Type Here to Get Search Results !

𝐂redit card frauds: 5 రోజుల్లోనే ఖాతాదారులకు సొమ్ము వాపస్‌ -ఆర్‌బీఐ ఆదేశం

0

         
♨️𝐂redit card frauds: 5 రోజుల్లోనే ఖాతాదారులకు సొమ్ము వాపస్‌
     
☛క్రెడిట్‌ కార్డు మోసాలపై బ్యాంకులకు ఆర్‌బీఐ ఆదేశం
☛2027 జనవరి 1 నుంచి అమలు
       
 క్రెడిట్‌ కార్డులు, డిజిటల్‌ బ్యాంకింగ్‌ ద్వారా జరిగే ఆర్థిక మోసాల బారిన పడే ఖాతాదారులకు ఉపశమనం కలిగించే నిర్ణయాన్ని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) తీసుకుంది. క్రెడిట్‌ కార్డు మోసాలపై ఫిర్యాదు చేసిన 5 రోజుల్లోగా, సదరు వివాదాస్పద మొత్తాన్ని బ్యాంకులు తప్పనిసరిగా షాడో రివర్సల్‌ లేదా ప్రొవిజనల్‌ క్రెడిట్‌ (తాత్కాలికంగా నగదు బదిలీ) రూపంలో ఖాతాదారుడి ఖాతాకు జమ చేయాలని ఆర్‌బీఐ ఆదేశించింది. డిజిటల్‌ లావాదేవీల్లో ఖాతాదారుల బాధ్యతను పరిమితం చేసే విధంగా సవరించిన నిబంధనలను ఆర్‌బీఐ విడుదల చేసింది. ఈ కొత్త నిబంధనలు 2027 జనవరి 1 నుంచి అమల్లోకి రానున్నాయి.

☞మోసం ఎలా జరిగినా ఖాతాదారులపై ఎటువంటి బాధ్యత పడని సందర్భాలపై ఆర్‌బీఐ స్పష్టత నిచ్చింది. బ్యాంక్‌ వైపు ఉన్న లోపాలు లేదా నిర్లక్ష్యం కారణంగా మోసం జరిగితే.. ఖాతాదారుడు ఆ విషయాన్ని ఫిర్యాదు చేసినా, చేయకపోయినా సరే ‘లావాదేవీని రద్దు చేసి, పూర్తి సొమ్మును బ్యాంకే వెనక్కి ఇవ్వాలి’. బ్యాంక్‌ లేదా ఖాతాదారుడి తప్పు లేకుండా ఏదైనా థర్డ్‌ పార్టీ హ్యాకింగ్‌ వల్ల మోసం జరిగితే, ఆ లావాదేవీ జరిగిన 5 క్యాలెండర్‌ రోజుల్లోపు ఖాతాదారుడు బ్యాంకుకు నివేదిస్తే, వారిపై ఎటువంటి బాధ్యత ఉండదు. ఒకవేళ 5 రోజుల తర్వాత ఫిర్యాదు చేస్తే, బ్యాంక్‌ పాలసీ ప్రకారం నిర్ణయం తీసుకుంటారు. ఖాతాదారుడు మోసం జరిగిందని ఫిర్యాదు చేసిన తర్వాత, ఆ ఖాతా నుంచి మళ్లీ ఎటువంటి అనధికార లావాదేవీలు జరిగినా.. బ్యాంకులే ఆ నష్టాన్ని భరించాలి.

☞బ్యాంకులు మోసపూరిత లావాదేవీ సొమ్మును వెనక్కి ఇచ్చేటపుడు, అది ఏ రోజు అయితే జరిగిందో అదే తేదీతో జమ చేయాలి. దీని వల్ల ఖాతాదారుడు ఎటువంటి వడ్డీ నష్టాన్ని లేదా అదనపు వడ్డీ ఛార్జీల భారాన్నిగానీ భరించాల్సిన అవసరం ఉండదు.

💁🏻పరిహారం ఇలా
━━━━━━━━━━━━━━━━━━━━
☛మొదటిసారి డిజిటల్‌ మోసాల బారిన పడే బాధితుడు రూ.50000 లోపు నష్టానికి గురై ఫిర్యాదు చేస్తే, అందులో 85% లేదా గరిష్ఠంగా రూ.25,000 పరిహారంగా అందుకోవచ్చు. ఈ సదుపాయం ఒక వ్యక్తికి జీవితంలో ఒక్కసారి మాత్రమే వర్తిస్తుంది.

☛రూ.29,412 కంటే తక్కువ విలువ కలిగిన దేశీయ మోసాల ఫిర్యాదుల్లో 85% పరిహారం చెల్లించాల్సి వస్తే, ఆ మొత్తంలో 65 శాతాన్ని ఆర్‌బీఐ భరిస్తుంది. మిగిలిన మొత్తంలో 10 శాతాన్ని ఖాతాదారుడి బ్యాంక్, ఇంకో 10 శాతాన్ని బెనిఫిషియరీ (మోసం డబ్బులు జమ అయిన) బ్యాంక్‌ భరిస్తాయి. వినియోగదారులే నిర్లక్ష్యంతో ఓటీపీ లేదా పాస్‌వర్డ్‌ షేర్‌ చేసి నష్టపోతే, అందుకు వారే బాధ్యత వహించాల్సి ఉంటుంది.
    
☛సవరించిన ఈ ఆదేశాలను దేశంలోని అన్ని వాణిజ్య బ్యాంకులు, స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంకులు, పేమెంట్‌ బ్యాంకులు, కో-ఆపరేటివ్‌ బ్యాంకులు తప్పనిసరిగా అమలు చేయాలని ఆర్‌బీఐ స్పష్టం చేసింది.

☛రూ.500 దాటితే ఉచిత ఎస్‌ఎంఎస్‌ తప్పనిసరి: బ్యాంకులు తమ ఖాతాదారులు చేసే ప్రతి రూ.500, అంతకుమించిన ఎలక్ట్రానిక్‌ బ్యాంకింగ్‌ లావాదేవీలకు సంబంధించి తప్పనిసరిగా తక్షణ ఎస్‌ఎంఎస్‌ అలర్ట్‌లను పంపాలి. రూ.500లోపు లావాదేవీలకు ఎస్‌ఎంఎస్‌లపై బ్యాంకులు తమ అంతర్గత పాలసీ ప్రకారం నిర్ణయం తీసుకోవచ్చు. కానీ వీటి కోసం ఖాతాదారుల నుంచి ఎటువంటి ఛార్జీలు వసూలు చేయకూడదు.


  

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు

Top Post Ad

Bottom Post Ad

Show ad in Posts/Pages