నేడు మహాకవి, నవయుగవైతాళికుడు, దార్శనికుడు గురజాడ వెంకట అప్పారావు గారి జయంతి సందర్భంగా ఆ మహానుభావున్ని గురించి కొంత సమాచారం మీతో పంచుకుంటున్నాను..🌹
గురజాడ అప్పారావు
👉తల్లిదండ్రులు: వెంకట రామదాసు, కౌసల్యమ్మ
👉స్వస్థలం: రాయవరం, ఎలమంచిలి, విశాఖపట్నం జిల్లా
👉జననం: 21 వ తేది ఆదివారం, సెప్టెంబర్ 1862
👉మరణం: 30 వ తేది మంగళవారం, నవంబర్ 1915
👉గురజాడ అప్పారావు గురించి వినని వారు వుంటారేమో గానీ, కన్యాశుల్కం నాటకంలో ఆయన సృజించిన ఈ వాక్యాలు వినని తెలుగు వారు వుండరు. ఈనాటకంలో ఆయన సృష్టించిన గిరీశం, మధురవాణి, రామప్పంతులు మొదలైన పాత్రలు కూడా అంతే ప్రఖ్యాతి పొందాయి.
👉గురజాడ అప్పారావు గారు (1862-1915) తెలుగు భాష మహా కవి, తన రచన ద్వారా సాంఘిక పరివర్తనకు ప్రయత్నించినవారు.గురజాడ అప్పారావు తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేసిన గొప్ప సాహితీకారులలో ఒకడు. హేతువాది 19 వ శతాబ్దంలోను, 20 వ శతబ్ది మొదటి దశకంలోను ఆయన చేసిన రచనలు ఈనాటికీ ప్రజల మన్ననలను పొందుతున్నాయి. రాశిలో తక్కువైనా, ఆయనవి వాసికెక్కిన రచనలు.
👉వ్యావహారిక భాషలో రచనలు చేయడం తప్పుగానూ, చేతకానితనం గాను భావించే ఆ రోజుల్లో ఆయన ప్రజలందరికీ అర్ధమయ్యే జీవ భాషలో రచనలు చేసాడు వీరి "కన్యాశుల్కం" తెలుగు అన్నిటికన్నా గొప్ప నాటకం అని చెప్పవచ్చు. అభ్యుదయ కవితా పితామహుడు అని బిరుదు పొందిన వీరు, తెలుగు సాహిత్యంలో వాడుక భాష ఒరవడికి కృషి చేసిన వారిలోముఖ్యులు. వీరికి "కవి శేఖర" అనే బిరుదు కూడా కలదు.
🍁బాల్యం-విద్యాభ్యాసం🍁
👉విశాఖ జిల్లా, ఎలమంచిలిలో, మేనమామ ఇంట్లో సెప్టెంబరు21, 1862 న, వెంకట రామదాసు మరియు కౌసల్యమ్మ దంపతులకు జన్మించారు. వీరికి శ్యామల రావు అనే తమ్ముడు ఉన్నారు. గురజాడ అప్పారావు కుటుంబం వారి తాతల కాలంలో కృష్ణా జిల్లా గురజాడ గ్రామం నుండి విశాఖ మండలానికి వలస వచ్చింది.. అప్పారావు గారి తండ్రిగారు విజయనగరం సంస్థానంలో పెష్కారుగా, రెవిన్యూ సూపర్వసరు మరియు ఖిలేదారు గాను పనిచేసారు. తన పదవ ఏట వరకు అప్పారావు గారు చీపురుపల్లి లో చదువుకున్నారు. తర్వాత, వారి తండ్రిగారు కాలం చెయ్యటంతో, విజయనగరంకి వచ్చారు. ఇక్కడ చాల పేదరికంలో వారాలు చేసుకుంటూ చదువు కొనసాగించారు. ఈ సమయంలో ఏం. ఆర్. కాలేజి, అప్పటిప్రిన్సిపాల్ సి. చంద్రశేఖర శాస్త్రి గారు ఈయనను చేరదీసి ఉండడానికి చోటిచ్చారు. 1882 లో మెట్రిక్యులేషను పూర్తిచేసి, తర్వాత 1884 లో ఎఫ్. ఎ చేసారు. ఇదే సంవత్సరంలో ఏం. ఆర్. హై స్కూలులో టీచరు గా చేరారు. విజయనగరంలో బి.ఏ చదువుతున్నపుడు వాడుక భాషా ఉద్యమ నాయకుడు గిడుగు రామమూర్తి ఆయనకు సహాధ్యాయి. వారిద్దరూ ప్రాణస్నేహితులు.
