ఒక సారి అక్బర్ చక్రవర్తి, బీర్బల్ తో బాటు కొంత
సైన్యంతో ప్రక్కనున్న ప్రాంతాన్ని సందర్శించడానికి బయలుదేరాడు. ప్రయాణ సమయంలో బీర్బల్
తన పెదవులు అదే పనిగా కదుపుతూ ఉండడం గమనించి,"ఏం చేస్తున్నావు,బీర్బల్?" అని అడిగాడు. అందుకు బీర్బల్, "రామనామం స్మరిస్తున్నాను, జహాపనా!అలా చేయడం నాకు
వంశపారంపర్యంగా వచ్చిన ఆచారం" అన్నాడు.
బీర్బల్ దైవభక్తికీ, సంస్కారానికి అభినందించాడు
అక్బర్.
కొంతదూరం ప్రయాణించాక, అక్బర్,బీర్బల్ తమ సైన్యం నుండీ
విడిపోయి దోవ తప్పి పోయారు. బాగా ప్రొద్దెక్కింది. ఇద్దరికీ ఆకలి పేట్రేగి పోవడంతో
నకనకలాడి పోతున్నారు. ఐనా,బీర్బల్ ఒక చెట్టు క్రింద కూర్చుని
రామనామ జపం కొనసాగిస్తున్నాడు.
అది చూసి చిఱ్ఱుబుఱ్ఱు లాడుతూ అక్బర్, "ఏమిటిది,బీర్బల్! ఆకలి ఒక వైపు చంపుతూంటే,ఆహారం కోసం ప్రయత్నించకుండా,రామా రామా అని గొణుగుతూ కూచున్నావు.భలే వాడివే!!" అన్నాడు.బీర్బల్ బదులివ్వ
కుండా,అలాగే రామనామం స్మరిస్తూ కూర్చుండి పోయాడు.
ఇక మరో మార్గంలేక ఆహారం కొఱకు
అన్వేషిస్తూ గుఱ్ఱంమీద అక్బర్ బయలుదేరాడు. వెతకగా,వె తకగా ఒక కుటీరం కనిపించింది.ఆ ఇంటి యజమాని ఆక్బర్ చక్రవర్తిని గుర్తుపట్టి గౌరవించి
భోజనం సమకూర్చాడు.తన భోజవం ముగిసాక,బీర్బల్ కోసం
ఆహారం మూట కట్టించుకుని అక్బర్ బయలుదేరాడు.
అక్బర్,బీర్బల్ వద్దకు చేరుకుని ఆహారం అతనికి అందించి "చూడు బీర్బల్!నేను
వెదకి కృషి చేస్తేనే మనకు తిండి దొరికింది. నీలాగ ఊరికే కూచుని జపం చేస్తే దొరికేదా!?. నీ పిచ్చి గానీ, రామనామం అన్నం
పెడుతుందిటయ్యా!?"అని ఎగతాళి చేయబోయాడు.
అందుకు బీర్బల్ "జహాపనా!రామనామం జపిస్తే
కలిగే ఫలితం ఈ రోజే నాకు స్పష్టంగా ఋజువు అయింది. అది జపించడం వల్లనే కదా, భగవాన్ శ్రీరాముడు సాక్షాత్తు చక్రవర్తి చేతనే నాకు ఆహారం తెప్పించి
ఇప్పించాడు - నా ఆకలి బాధను తీర్చాడు.లేకుంటే, నాలాంటి సామాన్యునికి
అది సాధ్యపడేదా!!??జై శ్రీరామ్! జై జై శ్రీరామ్!!"
అని భక్తిపారవశ్యంతో అన్నాడు.
అక్బర్ అతని మాటలకు మొదట నిశ్చేష్టుడై, తేరుకొనిన తరువాత దైవనామ స్మరణ మహాత్మ్యం అర్థంకాగా, బీర్బల్ ను మనస్ఫూర్తిగా అభినందించాడు.