Type Here to Get Search Results !

సామాన్యులను కట్టిపడేసే మాయ ఏమిటి?

0


రామకృష్ణ పరమహంసని ఓ భక్తుడు " స్వామీ, అస్తమానూ మహామాయ అని, అమ్మవారు మాయ , పరమాత్మ మాయ అంటూ చెబుతూంటారు కదా. మరి ఆ మాయ అమ్మవారిని ఏమీ చెయ్యదా " అని అడుగుతే ఆయన అన్నారు " త్రాచుపాము విషం అందరికీ హాని కాని త్రాచుపాముకు ఏమీ అవదు కదా. అలాగే ఈ మాయ ఆవిడని ఏమీ చేయదు " అని.


" మాయ " మనల్ని జాగ్రత్తగా ఉండమని తెలియచేస్తూనే ఉంటుంది. పరీక్ష లాంటిది.


జీవుడు 3 రకాల తాపాలతో బాధపడుతూ ఉంటాడు. వీటిని " తాపత్రయాలు " అంటారు. అవి:


1. ఆధ్యాత్మికతాపం - ఇది స్వయంకృతం. శరీరానికి సంబంధించినవి. రోగాలూ అవీను.


2. ఆధిభౌతికతాపం - ఇది ఇతర జీవులవల్ల కలిగేవి. కొట్లాటలు అవీను. కొంతవరకూ స్వయంకృతం.


3. ఆధిదైవికతాపం - ఇది జీవులచేతుల్లో లేనిది. సునామీలు, భూకంపాలు, తుఫానులు లాంటివి.


ఎక్కువగా మనిషి ఆధ్యాత్మికతాపం ( స్వయంకృతం ) తోనే బాధపడుతూ ఉంటారు.


ఓ ఉదాహరణ చూద్దాం:


ఓ స్వామి ఉంటారు. ప్రవచనాలు చెబుతూ ఆధ్యాత్మికమైన సలహాలు ఇస్తూ మంచి పేరు తెచ్చుకుంటారు. 65 ఏళ్ళు దాటుతాయి. ఇంకా శ్రద్ధగా దైవచింతనలో గడపవలసిన సమయంలో ఒక పెద్దాయన వచ్చి కలుస్తాడు. మాయ కమ్మేస్తుంది. ఆశ్రమంలో ఓ విగ్రహం పెడదామనుకుంటాడు. పెద్దాయన్ని 2 ఎకరాలు అడుగుతే ఆయన 10 ఎకరాలు ఇస్తాడు. 10 ఎకరాల్లో చిన్న విగ్రహం ఏం బావుంటుంది. పెద్ద విగ్రహం ప్లాన్ చేస్తారు. అందుకోసం విరాళాలు తీసుకుంటారు. వందల కోట్లతో విగ్రహం తయారీ మొదలెడతారు. విగ్రహం చుట్టూ అందంగా ఉంటుందని అనేక గుడులు కట్టడం మొదలుపెడతారు.


ఇటువంటి పెద్ద విగ్రహం ఆవిష్కరణని ఈ " పెద్దాయన " తో చేయిస్తే ఎలా?. అందుకని ఇంకా పెద్దాయనని పిలుస్తారు.


సరే ప్రతిష్ఠాపన అయింది. అసలు కష్టాలు ఇప్పుడే మొదలవుతాయి. వందలకోట్ల విగ్రహం అలా ఎలా వదిలేస్తారు. చుట్టూ ఖరీదయిన రక్షణకవచం, కెమేరాలు, సెక్యూరిటీ గార్డ్స్ మొదలగు ఏర్పాట్లు. ఈ మందీమార్బలానికి వసతులు, జీతాలకి డబ్బులు. వీటికోసం ప్రవేశరుసుములు. ఇలా 24గంటలు స్వామి సమయం ఈ ఏర్పాట్లకీ బాదరబందీలకే సరిపోదు. దాని వలన కోపాలు, తాపాలు, బుజ్జగించడాలు మొదలవుతాయి.


ఇటువంటి సమయాలలోనే అసహనానికి " అహం ( మాయ ) " తోడయి మహాపురుషులగురించి కూడా చులకనగా మాట్లాడడం మొదలవుతుంది. ఇక ఆయనకు పాపం మోక్షసాధనకి సమయం ఎక్కడ.


చేతికి అందివచ్చిన అద్భుత అవకాశాన్ని చేజేతులా నేలపాలు చేసుకోవడం. అందుకే ఈ ఆధ్యాత్మికతాపాన్ని " స్వయంకృతం " అంటారు. చేతులారా సమస్యలను కొని తెచ్చుకోవడం.


ఎంతటి సన్యాసి అయినా ఈ " మాయ " లోంచి బయటపడడం కష్టమే.


మరి సామాన్యుల పరిస్థితి చెప్పేదేముంది. అమ్మవారి పాదాలే శరణ్యం.


ఏతత్ సర్వం శ్రీపరదేవతార్పణమస్తు.


శుభమస్తు

Tags

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు

Top Post Ad

Bottom Post Ad

Show ad in Posts/Pages