Type Here to Get Search Results !

శ్రీరామ నవమి విశిష్టత శ్రీ రాముడు ఏం చెప్తున్నాడు

శ్రీరామ నవమి విశిష్టత శ్రీ రాముడు ఏం చెప్తున్నాడు

రా..మ.. అంటే కేవలం రెండు అక్షరాలు కాదు.. అదో మహాశక్తి మంత్రం. ధర్మానికి ప్రతిరూపమైన శ్రీరాముడిని కీర్తిస్తూ భక్తజనం పండుగ జరుపుకొంటున్న శుభ తరుణమిది. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ కోసం శ్రీ మహా విష్ణువు ప్రతీ యుగంలో ఓ అవతారం ఎత్తుతాడు. అలా త్రేతాయుగంలో రామావతారం ఎత్తాడు. చైత్ర శుద్ధ నవమి నాడు లోకాలన్నింటిచే నమస్కరించబడే, పూజించబడే శ్రీరాముడు జన్మించాడు. రాముని పేరు వినగానే గుర్తొచ్చేది ధర్మం. ఆయన పాటించిని నీతి, ధర్మాన్ని ఇప్పటికీ లోకాలన్నీ కీర్తిస్తాయి. పితృధర్మం, మాతృధర్మం, భ్రాతృధర్మం, స్నేహ ధర్మం, పత్నీ ధర్మం, ఋషుల ధర్మం..  ఇలా అన్ని ధర్మాలు తెలిసినవాడు, ఆచరించినవాడు రాముడు. మన సనాతన ధర్మం, పురాణాలు, జ్యోతిషశాస్త్రం ప్రకారం మహా విష్ణువు ప్రతి అవతారానికి ఒక్కో గ్రహం ప్రామాణికంగా ఉంటుంది.
ఉదాహరణకు.. నారసింహ అవతారం కుజగ్రహాన్ని సూచిస్తుంది. కృష్ణావతారం చంద్రగ్రహాన్ని సూచిస్తుంది. వామన అవతారం గురుగ్రహం; అలాగే, శ్రీరామ అవతారం నవగ్రహాలకు అధిపతి అయిన సూర్యభగవానుడిని సూచిస్తుంది. రామాయణం, జ్యోతిషశాస్త్రం ప్రకారం.. శ్రీరాముడు త్రేతాయుగంలోని గురువారం రోజున చైత్ర శుక్ల నవమినందు కర్కాటక లగ్నంలో జన్మించినట్టుగా పురాణాలు చెబుతున్నాయి.
శ్రీరాముని అవతారంలో రాముడు సూర్యవంశంలో జన్మించడం.. ఆయన జాతకంలో సూర్యుడు మేషంలో ఉచ్ఛక్షేత్రంలో ఉండటం.. ఇవన్నీ ధర్మస్థాపన కోసం రామావతారం ప్రాధాన్యతను తెలుపుతున్నాయి. మనిషి జీవితంలో ఎలా నడుచుకోవాలి? ఎలా ప్రవర్తించాలి? ఎలా ఉండాలనే అంశాలు రామాయణం ద్వారా  తెలుసుకుంటారు. శ్రీరామచంద్రమూర్తి పితృవాక్య పరిపాలన, ఉత్తమ రాజు లక్షణం, ఉత్తమ సోదరుడి  కర్తవ్యం.. ఇలా అనేక విషయాలన్నీ రామ అవతారంలో చూసి నేర్చుకోవాల్సిన గొప్ప సుగుణాలు. ఇంతటి ప్రాధాన్యత కలిగిన శ్రీరాముడిని సనాతన ధర్మంలో పూజించడం వల్ల విజయాలు కలుగుతాయని పురాణాలు పేర్కొంటున్నాయి.

రాముడు ఏం చెప్తున్నాడు.. 
తండ్రి మాటకోసం.. పిన తల్లి కోరిక కోసం రాజకాంక్షను వదిలి అడవుల పాలైన వాడు రాముడు. శివధనుస్సును ఎత్తే సత్తా ఉన్నా.. గురువు విశ్వామిత్రుడు ఆజ్ఞాపించేవరకు అక్కడికి వెళ్లలేదు. గురువు మాటకు లోబడి ఉండేవాడు రాముడు. వినయ విధేయతలు కలిగిన వాడు. తానే దేవుడైనా.. పరుశురామున్ని ఎదురించే సత్తా ఉన్నా.. శివధనుస్సుని విరిచిన సమయంలో కోపంతో ఊగిపోతున్న పరశురామునికి ఎదురు తిరగలేదు. ఒక్కమాట అనలేదు. ప్రశాంతంగా ఆయన అన్నమాటల్ని విన్నాడు. ఆయన చేసిన సవాలును స్వీకరించి విష్ణుధనువును పైకి ఎత్తాడు రాముడు. తానే విష్ణు రూపాన్ని అలా అందరికీ తెలియజేశాడు.

