇంట ఆకలి రోదనలు ఆపడమే!!
అందుకే నీవు కృషివలుని పుత్రికవు !!!
అందుకే నీలో మందహాసం,
ఆనందపు సోయగాలు !
అందుకే నీవు పుడమి తల్లి నిజపుత్రికవు !!
అందరి ఆరోగ్యాన్ని, ఆయువును, పెంచే ఆరోగ్యాదాయినివి!!
అందరి భాగ్యరాతలు రాసే,పంచే
అందరికీ నీవే భాగ్యలక్ష్మీవి !!!
అందుకే అందుకోవమ్మా ధరణి పుత్రికా, ఈ మా గండపెండేరం ..అందుకోవమ్మా !!!
చురకశ్రీ...సయ్యద్ హయ్యూల్ హయ్యూమ్,కావలి.