- ఇంట్లో ఎవరైనా మరణిస్తే ఏడాది వరకు పూజలు చేయకూడదా?దైవకార్యాలకు విరాళాలు ఇవ్వకూడదా? అని కొందరి అనుమానం
- కుటుంబసభ్యులు ఎవరైనా మరణిస్తే, ఏడాదివరకు ఎటువంటి పూజలు చేయకూడదని,దైవ సంబంధ కార్యాలకు విరాళాలు, చందాలు ఇవ్వకూడదని ప్రచారం చేస్తున్నారు.
- కొందరైతే కనీసం దీపం కూడా వెలిగించరు. దేవతలందరిని ఒక బట్టలోచుట్టి, అటక మీదపెట్టేస్తారు. సంవత్సరీకాలన్నీ అయిపోయాక మరుసటి ఏడాది దేవుళ్ళ చిత్రపటాలను క్రిందకు దింపి, శుభ్రంచేసి పూజచేస్తారు. అంటే ఆ వ్యక్తి మరణించిన ఇంట్లో ఏడాదిపాటు దీపారాధాన, దైవానికిపూజ, నివేదన ఉండవన్నమాట. ఇది సరైన పద్ధతి కాదు. శాస్త్రం ఇలా చెప్పలేదు.
- దైవ సంబంధిత కార్యాలకు సేవా కార్యక్రమాలకు ఈ ఏటి సూతక సమయంలో ఇచ్చిన విరాళాలకు అత్యంత విశేష ఫలితాలు కలుగుతాయి. అందుకే పూర్వకాలంలో శాశ్వత ఉభయాలు,సేవలు ఏర్పాటు చేసికొన్నారు.ఏ విపత్తులు సంభవించినా ఈ కార్యక్రమాలు ఆపకూడదనే ఉద్దేశంతో..ఈ సమయం లో చేసిన దానధర్మాలు,దైవకార్య విరాళాల వలన పైలోకాన ఉన్న పితృదేవతలకు శాంతి కలుగుతుంది.. వారికి, వారి ద్వారా మనకు దైవానుగ్రహం తో విశేషఫలితాలు కలుగుతాయి.వంశ వృద్ధి కలుగుతుంది.
- దీపంలేనిఇల్లు స్మశానంతోసమానం. దీపం శుభానికిసంకేతం. దీపం ఎక్కడ వెలిగిస్తే అక్కడకు దేవతలొస్తారు. ప్రతిఇంట్లోను నిత్యదీపారాధాన జరగాలి. మరణం సంభవించిన ఇంట్లో 11 వరోజు తర్వాత శుద్ధి కార్యక్రమం జరుగుతుంది. 12 వరోజు శుభస్వీకారం జరుగుతుంది. ఆ కుటుంబం ఆ 11 రోజులు మాత్రమే ప్రత్యేకంగా పూజచేయకూడదు. అంతవరకే శాస్త్రంలో చెప్పబడింది. అంతేకానీ ఏడాదిపాటు దీపం వెలిగించకూడదని, పూజలు చేయకూడదనికాదు.
- నిజానికి సూతకంలో ఉన్న సమయంలో కూడా సంధ్యావందనం చేయాలని, అర్ఘ్యప్రధానం వరకు బాహ్యంలోచేసి, మిగితాది మానసికంగా చేయాలని శాస్త్రంచెప్పింది.
- ఏడాదిపాటు ఆలయాలకు వెళ్ళకూడదని కూడా చెప్పలేదు.
- మనం నిత్యం ఇంతకముందు ఏదైతే చేస్తున్నామో, అది నిరభ్యంతరంగా చేసుకోవచ్చు. కొత్త పూజలు అనేవి ప్రారంభించకూడదు.
- ఇంతకముందు,రోజూ ఆలయానికి వెళ్తుంటే, సూతకం అయ్యాకకూడా యధావిధిగా ఆలయదర్శనం చేయవచ్చు.
- మనం నిత్యం అర్చించడంవలన మనం పూజించే చిత్రపటాల్లో దేవతలు వచ్చి కూర్చుంటారు. అలా ఏడాదిపాటు వారికి ధూప, దీప, నైవేధ్యాలు మొదలైన ఉపచారాలు చేయకుండా, బట్టలోచుట్టి పక్కనపెట్టడమే తప్పు. అది దోషము, అరిష్టము కూడా. కనుక తప్పకుండా ఇంట్లో నిత్య దీపారాధన, దైవారాధన జరగాలి. ఇంటికిగానీ, ఇంటి సభ్యులకు కానీ ఎలాంటి దోషాలున్నా, వాటిని అన్నిటిని ఆపే శక్తి ఆ ఇంట్లోచేసే దైవారాధనకు ఉంటుంది. కనుక ఎన్నడూ దైవారాధన, దీపారాధన మానకూడదు. పూజలు తప్పకుండా చేసితీరాలి.