ఫారం-16, 26 ఏఎస్ వంటి పేర్లు వేతన జీవులకు సుపరిచితమే. ఏటా ఐటీ రిటర్నులు దాఖలు చేసేటప్పుడు ఈ ఫారాల పేర్లు ఎక్కువగా వినిపిస్తుంటాయి. ఇకపై ఈ పేర్లు కనుమరుగు కానున్నాయి. వీటి స్థానంలో కొత్త పేర్లు వాడకంలోకి రానున్నాయి. కొత్త ఆర్థిక సంవత్సరం నుంచి ఈ మార్పులు అమల్లోకి రానున్నాయి. అదే రోజు నుంచి కొత్త ఆదాయపు పన్ను చట్టం, 2025 అమల్లోకి రానున్న నేపథ్యంలో ముసాయిదా నిబంధనల్లో ఈ మార్పులు ప్రతిపాదించారు.
Form 16 , 26AS ఇక కనుమరుగు...ఏప్రిల్ 1 నుంచి కొత్త పేర్లు.
ఐటీ రిటర్నులు దాఖలు చేసేందుకు ఉద్యోగులకు ఫారం-16ను ఉద్యోగి పనిచేస్తున్న సంస్థ జారీ చేస్తుంటుంది. వేతనంపై టీడీఎస్ రూపంలో ఎంత మినహాయించిందీ వంటి వివరాలు ఇందులో ఉంటాయి. కొత్త ఏడాదిలో దీన్ని ఫారం 130గా వ్యవహరించనున్నారు. వార్షిక ఆదాయ వివరాలు తెలియజేసే ఫారం 26 ఏఎస్ను ఇకపై ఫారం-168గా వ్యవహరించనున్నారు. వీటితో పాటు ఫారం 16ఏ-ఫారం 131; ఫారం 24 క్యూ ఫారం 138; ఫారం 26క్యూ - ఫారం 140; ఫారం 26క్యూ ఫారం 144గా మారనున్నాయి.
కొత్త ఆదాయపు పన్ను అమల్లోకి వచ్చేంత వరకు ప్రస్తుతం వాడుకలో ఉన్న ఫారం-16, 26ఏఎస్ వంటివి చెల్లుబాటు అవుతాయి. 2026 ఏప్రిల్ 1 నుంచి కొత్త ఫారాలు అమల్లోకి రానున్నాయి. ప్రస్తుతం ముసాయిదా. నిబంధనలపై ప్రభుత్వం సలహాలు, సూచనలు స్వీకరిస్తోంది. ఈ ముసాయిదా నిబంధనల పై త్వరలో తుది నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంది. ఏళ్లుగా వాడుకలో ఉన్న ఫారాల పేర్లు మార్పు వల్ల ఆదిలో ఇబ్బందులు ఎదురైనా క్రమంగా పన్నుచెల్లింపుదారులకు అలవాటైపోతాయని నిపుణులు పేర్కొంటున్నారు.