నేను కార్మికున్ని...
నిరంతర శ్రామికుణ్ణి...
ఉక్కులాంటి నాఒంటిలోని సత్తువనంతా
ఆ యంత్రాలు జుర్రుకొంటేనే పరిశ్రమలు
అభివృద్ధి పరుగులుపెట్టేది...
తెల్లని నామేను నల్లటి ఆ మసిబొగ్గుని
కసితీరా కౌగిలించుకుంటేనే
కటిక చీకట్లను చీల్చే కరెంటుపుట్టుకొచ్చేది...
అంచెలంచెలుగా నాశక్తి ఆవిరైపోతుంటేనే
ఆ భవనాలు ఆకాశహర్శ్వాలుగా మారేది...
ముక్కుపుటాలదురుతున్నాగానీ
నా కరముల అధరాలు ఆమురికిని ముద్దాడితేనే
నువ్ స్వేచ్ఛగా వీధుల్లో విహరించేది...
కన్నవారిని వదిలి కనురెప్ప వాల్చకుండా
కాలంతో కాపురం చేస్తేనే
ఆచక్రాలు ప్రగతి రథాలై పరుగులు తీసేది...
ఎర్రటి ఎండలో నానెత్తురంతా సలసల కాగుతేనే
ఆనల్లటి తారురోడ్లపై నువ్వు
రయ్యిమని రైడు చేసేది...
దివాళా బతుకులీడుస్తున్న
మా హమాలీల భుజాలు కందితేనే
నీ సరుకేదైన సరైనచోటకు సవ్యంగా చేరేది...
ఆయువునంతా కూడదీసుకుని
అరవై అడుగుల చెట్టును అరనిమిషంలో అధిరోహిస్తేనే
కల్లుతో నీ ఒళ్ళుజిల్లనేది...
బక్కచిక్కిన ఒంటికి సత్తువంతా రాజేసుకుని
డప్పు దరువేస్తేనే గుళ్లోని దేవుడైనా ఊరంతా ఊరేగేది...
నాసృష్టి అయిన తోలు చెప్పులతో సోకుచేస్తేనే
నీ పాదాలు కందకుండా కమ్మగా ఉండేది...
నేను సర్వాంతర్యామిని..
నేను లేనిదే నీవు లేవు..
నీ జీవనమూ లేదు....
నేను కార్మికుణ్ణి
నిరంతర శ్రామికుణ్ణి...
నిరంతర శ్రామికుణ్ణి...
(కష్టాన్ని నమ్ముకున్న కల్మషం లేని
కార్మికులకు కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు).