పోరు, హోరైన పోరు, జోరైన పోరు
కదిలిన ట్రాక్టర్లు ;
లేచిన లాఠీలు పగిలిన వీపులు,ఊడిన చర్మాలు!కందిపోయిన శరీరాలు!హలం పట్టి బువ్వపెట్టిన చేతులు తగిలిన వాతలు!!
గాయపడి నడ్డి విరిగిన కర్షకుడు,రైతే రాజు అంటే సంబరం!సేవకుడి చేత దండన అంబరం !!
హక్కుకోసం హాలికుడి ఆరాటం,చట్టరద్దు కోసం పోరాటం !
కొందరు ఆడే నాటకంలో పావు అవుతుంది ఎవరు?లావు అవుతుంది ఎవరు?
చిక్కు ముడి ఎక్కడ?విప్పేది ఎక్కడ? ఎవరు?
వీధి పోరు కాదు!వర్గపోరు అంతకన్నా కానే కాదు రైతు కవాతు కానే కాదు
రైతు పోరు,రౌతు పోతుగాంభీర్యంవీడి" కాపు" మెప్పు కోరు ఓ కాపలాదారు
"సేద్య కాడు " ఆకలితో ఉంటూ కలి ఆకలితీర్చే
కలి ఉత్తమపురుషుడు ప్రతాపంవద్దు మహాశయా!!
కృషీవలుడు ఋషి కన్నా గొప్ప అని మరిచితే మన్ను సున్నం అగు "గను"తో పంటకాపును పడగొట్టి హడలుగొట్టాలని చూడకు!!
కోటగోడలు సైతం బీటలు వారు భేషజాలు వదలి వ్యవసాయదారున కు తోడు నీడలా ఉంటూ
పది కాలాల పాటు పదిలంగా ఉండు దొర !
క్షేత్రజీవుడు క్షతగాత్రుడు ఐతే ఎలా? క్షేమంగా ఉంటే రాజ్య క్షేత్రం సుభిక్షం మరవకు ఓ అధినాయకా!!
చట్టం ప్రజలకు, ప్రభుత్వానికి సమతూకం కావాలి ;
ఇంకెవరికి చుట్టం కారాదు మహానాయకా!!!
రైతు కంట కన్నీరు! రౌతుకు పన్నీరా ? వలదు;
రైతు పోయాకా ,రౌతు ఏడ్చిన ఒకటే, ఏలక పోయినా ఒకటే ప్రభూ!!
రచన..సయ్యద్ హయ్యూల్ హయ్యూమ్ (చురకశ్రీ )కావలి.