వినాయక చవితి రోజున తప్పక చదువవలసిన
శమంతకోపాఖ్యానము
చంద్ర దర్శనం నీలాపనింద:
ఒకానొక వినాయక చతుర్థి సందర్భమున శ్రీ కృష్ణపరమాత్మ పాలలో చంద్రబింబమును చూచుట సంభవించింది. దాని దుష్ఫలితము ఆయనకు తప్పలేదు.
సత్రాజిత్తు అను నాతడు సూర్యోపాసనచే శ్యమంతకమను మణిని సంపాదించాడు.
దినమునకు ఎనిమిది బారువుల బంగారము నీయగల మణియది.
అంతటి శక్తివంతమైన మణి పరిపాలకుని వద్ద ఉండదగినదని ధర్మజ్ఞుడగు శ్రీకృష్ణుడు భావించాడు.
ఆ విషయము సత్రాజిత్తునకు సూచించాడు. అతనికి ఆ సూచన రుచించలేదు.
అనంతరము సత్రాజిత్తు తమ్ముడగు ప్రసేనుడు విలాసముగా ఆ మణిని ధరించివేటకై అడవికి వెళ్ళినాడు. అది ఆతనికి నాశనహేతువైనది. ఆ మణిని చూచి మాంసఖండమని భ్రమించిన సింహమొకటి అతడిని వెంటాడి చంపి మణిని నోటకరచుకొని పోయింది.
నిజము తెలియని సత్రాజిత్తు మణి ప్రలోభముతో శ్రీకృష్ణుడే తన తమ్ముని చంపి అపహరించాడని అనుమానించి నిందపాలు చేసాడు.
ఆ నింద బాపుకొనుట శ్రీకృష్ణునికి ఆవశ్యకమైనది.
అడవిలో అన్వేషణ సాగించాడు. ఒకచోట ప్రసేనుని కళేబరము కనిపించింది. అచట కనిపించిన సింహపు కాలిజాడల వెంట సాగి వెళ్ళాడు. ఒక ప్రదేశమున సింహము, భల్లూకం పోరాడిన జాడలు కనిపించాయి.
శ్రీకృష్ణుడు భల్లూకపు కాలిజాడల వెంట వెళ్ళాడు. అవి ఒక గుహలోకి వెళ్ళాయి. గుహలో ఒక ఊయల తొట్టికి మణి వేలాడగట్టబడి ఉంది.
శ్రీకృష్ణుడు ఆ మణిని అందుకున్నాడు.
ఇంతలో భయంకరముగా అరచుచు ఒక భల్లూకం అతనిపై బడింది. భీకర సమరం సాగింది ఒక దినము కాదు, రెండు దినములు కాదు, ఇరువది ఎనిమిది దినములు. క్రమంగా ఆ భల్లూకమునకు శక్తి క్షీణించజొచ్చింది.
అది సామాన్య భల్లూకము కాదు. మహాభక్తుడు శక్తివంతుడైన జాంబవంతుడు. రామాయణ కాలమునాటి ఆ జాంబవంతుడు కర్మబంధములు విడివడక నిలిచియున్నాడు. అజేయుడాతడు.
ఎవరివల్లను అతడు క్షీణబలుడగు ప్రశ్నేలేదు.
ఒక్క శ్రీరామచంద్రుని వల్లనే అది సాధ్యము.
ఈ విషయము తెలిసిన జాంబవంతుడు తాను ఇన్ని దినములు పోరాడుతున్నది శ్రీరామచంద్రునితోనేనని గుర్తించి స్తోత్రము చేయనారంభించాడు.
అది త్రేతాయుగపు గాథ.
ఇది ద్వాపరయుగము. ఆ యవతారములో జాంబవంతుని సేవలకు మెచ్చిన శ్రీరామచంద్రుడు ఒక వరము కోరుకొమ్మనగా అవివేకముతో జాంబవంతుడు స్వయముగా శ్రీరామచంద్రునితో ద్వంద్వ యుద్ధమును కోరినాడు. అది శ్రీరామకార్యము గాదు కానఅప్పుడు నెరవేరలేదు.
అవివేకముతో అతడు కోరిన కోరిక జాంబవంతునకు దీర్ఘకాల కర్మబంధమయినది. ఇప్పుడు కర్మ పరిపక్వమయినది.
నేడీ రూపమున ఆ ద్వంద్వ యుద్ధము సంఘటిల్లినది. అవివేకము వైదొలగినది. అహంభావము నశించింది. శరీరము శిథిలమయింది. జీవితేచ్ఛ నశించింది.
శ్రీకృష్ణపరమాత్మ రూపమున తనను అనుగ్రహించ వచ్చినది ఆ శ్రీరామచంద్ర ప్రభువేనని గ్రహించి ప్రణమిల్లి ఆ మణిని, ఆ మణీతో పాటు తన కుమార్తె జాంబవతిని అప్పగించి కర్మబంధ విముక్తి పొందాడు జాంబవంతుడు.
శ్రీకృష్ణుడు మణిని తీసుకుని నగరమునకు వెళ్ళి పురజనులను రావించి జరిగిన యదార్థమును వివరించి నిందబాపుకున్నాడు.
నిజము తెలిసిన సత్రాజిత్తు కూడా పశ్చాత్తాపము చెంది మణిని తన కుమార్తెయగు సత్యభామను శ్రీకృష్ణునకిచ్చి వివాహము చేశాడు. ధర్మజ్ఞుడగు శ్రీకృష్ణుడు మణిని నిరాకరించి సత్యభామను స్వీకరించాడు.
వినాయక వ్రతము చేయక చంద్రబింబమును చూచుట వలన జరుగు విపరీతమును స్వయముగా అనుభచించిన శ్రీకృష్ణపరమాత్మ లోకుల యెడల పరమదయాళువై బాధ్రపద శుద్ధ చవితినాడు వినాయకుని యథాశక్తి పూజించి ఈ శ్యమంతకమణి కథను అనగా అందలి హితబోధను చెప్పుకొని, గణేశతత్వము పట్ల భక్తి వినయములతో శిరమున అక్షింతలు ధరించిన యెడల నాడు చంద్రదర్శనము చేసినను నిష్కారణ నిందా భయముండదని లోకులకు వరము ఇచ్చాడు.
అది మొదలు మనకు శ్యమంతకమణి గాథను వినుట సాంప్రదాయమయినది.
పూజచేసి కథనంతయు విను అవకాశము లేనివారు...
సింహ ప్రసేనమవధీత్ సింహో జాంబవతా హతాః ఇతి బాలక మారోదః తవ హ్యేషశ్యమంతకః
సింహము ప్రసేనుని చంపినది. ఆ సింహమును జాంబవంతుడు చంపెను. కనుక ఓ బిడ్డా ఏడువకు. ఈ శ్యమంతకము నీదే అను అర్థము గల పై శ్లోకమునైనా పఠించుట ద్వారా ఆ విషయము స్మరించదగియున్నదని చెప్పబడింది.
ఓం గం గణపతయే నమః