👉ప్రతి ఏటా గురజాడ జన్మదిన వేడుకను రాయవరం ప్రజలు ఘనంగా నిర్వహిస్తారు.
🍁సాహితీ చరిత్ర కన్యాశుల్కం🍁
👉గురజాడ రచనల్లో కన్యాశుల్కం (నాటకం) అగ్రగణ్యమైనది. కన్యాశుల్కం దురాచారాన్ని విమర్శిస్తూ గురజాడ రచించిన ఈ నాటకం భారతీయ భాషల్లో వెలువడిన ఉత్తమోత్తమమైన రచనలలో ఒకటి. 1892 లో ప్రచురించిన మొదటి కూర్పుకు ఎన్నో మార్పులు చేసి 1909 లో రెండవ కూర్పును ప్రచురించాడు. వాడుక భాషలో, విజయనగర ప్రాంత యాసలో రాసిన ఈ నాటకం 100 సంవత్సరాల తరువాత కూడా ఈ నాటికీ పాఠకులను అలరిస్తూ ఉంది. ఈ నాటకం కన్నడం, ఫ్రెంచి, రష్యన్, ఇంగ్లీషు (2 సార్లు), తమిళం, హిందీ (2 సార్లు) భాషల్లోకి అనువాదమైంది.
👉పుత్తడి బొమ్మా పూర్ణమ్మా అనే సుప్రసిధ్ద గేయం ఆయన రచనల్లో మరొకటి. దీని ఇతివృత్తం కూడా కన్యాశుల్కం దురాచారమే.
కరుణ రసాత్మకమైన ఈ గేయ కావ్యంలోని చివరి పద్యం ఇది:
👉కన్నుల కాంతులు కలువల చేరెను
మేలిమి జేరెను మేని పసల్
హంసల జేరెను నడకల బెడగులు
దుర్గను జేరెను పూర్ణమ్మ
పుత్తడి బొమ్మా పూర్ణమ్మా
🍁దేశమును ప్రేమించుమన్నా🍁
👉ఆయన రాసిన ప్రముఖ గేయం లోని ఒక భాగం ఇది:
👉దేశమును ప్రేమించుమన్నా
మంచి అన్నది పెంచుమన్నా
వొట్టి మాటలు కట్టిపెట్టవోయ్
గట్టిమేల్ తలపెట్టవోయ్.
🍁ఇతర రచనలు🍁
👉సారంగధర (ఇంగ్లీషు పద్య కావ్యం-ఇండియన్ లీజర్ అవర్ (విజయనగరం) లోనూ రీస్ అండ్ రయ్యత్ (బెంగాల్) పత్రిక లోనూ ప్రచురించబడింది), పూర్ణమ్మ, కొండుభట్టీయం, నీలగిరి పాటలు, ముత్యాల సరాలు, కన్యక, సత్యవ్రతి శతకము, బిల్హణీయం (అసంపూర్ణం), సుభద్ర, లంగరెత్తుము, దించులంగరు, లవణరాజు కల, కాసులు, సౌదామిని (రాయాలనుకున్న నవలకు తొలిరూపం), కథానికలు, మీపేరేమిటి (దేవుడు చేసిన మనుషులు సినిమా పేరు దీనినుండి గ్రహించిందే), దిద్దుబాటు, మెటిల్డా, సంస్కర్త హృదయం, మతము విమతము.