చిన్నూ: తాతయ్యా! మొన్న నాన్నతో సినిమాకి వెళ్లినప్పుడు ఓ ప్రకటన చూశా. పొగ తాగితే ఊపిరితిత్తులు పాడై జబ్బులొస్తాయని! అసలు ఊపిరితిత్తుల సంగతులేంటో చెప్పవా?
తాతయ్య: భలే అనుమానమే వచ్చిందే! చెబుతా జాగ్రత్తగా విను మరి. మనం ఏ పనైనా చేయకుండా ఉండగలమేమో కానీ శ్వాస తీసుకోకుండా ఉండగలమా? ప్రయత్నించినా కొద్దిసేపే. ఉండలేమనే చెప్పాలి. ఎందుకంటే మన శరీరంలో ప్రతీ కణం సజీవంగా ఉండాలంటే ఆక్సిజన్ చాలా అవసరం. ఆ ఆక్సిజన్‌ను అందించే పని చేసేవి ఊపిరితిత్తులే. మనం పీల్చే గాలి నుంచి ఆక్సిజన్‌ను వేరు చేసి, దాన్ని రక్తంలో కలుపుతాయి. కార్బన్‌డయాక్సైడ్‌ను బయటకు పంపిస్తాయి. ఈ తతంగానికి మన శరీరంలోని చాలా భాగాలు కలిసికట్టుగా పనిచేస్తాయి.
చిన్నూ: అలాగా! అసలివి ఎక్కడుంటాయి?
తాతయ్య: ఛాతి దగ్గర తాకి చూడు... దీని లోపలే కుడి, ఎడమలుగా ఎక్కువ భాగాన్ని ఆక్రమించి ఉండేవి ఈ ఊపిరితిత్తులే. వీటిల్లో కుడి ఊపిరితిత్తి కన్నా ఎడమవైపున్నది కాస్త చిన్నగా ఉంటుంది. ఎందుకంటే ఆ ఖాళీలోనే గుండె ఆక్రమించి ఉంటుంది. వీటికి చుట్టూరా 12 జతల పక్కటెముకలు రక్షణగా ఉంటాయి. లేత గులాబీ రంగులో ఉండే ఈ ఊపిరితిత్తులు రెండు బుడగల్లా ఉంటాయి. బుడగల్లో గాలి నింపితే, వదిలితే ఎలా ఉంటాయో శ్వాస తీసుకున్నప్పుడు, వదిలినప్పుడు ఇవీ అలానే ఉంటాయన్నమాట. స్పాంజిలా మెత్తగా ఉండే ఈ ఊపిరితిత్తుల కింద డయాఫ్రం అనే కండరం గుమ్మటం ఆకారంలో ఉంటుంది.
ఒక రకంగా మనం ఊపిరితిత్తులను తలకిందులుగా ఉండే చెట్టుతో పోల్చుకోవచ్చు. చెట్టుకి కొమ్మల్లా...! వీటిల్లోకూడా బోలెడన్ని శాఖలుంటాయి. చాలా సన్నగా ఉండే వీటిని బ్రాంకీయోల్స్ అంటారు. వీటిని గాలి మార్గాలు అనుకోవచ్చు. శ్వాసనాళమేమో చెట్టు కాండం అన్నమాట. ముక్కు... నోరు నుంచి గాలి దీనిలోంచే లోపలికి వెళుతుంది.
చిన్నూ: దీని చుట్టూ అంత కథ ఉందా?
తాతయ్య: అంతేకాదు చిన్నూ! ఇందాక చెప్పాగా చెట్టు కొమ్మల్లాంటి బ్రాంకీయోల్స్ ఉంటాయని. వీటి చివర చిన్న చిన్న సంచులుంటాయి. వీటిని ఆల్వియోలై అంటారు. గాలి చేరినప్పుడల్లా బెలూన్లలా ఉబ్బుతాయివి. సుమారు 30 కోట్ల నుంచి 60 కోట్ల వరకు ఉండే వీటిని సూక్ష్మదర్శినిలోంచి చూస్తే ద్రాక్షగుత్తుల్లా భలేగా కనిపిస్తాయి. వీటికి అతి సన్నని రక్తనాళాలు అంటుకొని ఉంటాయి. గుండె నుంచి వచ్చిన రక్తం... కార్బన్‌డయాక్సైడ్‌ను వదిలించుకొని, ఆక్సిజన్‌ను చేర్చుకునేది ఇక్కడేనోయ్. ఒకరకంగా ఊపిరితిత్తులను ‘వడపోత కేంద్రం’ అనుకోవచ్చన్నమాట.
