దగా చేసినోడు దర్జాగా దొరలా తిరుగుతుండు;
దగాపడ్డ వాడు దిగాలుఅయిండు ఇదేమి చోద్యమో!
పైసలు మింగునోడు పీఠం ఎక్కిండు;
పైసలు కట్టేవాడు డీలాపడ్డాడు ఇదేమి చిత్రమో!
పల్టీలు కొట్టినోడు పై అధకారి అయిండు;
పస్ట్ వచ్చినోడు వీధులవెంట పడ్డాడు ఇదేమి రాతరో!
బికరీ కాస్త బే ఫీకిర్ గా మారాడు;
యాజమాని కాస్త ఫకీర్ అయిండు ఇదేమి విచిత్రమో!
పోకరి పనిగాడు జెంటిల్ అయిండు;
జెంటిల్ తుంటరి అయిండు ఇదేమి తీరో!
బేవారుసు ఆవారాగాడు కాస్త భలే మొనగాడు అయిండు;
శభేష్ అయినవాడు బజార్ పాలయ్యాడు ఇదేమి తిరకాసో!
పడ్డవాడు లేచ్చాడు;
నడిచే వాడు కూలబడ్డాడు ఇదేమి తికమకో!
ఏడ్చే వాడు నవ్వుతూన్నాడు; నవ్వే వాడు రోదిస్తూన్నాడు ఇదేమి నాటకమో!
తిరిగే తింగరి తిమింగలం అయిండు;
తెలివైన వాడు తిక్కలోడు అయిండు ఇదేమి లోసుగో!
పని పాట లేని వాడు హుషారు అయిండు;
హుషారైనవాడు రుణగ్రస్తుడైనాడు ఇదేమి మాయో!
అజ్ఞాని అమితజ్ఞానపరుడైనాడు; అన్ని తెలిసిన వాడు పరమ మూర్ఘుడైండు ఇదేమి మర్మమో!
మోస ఖరుడు దీనదరుడు అయిండు; సాయం చేయువాడు చెల్లని కాసు అయిండు ఇదేమి కర్మనో!
ఏది? ఏమయినప్పటికీ;
భక్షకుడు! మారనే లేదు!! శిక్షకుడైన రక్షకుడు మారనే లేదు!!!
అదే యుగధర్మమే కాబోలు అదే అసలు సిసలైన లోగో ...@
రచన..సయ్యద్ హయ్యూల్ హయ్యూమ్ (చురకశ్రీ) కావలి.