ఇరు మనసుల ముసుగులో ముసిరే భావాలు వెదజల్లుతూ!
ఉత్సాహంతో ఉరకలు వేస్తూ వలచిన మదిని వెతుకుతూ చేరువ అయ్యే హృదయాల సంగమం !!
స్పందనలకు ప్రతిస్పందనలు తోడై,నీడై, తుదకు జాడై ;
పడిగాపుల జలదరింపుల తడిలో చిగురించే యువ జడివాన!
తడిసిముద్ద అయ్యే రోజు ప్రేమికుల రోజు, రతి మన్మధులు జత కలిసే రోజు,
ప్రేమపావురాల ముచ్చట్లు ఆడే రోజు! గుచ్చుకునే జంట గులాబీలు ముద్దాడే ముచ్చటైన రోజు,ఒకరితో ఒకరు మనసులను ఇచ్చి పుచ్చుకొనే మధురమైన రోజు!!
"వాలెంటైన్స్" డే !
అది బ్యాలెట్ లాంటిది అది ఒకటైయాక "మది గది బాక్స్" లోనే పదిలం !
బ్యాలెన్స్ తప్పితే వ్యాక్సిన్ లేదు,రానేరాదు!!
తల రాత తిరిగితే నీ పరువం నీ పరువు మంట కలిసి మాడి మసి, అయి బూడిద అగు !
ఆకర్షణ సరైనదే, వికర్షణ అయితే మోదం కాదు !
అతి ఎన్నటికీ ఇబ్బందే; ఇష్టం అయితే సరి; కానప్పటికీ ఇష్టపడే వదులుకోవడం ఉత్తమం !!
వలచిన మనసునకు కలచివేసి కుంగదీసిన అదుపుచేసే దొమ్మ ఉండాలి !
డీలా పడి గిలగిలాడితే పిరికితనమే దానికి ఏ టీకా పనిచేయదు!!
మోహం మోసం అయితే, ఘోరం,పరిణయం ఎప్పుడూ, ఎప్పటికీ ప్రళయమే !!
ప్రేమ మమైక్యమే అది మైకం కాదు; గుప్పెడంత మనసు లో గంపడంత ఆశలు కల్పించి సప్పరించి చిదరించి చితికి దగ్గరగా చేయరాదు !
ఎద దరిలో చేరి షికారు చేసి దిగాలు చేయరాదు !!చెందరాదు!!!
ఒక్కొక్కసారి అనుకున్నవన్నీ జరగక పోవచ్చు అంతమాత్రాన నిన్ను నీవు దహించక సహించు!
అదే లోకం కాదు మనసు పెట్టి ఆలోచించు అదే జీవితం కాకపోవచ్చు !!
మనసు మనసు తో జతకట్టి ఆకులో ఆకువై,కొమ్మలో కొమ్మవై రెమ్మలో రెమ్మవై !
ఎన్నటికీ ,ఎప్పటికీ విడదీయరాని బంధమై మమతలు పంచే అనుభూతులతో రాగసుధలు చిందిస్తూ !!
నట్టింట నిటారైన ఆధారమై కలకాలం నిలచి కడకు కట్టెలో కట్టవై! ఉండిపో!! అదే నిజమైన రెండు అక్షరాల ,రెండు హృదయాల శ్వాస నిశ్వాసే,ప్రేమ!
అది సరస విలాస సరిగమల పదనిసలు కావులే!!
నమ్మక విశ్వాసలే అసలైన ప్రేమ!అందుకే అంటారు ప్రేమంటే సులువు కాదు ప్రేమికులారా!!
రచన..సయ్యద్ హయ్యూల్ హయ్యూమ్ (చురకశ్రీ )కావలి