మెదడు క్రియాశీలతను పరిశీలించి అధ్యయనం చేయడానికి అయస్కాంత అనునాద చిత్రీకరణ (మాగ్నెటిక్
రెసోనెన్స్ అండ్ ఇమేజింగ్) లాంటి ఆధునిక పద్ధతులు శాస్త్రవేత్తలకు అందుబాటులోకి
వచ్చాయి. పరిశోధనల ద్వారా మెదడులోని ఏయే ప్రదేశాలు మానవుల భావోద్రేకాలను నియంత్రిస్తాయో
తెలుసుకోగలుగుతున్నారు. భయం, కోపం లాంటి ప్రాథమిక
భావోద్వేగాలు మెదడులోని 'ఎమిగ్డాలా' (Amygdala) అనే ప్రదేశంలో కలుగుతాయి. అప్రియమైన భావాలు కార్టెక్స్ ముందు
భాగంలో మొదలవుతాయి. పరిశోధకులు ఈమధ్య మానవులకు ఉండే 'ఆరవ జ్ఞానం' (సిక్త్స్ సెన్స్) మూలాలను కూడా కనుగొన్నామని ప్రకటించారు. ఇది మెదడును కుడి, ఎడమ భాగాలుగా విభజించే గోడల వెంట ఉండే 'ఏంటీరియర్ సింగులేట్ కార్టెక్స్' నుండి కలుగుతుంది. ప్రేమలాంటి సంక్లిష్ట భావనల విషయంలో మెదడులోని
ఎమిగ్డాలా, హార్మోన్లను నియంత్రించే హైపోథాల్మస్, జ్ఞాపకశక్తి నిక్షిప్తమై ఉండే హిపోకాంపస్, జ్ఞానేంద్రియాల ప్రభావాలను వడబోసే థాలామస్ లాంటి వివిధ ప్రదేశాల
సమైక్య ప్రమేయం ఉంటుంది.