ప్రశ్న: మంచు తెల్లగానే ఎందుకు
ఉంటుంది?
జవాబు: తెలుపు ఓ నిర్దిష్ట వర్ణం (specific colour)
కాదు. ఇది ఎన్నో వర్ణాల కలయిక. సాధారణంగా ఏదైనా పదార్థంలోని
అణువులు (molecules)లేదా పరమాణువులు (atoms) దృశ్య కాంతిలో ఉన్న ఏ రంగు కాంతినీ శోషించుకోలేనట్లయితే ఆ పదార్థం తెల్లగా
గానీ, పూర్తి పారదర్శకంగాగానీ కనిపిస్తుంది. ఒకవేళ అలాంటి
పదార్థంలో ఉన్న పరమాణువులు స్వచ్ఛమైన స్ఫటికాకృతిలో (crystal structure) ఉన్నా, అణువులు లేదా పరమాణువుల మధ్యన ఖాళీ ప్రదేశం
(ద్రవాలు, అణువులలో లాగా) బాగా ఎక్కువగా ఉన్నా ఆ పదార్థాలు
పారదర్శకం (transparent) గా ఉంటాయి. కానీ అదే పదార్థంలో ఉన్న
అణువులు, పరమాణువులు చిందరవందరగానో, శకలాల్లాగానో
(polycrystalline or defective crystalline)ఉన్నట్లయితే ఆ
పదార్థాల మీద పడ్డ తెల్లని కాంతి అన్ని వైపులకు పరావర్తనం (reflection) లేదా వ్యాపనం (diffusion) లేదా పరిక్షేపణం (scattering)అవుతుంది. అటువంటి సందర్భాల్లో ఏ వైపు నుంచి చూసినా మనకు అంతో ఇంతో
తెలుపు కాంతి కంటికి చేరడం వల్ల ఆ వస్తువు తెల్లగా కనిపిస్తుంది. సాధారణంగా
మంచుగడ్డలు నిర్దిష్ట స్ఫటికాకృతిలో కాకుండా చెల్లా చెదురుగా ఏర్పడ్డ బహుస్పటిక
శకలాలు (poly crystalline segments)గా ఉంటుంది. ఇటువంటి
శకలాలమీద పడ్డ కాంతి పరిక్షేపణం చెందడం వల్ల ఆ మంచు ముక్కలు తెల్లగా అగుపిస్తాయి.
- ప్రొ|| ఎ. రామచంద్రయ్య, నిట్, వరంగల్;
రాష్ట్రకమిటీ, జనవిజ్ఞానవేదిక