గుండె కార్బన్‌డయాక్సైడ్‌తో నిండిన రక్తాన్ని ఊపిరితిత్తులకు పంపితే... అవి ఆ కార్బన్‌డయాక్సైడ్‌ను తొలగించి ఆక్సిజన్‌తో నింపుతాయన్నమాట. ఈ రక్తం మళ్లీ గుండెకు వెళ్లి అక్కడి నుంచి అన్ని శరీర భాగాలకు చేరుకుంటుంది. ఊపిరితిత్తుల్లో ఉండే రక్తనాళాలను ఒక దాని పక్కన మరోటి చేర్చుకుంటూ వెళ్తే అవి 620 మైళ్ల దూరం పరుచుకుంటాయి.
చిన్నూ: బాబోయ్ ఊపిరితిత్తుల ఉపయోగం చాలానే ఉంది కదూ తాతయ్యా!
తాతయ్య: అవున్రా బాబూ! అన్నట్టు... మరో సంగతి... చూడు నీవు శ్వాస తీసుకున్నప్పుడు గాలిని పీల్చడం, వదలడం ఎలా జరుగుతుందో తెలుసా? ఊపిరితిత్తుల కింద ఉండే డయాఫ్రం, పక్కటెముకల కండరాల సంకోచ, వ్యాకోచాల వల్లనే. ఈ కదలికల వల్ల ఊపిరితిత్తుల్లో ఏర్పడే అల్ప, అధిక పీడనాల గాలి లోనికీ, బయటకూ వచ్చేలా చేస్తాయి. ఈ కండరాల కదలికలను మెదడే నియంత్రిస్తుంది.
చిన్నూ: దగ్గు, తుమ్ము ఎందుకు వస్తాయి?
తాతయ్య: మరేమో... మనం పీల్చుకునే గాలిలో దుమ్ము, ధూళి వంటివి ఉంటే... శ్వాసనాళం గోడలకు ఉండే అతి సన్నని వెంట్రుకల్లాంటి భాగాలు అడ్డుకుంటాయి. అలాగే... దగ్గడం, తుమ్మడం కూడా ఊపిరితిత్తులు తనకు సరిపడని వాటిని దూరం చేసుకునే ప్రయత్నమే. తుమ్మినప్పుడు గంటకు 160 కిలోమీటర్ల వేగంతో లోపలి పదార్థాలు బయటకు వస్తాయి మరి. దీనికోసం డయాఫ్రంతోపాటు పొట్ట, ఛాతీ కండరాలు కూడా సాయం చేస్తాయి. శ్వాసను బయటకు వదిలినా ఊపిరితిత్తుల్లో ఎంతో కొంత గాలి మిగిలి ఉంటుంది. లేకపోతే పాడవుతాయి మరి.
చిన్నూ: బోలెడు సంగతులు చెప్పారు అవన్నీ మా ఫ్రెండ్స్‌కి చెప్పొస్తా బైబై తాతయ్యా!
మీకు తెలుసా?
* నిమిషానికి 12 నుంచి 20 సార్లు శ్వాసిస్తాం.
* మగవాళ్ల కన్నా పిల్లలు, ఆడవాళ్లు వేగంగా శ్వాసతీసుకుంటారు.
* మన శరీరంలో నీళ్లలో పడేస్తే తేలియాడే అవయవం ఊపిరితిత్తులు మాత్రమే.
* మన శరీరంలోని 70 శాతం వ్యర్థాలు శ్వాస వదలడం వల్లే బయటకు వెళతాయి.
* పసిపిల్లలకు ఊపిరితిత్తులు గులాబీ రంగులో ఉంటాయి. రోజూ బయటి వాతావరణానికి ప్రభావితమవటం, కాలుష్యం వల్ల వయసుపెరిగే కొద్దీ కొద్దిగా రంగు మారుతూ వస్తుంది.
* ఒకే ఊపిరితిత్తి ఉన్నా శ్వాస తీసుకోగలం. అయితే శరీరాకృతి మాత్రం మారుతుంది.
* మన శరీరం మొత్తమ్మీద బయటి వాతావరణానికి నేరుగా సంబంధం ఉండే అవయవం ఇదే.
ఈనాడు సౌజన్యంతో