ఎందరో మహానుభావులు.. మన తెలుగు నేల చేసుకున్న పుణ్యం ఇంతా అంతా కాదు.. మన తెలుగు మహానీయుల చరిత్రలను మనం చాలా జాగ్రత్తగా వల్లెవేసుకోవలసిన తరుణమిది. వెనుకనుండి ముందుకు ముందు నుండి వెనుకకు తిరగతోడుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది. మరి ఈ సందర్భంగా మన తెలుగు భాషామతల్లిని మొదటగా ‘జ్ఞాన పీఠం’ కిరీటంతో సత్కరించిన “కవి సామ్రాట్ శ్రీ విశ్వనాథ సత్యనారాయణ” గారి జయంతి సందర్భంగా కొన్ని విషయాలు..✍🌹
👉1895 సెప్టెంబర్ 10 న కృష్ణాజిల్లా నందమూరులో జన్మించిన ఈ మహానుభావుని తల్లిదండ్రులు శ్రీమతి పార్వతమ్మ..శ్రీ శోభనాద్రి గార్లు.వీరిది సంపన్న కుటుంబం,కానీ ఆర్థికపరంగా ఎన్నో సమస్యలను ఎదుర్కోవలసి వచ్చింది.మహదాశయాలు.. ఆదర్శాలు ఉన్న విశ్వనాథవారు తమ ప్రసంగాల ద్వారా ఏదైతే నొక్కి వక్కాణించారో అదే ఆచరించి చూపారు.కులాతీత..మతాతీత విధానాలను మన సంప్రదాయాలలోని అనేకానేక పెడత్రోవలను ఆయన తన రచనలద్వారా దుయ్యబట్టకుండా అత్యంత సున్నితంగా.. మధుర గంభీరంగా.. గుండెల్లోకి చొచ్చుకుపొయేలా అద్భుతరమణీయంగా బహువిధ రచనా ప్రక్రియలతో యుగాలకు సరిపడా వడ్డించారు. విశ్వనాథ వారి రచనలు కళాఖండాలు కావు.. కళానికేతనాలు.. కళారామాలు.. కళానిలయాలు.
👉మన భారతావనిపై జరిగిన దురాక్రమణలను నిరసిస్తూ దూకిన ఆయన విశ్వనాథ కలం రేపిన కలకలం వర్ణనాతీతం. దేశ స్వాతంత్రోద్యమ సమరకవి ధీరోదాత్తుడు.. సాహిత్యసమర భీముడు.జాతిచైతన్యానికి నిలువెత్తు బావుటా మరి ఆయన సృష్టించిన మహా నవలేతిహాసం ‘వేయి పడగలు ‘.!
👉అలాగే భరతజాతిఔన్నత్యాన్ని.. సనాతనత్వాన్ని.. సనూతనంగా.. వినూత్నంగా.. సాలంకారికంగా విందు చేసిన ‘శ్రీమద్రామాయణ కల్పవృక్షం’ మనకు నిత్యనూతన జ్ఞాన పీఠం
👉అదే పరమాద్భుత చిత్రరాజమైన ‘ఏకవీర’ గా చిరస్థాయిగా.. మన తెలుగు హృదయాల్లో నిలచింది.
చెలియలికట్ట నవల మంచి పేరు తెచ్చింది. వరలక్ష్మి శ్రీశతి అనే స్మృతికావ్యం మనలను మరోలోకంలోకి పయనింపజేస్తూనే గుండెలను కరిగిస్తుంది.చారిత్రక నవలగా బద్దెన్న సేనాని ఆయనకు ప్రతిష్టతెచ్చింది. నన్నయ్య, నాచనసోమన, అల్లసాని పెద్దన, కాళిదాసుల కవితాధోరణుల మీద ఆయన విమర్శ వ్యాసాలు ఆణిముత్యాలు. ఆంధ్రసాహిత్య చరిత్రను, భారతావతరణము’వంటి పది రేడియో నాటికలుగా మలిచారు. అమృత శర్మిష్ఠమ్, గుప్తపాశుపతమ్, అనే నాటకాలను ‘ఆశ నిరాసకు’ అనే నాటికను, ‘దేవీ త్రిశతి’ శివసాహస్రకు, వంటి కావ్యాలను ఆయన సంస్కృత భాషలో రచించారు. వీరి రచనలన్నీ సంచలన రచనలే. అవి వస్తురీత్యా, ప్రయోగరీత్యా, శిల్పరీత్యా, ప్రమాణాల రీత్యా ఎన్నో సంచలనాలు సృష్టించాయి.. సాంప్రదాయకులూ, సాంప్రదాయేతరులూ విమర్శకుల రూపంలో సమంగానే ఎదిరించ యత్నించారు.అన్నిటిని తన కలంబలంతో త్రిప్పికోట్టిన సునిశిత బ్రహ్మాస్త్ర ధారి
👉మన విశ్వనాథ వారు చేపట్టని ప్రక్రియ కానీ.. ప్రయోగము కానీ లేదు. ఆయన స్మృశించని సమస్య కూడా లేదన్నది తెలుస్తుంది. వారినవల,కథ, నాటిక,పాట అదేదైనా ఒక మానసిక లేదా ఆధ్యాత్మిక లేదా సామాజిక కాదంటే సాహిత్య ఇంకా మరి చూస్తే ఒక ఆర్థిక లేదా రాజకీయ సమస్యను ప్రతిబింబిస్తూనే తగిన పరిష్కారాన్ని అందిచే విధంగా ఉండటం స్పష్టంగా కనిపిస్తుంది . విశ్వనాథ వారు ఈతరం సాహిత్యానికే కాదు సార్వకాలీన భారతీయ సాహిత్యంలోనే ఓ హిమవన్నగం .పద్యరచనా సంప్రదాయం ఆయన గుండె లయగా భాసించడం అపూర్వం
👉సంస్కృతనాటకాల్లో గుప్త పాశుపతం, అమృత శర్మిష్ఠ, తెలుగు నాటకాల్లో కనకరాజు, అనార్కలి ప్రసిద్ధమైనవి. కొలవెన్నురామకోటేశ్వరరావుతో కలిసి ”త్రివేణి’ అనే దైవమాసికాంగ్ల పత్రికకు సంపాదకులుగా వ్యవహరించారు. ….’జయంతి’ అనే దైవమాసిక తెలుగు పత్రికకు సంపాదకత్వం వహించారు. కొంతకాలం ఆయన ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమికి ఉపాధ్యక్షులుగా ఉన్నారు. కలకత్తా, బొంబాయి, ఢిల్లీ, మద్రాసు, బెంగుళూరు లాంటి పట్టణాల్లో ఆయన పొందిన సత్కారాలు అపూర్వమైనవి. కవిగా, పండితుడుగా, నవలా రచయితగా, నాటక కర్తగా, విమర్శకుడిగా, గాయకుడిగా రాణించిన విశ్వనాథ వారు 1976 అక్టోబర్ ’18’న తనువు చాలించిన ఆత్మవిద్యా విశారదులు. ఇంతటి ఆదర్శప్రాయుని కేవలం స్మరిస్తే చాలదు, పూజించవలసిన పని లేదు, కీర్తించవలసిన అవసరం లేదు.మరి ఆ అత్యద్భుత ప్రతిభాశాలి నడచిన సాహితీసేవా మార్గంలో..దేశ భక్త్యంకిత ముద్రలలో మన యువత చిత్తశుద్ధితో అడుగులు వేయడం వల్లనే మన భారత జాతికి పట్టిన ఎన్నో గ్రహణాలు వదిలే అవకాశం ఉంది.