పీనాసిపురం అని ఒక వూరు వుండేది. ఆ వూరి నిండా ధనవంతులే కానీ వాళ్ళు పెద్ద పీనాసోళ్ళు.
లక్షలకు లక్షలు ఇనప్పెట్టెల్లో మూలుగుతా వున్నా పిల్లికి గూడా బిచ్చం పెట్టేవాళ్ళు
కాదు. అంతేగాదు వాళ్ళు పెద్ద మోసగాళ్ళు గూడా. పైసలంటే పడిచచ్చే రకం. చుట్టుపక్కల వూళ్ళలోని జనాలకు అవసరానికి అధిక
వడ్డీకి డబ్బులు ఇచ్చేవాళ్ళు. వాళ్ళ పొలాలు, ఇళ్ళు, బంగారం తాకట్టు పెట్టుకునేవాళ్ళు. చెప్పిన రోజుకు డబ్బులు ఇవ్వకపోతే
మరుక్షణం వాటిని సొంతం చేసుకునేవాళ్ళు. ఆ వూరి జనాలే గాదు దాన్ని పాలించే రాజు గూడా
అలాంటోడే. అందుకే అందరూ ఆ వూరిని పీనాసిపురం అని పిలిచేవాళ్ళు.
ఒకసారి ఆ వూరికి ఒక ముని వచ్చినాడు. ఒక గుడిలో కూచోని మౌనంగా తన మానాన తాను తపస్సు
చేసుకోసాగినాడు. ఆ ముని ఎవరినీ కన్నెత్తి చూసేవాడు గాదు. పన్నెత్తి పలకరించేవాడు గాదు.
ఒకసారి పక్కవూరి నుంచి కొందరు ఆ మునిని చూడడానికి వచ్చినారు. ఆయన అందరిలాగా మామూలు
ముని గాదని చానా చానా మహిమలు వున్నాయని చెప్పినారు. తమ వూరిలో వానలు పడకుంటే వానలు
కురిపించాడని ఒక వూరివాళ్ళు, తమ ఊరిలో కొందరికి లక్షల
లక్షల బంగారు వరహాలు కానుకగా ఇచ్చినాడని మరొక వూరివాళ్ళు, తమ వూరిలో చనిపోయిన పిల్లవాన్ని బతికిచ్చినాడని ఇంకొక వూరివాళ్ళు...
ఆ ముని మహిమల గురించి అడిగిన వాళ్ళకు, అడగని వాళ్ళకు
పనిగట్టుకొని చెప్పసాగినారు. అలా ఆ విషయం ఆనోటా ఈనోటా పడి నిమిషాల్లో పీనాసిపురమంతా
పాకిపోయింది. వూరి జనాలంతా ఆయనను చూడడానికి ఎగబడి రాసాగినారు. పూజలు చేసి, టెంకాయలు కొట్టి, రకరకాల తినుబండారాలు
పెట్టి మొక్కుకోసాగినారు. ఎవరు ఏమి పెట్టినా ఆయన చిరునవ్వుతో వాటిని ముట్టుకోని తిరిగి
వాళ్ళకే ఇచ్చివేసేవాడు. కేవలం పళ్ళు, పాలు ఆహారంగా
తీసుకునేవాడు.
కొద్ది రోజుల్లోనే ఆ ముని గొప్పతనం గురించి ఆ వూరి రాజుకు తెలిసిపోయింది. వెంటనే
ఆ రాజు పల్లకీ పంపించి మునిని సభకు పిలిపించినాడు. ఆయన కాళ్ళకు మొక్కి ''సామీ... మీ మహిమల గురించి చెప్పని నాలుక లేదు, పొగడని నోరు లేదు. అంతా కథలు కథలుగా చెప్పుకుంటా వున్నారు. మా
వూరిలో అందరి కోరిక ఒకటే. ఇప్పుడున్న దానికి రెండింతలు లేదా నాలుగింతలు సంపాదించాలని.
అందుకు ఏదయినా దారి వుంటే చెప్పండి'' అన్నాడు.
ముని చానా సేపు ఆలోచించి ''ఈ లోకంలో పనీ పాటా చేయకుండా
వూరికే ధనం సంపాదించడం అంత సులభం కాదు. కానీ మీ వూరి జనాలు నాకు చేసిన సేవలు చానా సంతోషాన్ని
ఇచ్చినాయి. కాబట్టి ఒక దారి చెబుతాను. నా దగ్గర చానా మహిమలున్న ఒక గాజు సీసా వుంది.
దానిలో ఎన్ని బంగారు వరహాలు వేసినా అది నిండదు. కానీ పద్ధతిగా పదిరోజులు హోమం చేసినాక
పదకొండో రోజు నుంచి అందులో మనం ఎన్ని బంగారు వరహాలు వేసింటామో వాటికి రెండింతలు బైటకు
వచ్చి పడతాయి'' అన్నాడు.
ఆ మాటలకు రాజు చానా సంబరపడిపోయి ''సామీ... అంతకంటే
ఇంకేం కావాలి మాకు. మీకు ఏమేం కావాలో చెప్పండి అన్నీ సిద్ధం చేసి పెడతాను'' అన్నాడు.
ముని కాసేపు ఆలోచించి ''అలాగే కానీ ముందు పదిరోజులు
పెద్ద పెద్ద యాగాలు చానా చెయ్యాలి. నాకు ఒక పెద్ద ఇల్లు కొత్తది ఒకటి కావాలి. అందులో
ముందు పదిరోజులు హోమం చేసినాక సీసాను ఇంటి నడుమ నిలబెడతాను. అప్పుడు అందరూ వరహాలు వేద్దురుగానీ...