రాముడు స్థితప్రజ్ఞుడు. తనకు దక్కుతుందనుకున్న రాజ్యం క్షణాల్లో చేజారిపోయింది. వనవాసానికి వెళ్లాల్సి వచ్చింది. రాభోగాలు అనుభవించాల్సిన సమయంలో ఆకులు అలములు తినాల్సి వచ్చింది. ఒకవైపు భార్యావియోగం. మరోవైపు రాక్షసబాధ. వయసేమంత పెద్దది కాదు.  అయినా  చలించలేదు. స్థిరంగా, దృఢంగా ఉన్నాడు. స్థితప్రజ్ఞతతో వ్యవహరించాడు. సైన్యాన్ని పోగు చేశాడు. మిత్రులను పెంచుకున్నాడు. రాక్షస సంహారం చేసి భార్యను తిరిగి పొందాడు. 
చేసిన సాయాన్ని ఎన్నడూ మరువకూడదని రాముడు చెప్తున్నాడు. కృతజ్ఞత ఆయన రక్తంలోనే ఉంది. అందుకే సీత జాడ తెలుసుకున్న హనుమంతున్ని బిడ్డలా చూసుకున్నాడు. చనువు ఇచ్చాడు. ప్రేమను పంచాడు. తను గెలుచుకున్న రాజ్యానికి మిత్రుడు విభీషనునికి పట్టం కట్టాడు. సుగ్రీవునికి మకుటం అందించాడు.  
రావణ రాజ్యం గెలిచినా అక్కడినుంచి ఒక్క చిల్లి గవ్వ కూడా ముట్టుకోలేదు. రావన రాజ్యంపై లక్ష్మణుడు ఆశ పడ్డా అతన్ని వద్దని వారించాడు. జననీ జన్మభూమిశ్చ. స్వర్గాదపి గరీయసీ అంటూ సొంత రాజ్యాన్ని గుర్తు చేశాడు. ఉన్న ఊరు కన్న తల్లితో సమానం అని సూచించాడు. 
మాసములలో మొదటి మాసం చైత్ర మాసం, సనాతన ధర్మంలో సంవత్సరంలో తొలి పండుగ, తొలి పూజ చైత్ర శుక్ల నవమి రోజు చేసే శ్రీరామ పూజ/వ్రతం.
శ్రీరామనవమి రోజున రామనామస్మరణం చేయడం, రామకోటి వంటివి రాయడంవల్ల అత్యంత పుణ్యఫలం కలుగుతుందని పురాణాలు తెలుపుతున్నాయి. 
శ్రీరామనవమి రోజు ఏ వ్రతం చేసినా ఫలించదని, కేవలం శ్రీరామవ్రతం మాత్రమే ఫలిస్తుందని, ఈ వ్రతానికి మించినది లేదని పెద్దల వాక్కు. ఈరోజు రామనామస్మరణ చేయడం, రామనామ ధ్యానం చేయడం వల్ల పాపాలు తొలగి, జయాలు సిద్ధిస్తాయి.

రామ నామం అర్థమేంటి?
రామాయణంలో రామచంద్రమూర్తికి వశిష్ట మహర్షి పేరు పెట్టారు. రామాయణం ప్రకారం.. రామ రహస్యోపనిషత్తు ప్రకారం రామ నామానికి అనేక రకాలైన అర్థాలు ఉన్నాయి. అందులో రమంతే యోగినో యత్ర రామ అని ఒక అర్థం. అనగా.. యోగీశ్వరులు ఏ భగవంతుని యందు ఆస్వాదన చెందుతారో అతనే రాముడు అని అర్థం; రామ అనే దానికి అర్థం రాక్షస యేన మరణం యాంతి -రామ. అంటే ఎవరిచే రాక్షసులు మరణించెదురో అతడే రాముడు అని.
శ్రీరామ నవమి రోజు రామనామస్మరణం చేయడం అనేక రెట్ల పుణ్యఫలం. రామ నామమును తారకమంత్రమని, తారకమంత్రమంటే తేలికగా దాటించేది అని అర్థం. ఏ మంత్రము చెప్పినా దానిముందు ఓం అని.. తర్వాత నమః అని కచ్చితంగా వాడాలి. కానీ రామ నామానికి రామ అనే మంత్రానికి ఇవి వాడాల్సిన అవసరం లేదు. శ్రీరామ, శ్రీరామ అనుకుంటూనే విష్ణులోకాన్ని పొందవచ్చని పురాణాలు తెలుపుతున్నాయి. 
పూర్వం శివుడు పార్వతీదేవికి శ్రీరామ నామ గొప్పతానాన్ని తెలియజేస్తూ శ్రీరామ రామరామేతి రమే రామే మనోరమే సహస్ర నామ తత్తుల్యం రామ నామ వరాననే అనే శ్లోకాన్ని పార్వతీదేవికి తెలియజేశాడు. విష్ణు సహస్రనామం పారాయణం తర్వాత ఈ శ్లోకంతోనే దాన్ని ముగిస్తారు. శ్రీరామ.. శ్రీరామ.. శ్రీరామ అని మూడు సార్లు అంటే ఇందులోనే వెయ్యి నామాలు ఉన్నాయని.. సకలదేవతలూ ఇందులోనే ఉన్నారని శివుడు పార్వతికి తెలియజేసినట్టు పురాణాలు చెబుతున్నాయి.

Top Post Ad

Bottom Post Ad

Show ad in Posts/Pages