
పదార్థాలు మామూలుగా ఘన, ద్రవ, వాయు స్థితుల్లో ఉంటాయని తెలిసిందే కదా. ఈ మూడు స్థితులకీ చెందని
స్థితే ప్లాస్మా. అందుకే దీన్ని నాలుగవ స్థితి పదార్థము(forth state of
matter)అంటారు. పదార్థాలన్నీ పరమాణు నిర్మితాలని
చదువుకుని ఉంటారు. ఏ పదార్థమైనా ఒక పరిమితికి మించి వేడి చేస్తే అది వాయువుగా మారుతుంది.
ఆ వాయువుకి కూడా అత్యంత తీవ్రమైన ఉష్ణోగ్రత అందితే, అందులోని పరమాణవుల నుండి ఎలక్ట్రాన్లు, కేంద్రకాలు వేరుపడిపోయి
వేటికవి స్వేచ్ఛగా చలిస్తూ ఉంటాయి. ఈ స్థితే ప్లాస్మా. ప్లాస్మా అయస్కాంత క్షేత్రాల
వల్ల ప్రభావితం అవుతుంది. దీని నుంచి విద్యుత్ కూడా ప్రవహిస్తుంది. సూర్యుడు, నక్షత్రాలన్నింటిలో ద్రవ్యం ప్లాస్మా రూపంలోనే ఉంటుంది. అంతేకాదు
మన భూమి వాతావరణంలో పైపొర అణుశకలావరణం (ionosphere)లో ఉండేది కూడా ప్లాస్మానే. లోహాల వెల్డింగ్‌కు ఉపయోగించే ఎలక్ట్రిక్ స్పార్క్‌లలో, విద్యుత్ ఉత్సర్గ దీపాల(electric discharge lamps)లో ఉండేది కూడా ప్లాస్మానే. ప్లాస్మాలో విడివిడిగా ఉండే ఎలక్ట్రాన్లు, ధనావేశమున్న కేంద్రకాలు ఆకర్షణకు లోనై ఒకటిగా కలిసిపోకపోవడానికి
కారణం అక్కడ ఉండే ఉష్ణశక్తి, వాటిని అత్యంత వేగంతో
చలించేలా చేయడమే. పైగా అక్కడ సాంద్రత అతి తక్కువగా ఉండడం వల్ల ప్లాస్మాలోని కణాల మధ్య
దూరం ఎక్కువగా ఉండి, అవి ఆకర్షించుకునే అవకాశం
చాలా తక్కువ.