ఉపాధ్యాయుడి కోసం...
ఈ రోజున
టీచర్లుకు భయం---
రాయాలా,వద్దా అని ఆలోచించే
లెస్సన్ ప్లాన్ల
గురించి...
రాద్దాంలే అని
మర్చిపోయిన
టీచర్ డైరీల గురించి...
రాయొచ్చులే అని
వదిలేసిన
టేస్టింగ్ రిజిస్టర్ల
గురించి...
రాసేద్దామని తీసి,
రాయలేక మూసేసిన
రేడియో లెస్సన్ల
గురించి...
ఈ రోజున
టీచర్లు భయపడుతున్నది---
కూలిపోవడానికి
సిధ్ధంగా ఉన్న
విద్యా వ్యవస్థ
పునాదుల్ని
చూసి కాదు,
పెచ్చులూడుతున్న
స్కూలు గోడల్నీ
పైకప్పుల్ని చూసే...
కుళ్ళి కంపుగొడున్న
సారంలేని పాఠ్యాంశాల్ని
చూసి కానే కాదు,
కుళ్ళిపోయిందని
బయటపారేసిన
మధ్యాహ్న భోజన
పథకపు
గుడ్డు పెంకుల్ని
చూసే...
ఎన్ని కమిటీలేసి
కడిగిస్తున్నా,
ఎంత ఖర్చు చేసి
కడిగేస్తున్నా...
ఓ కొలిక్కిరాని
విద్యా ప్రమాణాల
ప్రణాళికలని
చూసి కాదు, వీరి భయం...
ఎంత శుభ్రం చేసినా
ఫలితం లేదేమోనని
అనుమానం మిగిల్చిన
బాత్ రూం పరిసరాలను
చూసి...
నేడు టీచర్ల భయం-----
సక్సస్ గుర్తు
పడని
బయోమెట్రిక్ పరికరాల
అటెండెన్సుల్లో
దాగుంది...
అప్లైచేస్తేగానీ
అందుబాటులోకి
రాని
సెలవుల అప్లికేషన్లలో
కొలువై ఉంది...
పరిగెడుతున్నారో
పడిపోతున్నారో
పట్టించుకోలేని
స్మార్టు ఫోన్
సందేశాల,
అర్థంలేని
అభివృద్ధి సిద్ధాంతాల్లో
సంక్షిప్తం చేయబడింది...
ఓ వైపు...
ఆన్లైన్ సేవలకి
సాగిలపడి మొక్కలేక,
మరోవైపు...
ఆవేదనని
బయటకి కక్కలేక,
కొట్టుమిట్టాడుతున్న
టీచర్ల
అసహనంలో
అంతర్లీనమైపోయి
ఉందీ భయం...
నేడు టీచర్ల భయం---
దేనికి భయపడాలో
దేనికి బాధ్యత
పడాలో
తెలియని
అయోమయంలో
ఆయువుపోసుకుంటోంది...
ఉపాధ్యాయుల్ని
యంత్రాలుగా మార్చేసిన
సాంస్కృతిక దాడితో
సహజీవనం చేస్తోంది...
నేటి టీచర్ల భయం---
టీచర్ల మధ్య చెడిపోతున్న
ఐక్య సంబంధాలకి
దర్పణం...
సమాజంతో
తెగతెంపులు చేసుకుంటున్న
సాంఘిక జీవనానికి
నిదర్శనం...
అర్థంలేని విషయాలకు
టీచర్లు
భయపడుతున్నారంటే....
అర్థవంతమైన టీచర్లు
పుట్టుకురావడం
లేదని అర్థం!
సమాజాన్ని అర్థవంతంచేసే
టీచర్లుని అందించడంలో
టీచర్లు కూడా
విఫలమౌతున్నారని
అర్థం!
పేలిపోడానికి
సిద్దంగా ఉన్న
నీటి బుడగని చూసి
భయపడుతున్న టీచర్
పోయి,
పోటెత్తిన కడలి
అలలకి
ఎదురునిలిచే
టీచర్ పుట్టుకొచ్చే
వరకూ...
రాబడి రాబందులు
స్కూల్లని తన్నుకుపోతునే
ఉంటాయి!
నెత్తురు చిందని
హత్యలు చేస్తూ
టీచర్లని భయపెడుతునే
ఉంటాయి!!