Type Here to Get Search Results !

ప్రస్తుత బాల్యం వెలవెల పోయెదానికి మూల్యం ప్రస్తుత మాయే

0
జారే అరుగుల ధ్యాసే లేదు
 పిర్ర పై చిరుగుల ఊసేలేదు

 అమ్మ చేతి మురుకులు లేవు
 అలసట లేని పరుగులు లేవు

ఎత్తరగులు మొత్తం పోయే
రచ్చబండలూ మచ్చుకు లేవు

 వీధిలో పిల్లలు అల్లరి లేదు
 తాతలు ఇచ్చే చిల్లర లేదు

 ఏడు పెంకులు ఏమైపోయే
 ఎద్దు రంకెలు యాడకి పోయె

ఎక్కడా ఎదురు తడికెలు లేవు
 ఏ తడికకీ భోగి పిడకలు లేవు

కూరలమ్మే సంతలు లేవు 
పెరుగులమ్మే ముంతలు లేవు 
బువ్వా లాటల విందే లేదు
గవ్వలాటలు ముందే లేదు

కుప్పిగంతులు లేనే లేవు 
కళ్ళ గంతలు కానే రావు

కోకో మూతల గోలే లేదు 
బచ్చాలాడే ఇచ్చా లేదు

 కోతి కొమ్మచ్చి ఏమైపోయే
మాత అప్పచ్చి ముందే పాయె

 గూటీ బిళ్ళా గూటికి పోయే
తొక్కుడు బిళ్ళకు రెక్కలు వచ్చె

గచ్చకాయలు మచ్చుకు లేవు
చింత పిక్కలు లెక్కకూ లేవు

ధారగా కారే ముక్కులు లేవు 
జోరుగా జారే లాగులు లేవు

కొబ్బరి పుచ్చు కొరుకుడు లేదు
 కొండముచ్చుని కెలుకుడు లేదు

బట్టన మురికి అంటక పోయె
మనసుకి మురికి జంటగ చేరె

కాకి ఎంగిలి కరువై పోయే
భుజాన చేతులు బరువై పోయె

అన్ని రంగులూ ఏడకో పోయె
ఉన్న రంగులూ చీడకి చేరె

ప్రస్తుత బాల్యం వెలవెల పోయె
దానికి మూల్యం ప్రస్తుత మాయే
                      --------------------

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు

Top Post Ad

Bottom Post Ad

Show ad in Posts/Pages