కానీ అంతా మూడు రోజులలోనే వేయాలి సరేనా'' అన్నాడు. సభలోని అందరూ ఆనందంతో సరే అని అరిచినారు. ఈ విషయం నిమిషాల్లో వూరంతా పాకిపోయింది.
రాజు వారం రోజుల్లో ఒక కొత్త ఇంటిని ముని కోసం తయారుచేసి ఇచ్చినాడు. ముని హోమం
చేయడానికని చుట్టుపక్కల దేశాల నుంచి ఒక యాభైమంది సాధువులను పిలిపించినాడు. పదిరోజుల
వరకు ఎవరూ ఈ భవనం చుట్టు పక్కలకు రాకండి అంటా అందరినీ పంపించి వేసినాడు. సాధువులు భవనం
అంతా రకరకాల ముగ్గులతో నింపేసినారు. అడుగడుగునా నిమ్మకాయలు కోసి, పసుపుకుంకుమలు చల్లినారు. ఇంటిచుట్టూ సైనికులను కాపలా పెట్టినారు.
లోపల హోమాలు మొదలుపెట్టినారు.
జనాలంతా ఎప్పుడెప్పుడు పదిరోజులు గడచిపోతాయా అని ఎదురుచూడసాగినారు. పదోరోజు రాజు
వూరంతా దండోరా వేయించినాడు. ''రేపు వుదయం నుంచి వూరిలోని
జనాలంతా బంగారు వరహాలతో తయారుగా వుండండి. ఈ అవకాశం కేవలం మూడురోజులే'' అని.
తరువాత రోజు పొద్దునకంతా ఎక్కడ చూసినా జనాలే. ఎవరి చేతుల్లో చూసినా పెద్ద పెద్ద
మూటలే. అందరి మొహాలు సంబరంతో ధగధగా వెలిగిపోతా వున్నాయి. నేను ముందంటే నేను ముందంటా
తొక్కిసలాడతా వున్నారు. సైనికులు అందరినీ వరుసగా నిలబెట్టడానికి నానాక తంటాలు పడతా
వున్నారు. రాజు లోపల సింహాసనం మీద కూచున్నాడు. ఆయనకు ముందు చెక్కబల్లపై ఒక సీసా వుంది.
అక్కడ ముని నిలబడి వున్నాడు.
సైనికులు ఎవరెవరు ఎన్నెన్ని వరహాలు తెచ్చినారో లెక్కబెట్టి చీటీ రాసి వాళ్ళ చేతిలో
పెట్టి ఒక్కొక్కరినే లోపలికి పంపుతా వున్నారు. వాళ్ళు అవన్నీ తెచ్చి సీసాలో పోసి పోతా
వున్నారు. సీసాలో ఎన్ని వేల వరహాలు పోసినా పోసినవి పోసినట్టు మాయమైపోతా వున్నాయి. జనాలు
ఇళ్ళు వాకిళ్ళు తాకట్టు పెట్టి, పశువులు, భూములు అమ్మి వచ్చిన వరహాలు వచ్చినట్టు సీసాలో మళ్ళీ మళ్ళీ పోసి
రసీదులు తీసుకుంటా వున్నారు. చివరి రోజు రాజు తన కోశాగారంలో వున్న బంగారు వరహాలన్నీ
తెప్పిచ్చి అందులో పోసినాడు.
తరువాత రోజు తలుపులన్నీ మూసేసినారు. సాధువులు మరలా రకరకాల యాగాలు మొదలుపెట్టినారు.
పదిరోజులు ఎప్పుడెప్పుడు అయిపోతాయా అని జనాలంతా ఎదురుచూడసాగినారు.
పదోరోజు దాటింది. తలుపులు అలాగే మూసి వున్నాయి. రాజు, సైనికులు, వూరి జనాలు అంతా బైటే
నిలబన్నారు. గంటయింది, రెండు గంటలయింది, మూడు గంటలయింది తలుపులు తెరుచుకోలేదు. ఏందబ్బా అని రాజు పోయి
తలుపుల మీద టకటకటకమని కొట్టినాడు. ఎవరూ తీయలేదు. తలుపులకు చెవులు ఆనించి విన్నాడు.
లోపల చిన్న అలికిడి గూడా లేదు. అనుమానమొచ్చి తలుపులు బద్దలుగొట్టి లోపలికి పోయినారు.
లోపల ఎవరూ లేరు అంతా ఖాళీ. అందరూ అదిరిపన్నారు. రాజు వురుక్కుంటా పోయి సీసా పైకి తీసినాడు.
ఇంకేముంది సీసా అడుగు భాగం కోసేసి వుంది. అందులో ఏమి వేసినా కింద పడిపోతాయి. ఎక్కడ
పడుతున్నాయో అని చెక్కబల్ల జరిపి చూసినాడు. కింద ఒక పెద్ద సొరంగం పక్క గది వరకు వుంది.
పోసినవి పోసినట్టు కింద నుంచి సంచులు సంచులు మాయం చేసినారు. ఒకరివి గాదు ఇద్దరివి గాదు
వూరువూరంతా ఖాళీ అయింది. అంతవరకు ధనవంతులుగా వున్న వారందరూ ఒక్కసారిగా వుత్త చేతులతో
ఫకీరులై పోయినారు.
రాజుకు అక్కడ ఒక చీటీ కనబడింది. తెరచి చూచినాడు. ''ఇన్ని రోజులుగా చుట్టు పక్కల జనాలనంతా పీడించి మోసం చేసి, భయపెట్టి సంపాదించిన సొమ్మును మేం గూడా మోసం చేసే ఎత్తుపోతా
వున్నాం. ఇది తిరిగి ఎవరికి చేరాలో వారికే చేరుతుంది'' అని వుంది.
అది చూసి అందరూ లబోదిబోమన్నారు.
******************
డా.ఎం.హరికిషన్-కర్నూలు-9441032212
*******************