Type Here to Get Search Results !

పిల్ల చీమ సందేహం

0

 పిల్ల చీమ సందేహం

 


ఒక పుట్టలో పుట్టిన బుజ్జి చీమ తొలిసారిగా బయట ప్రపంచాన్ని చూడడానికి వచ్చింది. చెట్లు, చేమలు, పక్షులు, జంతువులను చూడగానే ఆ పిల్ల చీమకు ఆశ్చర్యం వేసింది. వాటి ముందు తాను చాలా చిన్నగా ఉన్నానని బాధ పడింది. కాసేపటికి పే.. ద్ద ఏనుగు దానికి ఎదురైంది. అదైతే ఏకంగా ఆకాశాన్ని తాకుతున్నట్లే ఉంది. దాన్ని చూడగానే చీమ కళ్లు చెదిరాయి. ఏనుగు తన బలమైన తొండంతో చెట్ల కొమ్మలను విరిచి తినడం విచిత్రంగా తోచింది. అలా చూస్తుండగానే.. ఓ కోతి ఒక చెట్టు నుంచి మరో చెట్టు మీదకు అమాంతం దూకింది. దానికి దొరికిన కాయలు, పండ్లు ఎంచక్కా పొట్ట నిండా తింది. ఆ పక్కనే ఓ పే..ద్ద కొండచిలువ ఏదో జీవిని నోటకరుచుకుని మింగేయడానికి ప్రయత్నిస్తోంది.

 

వాటన్నింటిని చూసిన తర్వాత చీమకు తన మీద తనకు మరింత అసహ్యం వేసింది. అబ్బా.. జీవితమంటే వాటిది. నాదీ ఒక బతుకేనా?’ అనుకొని బాధ పడింది. తనకు వాటిలా బతికే అవకాశం లేకుండా చేసిన భగవంతుడి మీద కోపం కూడా వచ్చింది. బయటకు వెళ్లి చాలా సమయమైనా ఇంకా తన దగ్గరకు రాని పిల్ల చీమను వెతుక్కుంటూ తల్లి చీమ అక్కడకు చేరింది. తన తల్లిని చూసిన పిల్ల చీమ అమ్మా.. అమ్మా..అంటూ పిలుస్తూ అక్కున చేరింది. అమ్మా.. ఆ జీవులు చూడు ఎంత పెద్దవో.. కావాల్సిన ఆహారం చక్కగా తింటున్నాయి. ఛీ.. ఏమిటో.. ఈ భగవంతుడు మనల్ని ఇలా పుట్టించాడుఅని బాధపడింది.

 

దానికి తల్లి చీమ.. ఇప్పుడేమైందని అంతలా బాధపడుతున్నావ్‌అంది. అలా అంటావేంటి అమ్మ. మనదీ ఒక బతుకేనా.. గట్టిగా గాలి వీస్తే చెల్లాచెదురయ్యే జీవితాలు మనవి. బతికున్నన్ని రోజులు బరువులెత్తుతూ చాకిరీ చేయాలి మనం. ఆ ఏనుగులా మనం ఘీంకరించగలమా? సింహంలా గర్జించగలమా? ఆ పక్షుల్లా కిలకిలరావాలు పలికించగలమా? ఆ చిరుతపులిలా మెరుపువేగంతో పరుగెత్తగలమా? అదిగో ఆ లేడిలా చెంగుచెంగున గెంతగలమా?.. ఇవేమీ చేయలేం మనం. మరి మనది జీవితం ఎలా అవుతుందిఅని పిల్లచీమ ఏడ్చింది.

 

పిల్ల చీమను ఎలా ఓదార్చాలో.. తనను ఎలా దారిలోకి తెచ్చుకోవాలో తల్లి చీమకు అర్థం కావడం లేదు. ఎంత చెప్పినా పిల్ల చీమ వినడం లేదు. ఇంతలోనే కొందరు తుపాకులు, విల్లులు, తాళ్లు, కర్రలు, ఇనుప గొలుసులతో దాడి చేస్తూ అడవి మీద పడ్డారు. దొరికిన జంతువును దొరికినట్లు బంధించారు. వాటన్నింటినీ లారీల్లో ఎక్కించుకుని చక్కా పోయారు.

అయ్యయ్యో.. ఎందుకమ్మా.. ఆ సింహాన్ని, పులిని, జింకల్ని, పక్షుల్ని, కొండచిలువల్ని, నక్కల్ని.. ఇలా కనిపించిన ప్రతి జీవినీ బంధించుకుని తీసుకొనిపోయారు. ఇంతకీ వాటిని ఏం చేస్తారమ్మాఅని భయపడుతూ పిల్ల చీమ తల్లిని అడిగింది.

 

వాళ్లు స్మగ్లర్లు అమ్మా.. ఇప్పుడు బంధించిన జీవుల్లో కొన్నింటిని వాటి గోర్లు, చర్మం కోసం చంపేస్తారు. మరికొన్నింటిని సర్కస్‌ వాళ్లకు అమ్మేస్తారు. ఆ సర్కస్‌వాళ్లేమో వాటితో ఆటలాడించి సొమ్ము చేసుకుంటారు. అవి చచ్చిపోయేంత వరకూ పాపం బందీగా బతకాల్సిందేఅని చెప్పింది తల్లి చీమ. అమ్మా.. మరి వాళ్లు మనల్ని ఎందుకు బంధించలేదుఅని పిల్ల చీమ అనుమానం వ్యక్తం చేసింది. మనతో వాళ్లకేం పని ఉండదు. అసలు వాళ్ల దృష్టి మన మీద పడితేగా.. కావాలని చూస్తే తప్ప మనం మనుషులకు కనిపించంగా.. అదే మనకు రక్షణఅంది తల్లిచీమ.

 

అయ్యో.. దేవుడా.. నిన్ను అనవసరంగా తిట్టాను. నన్ను చీమలా పుట్టించి నాకు ఎంతో మేలు చేశావు. నేను మరో జీవిలా పుట్టి ఉంటే.. ఇప్పుడు వేటగాళ్ల చేతులకు చిక్కేదాన్ని. ఎన్ని జన్మలైనా సరే నన్ను చీమగానే పుట్టించుఅని పిల్ల చీమ వేడుకుంది. ఈ సృష్టిలో ప్రతి జీవీ గొప్పదే. దేని ప్రత్యేకత దానికి ఉంటుంది. ఎవరికి ఉండే సంతోషాలు, కష్టాలు వాళ్లకుంటాయి. మనకుండే ఆపదలూ మనకు ఉంటాయి. మన పని మనం చేసుకుంటూ వెళ్లడమే. దేని గురించీ అతిగా ఆలోచించి మనసు పాడు చేసుకోవద్దుఅని తల్లి చీమ పిల్ల చీమకు హితబోధ చేసింది. అప్పటి నుంచి పిల్ల చీమ ఉన్న దాంట్లోనే ఆనందంగా బతకడం అలవాటు చేసుకుంది.

 

- ఆరుపల్లి గోవిందరాజులు

 


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు

Top Post Ad

Bottom Post Ad

Show ad in Posts/Pages