చైనాలో పుట్టింది... జపాన్‌లో పెరిగింది... అమెరికా చేరింది... హడలగొడుతోంది! ఇంతకీ ఏమిటి? ఓ అడవి తీగ! కొన్నేళ్లుగా వేలాది మంది ఒకే పని మీద ఉన్నారు. ఆ పని కోసం కోట్లాది రూపాయలు ఖర్చుపెడుతున్నారు. శాస్త్రవేత్తలు నిరంతరం గమనిస్తున్నారు. ఆ పనేంటో తెలుసా? ఓ మొక్కను పీకెయ్యడం! ఇదంతా జరుగుతున్నది అగ్రరాజ్యమైన అమెరికాలో! అది మామూలు మొక్క కాదు! అనేక ప్రాంతాల్లో అల్లుకుపోతోంది! ఎంతో నష్టానికి కారణమవుతోంది. ఆ అడవితీగ పేరు కుడ్జూ (Kudzu).ఇది ఎంత వేగంగా పెరుగుతోందంటే, ఏడాదిలో లక్షన్నర ఎకరాల్లో అల్లుకుపోయింది. ఇలా ఇప్పటికి 70 లక్షల ఎకరాల్ని ఆక్రమించేసింది.
ఈ అడవితీగ కరెంటు స్తంభాలు, ఇళ్లు, ప్రహారీ గోడలు అన్నింటి మీదకీ పాకేస్తోంది. దాంతో విద్యుత్ సరఫరాకి అంతరాయం ఏర్పడుతోంది. ఇక అడవుల సంగతి చెప్పక్కర్లేదు చెట్ల మీద పందిరిలా అల్లుకుపోతుంటే ఆ ప్రాంతమంతా చీకటిమయమైపోతోంది. దీని వల్ల చాలా మొక్కలు సూర్యరశ్మి తగలక చనిపోతున్నాయి. అసలివి ఇంత త్వరగా ఎదగడానికి సహకరిస్తున్నదేంటో తెలుసుకోవడం కోసం శాస్త్రవేత్తలు 18 ఏళ్ల పాటు పరిశోధనలు చేశారు. ఆ మొక్కలో ఉన్న ఓ ఔషధమే కారణమ ని తెలిసింది. దానిని ఎలా నియంత్రించాలో తెలుసుకునేందుకు నాలుగేళ్ల నుంచి పనిచేస్తున్నారు.
నిజానికి ఈ మొక్కకి, అమెరికాకి సంబంధమే లేదు. అమెరికా నూరవ పుట్టిన రోజు ఉత్సవాల్లో దేశదేశాల భాగస్వామ్యాన్ని ఆమెరికా ఆహ్వానించింది. ఆ సందర్భంగా జపాన్ వాళ్లు తమ దేశంలోని అందమైన మొక్కల్ని ప్రదర్శించారు. పెద్ద ఆకులతో, అందమైన పూలతో ఉన్న కుడ్జూ లతలు అందర్నీ ఆకర్షించాయి. చాలా మంది వీటిని కొని పెంచడం మొదలు పెట్టారు. పశువులకు ఆహారంగా రైతులు పొలాల్లో నాటారు. ఇప్పుడు అమెరికా వీటిని కలుపు మొక్కల జాబితాలో పెట్టింది. ఈ మొక్క పుట్టిల్లు చైనా అని చెపుతారు.