మనం శబ్దాల్ని ఒక చెవితో వినగలం. కానీ రెండు చెవులతో వింటే శబ్దం వచ్చే దిశ, శబ్ద జనక స్థానం గుర్తించగలం. శబ్దం పుట్టిన ప్రదేశం నుంచి శబ్దం
ఒకేసారి రెండు చెవులకు చేరదు. శరీరానికి కుడి వైపున శబ్ద జనకం ఉంటే శబ్దం ముందు కుడి
చెవిని చేరుతుంది. ఆ తర్వాత ఎడమ చెవిని చేరుతుంది. ఈ రెండింటికి కాలభేదం 0.4 మిల్లీ
సెకనులు ఉంటుంది. మిల్లీ సెకను అంటే సెకనులో వెయ్యోవంతు. ఈ కాల వ్యవధి వల్ల శబ్దం ఏ
దిశ నుంచి వస్తున్నది మెదడు గ్రహించగలదు. వెంటనే శబ్దం ఏ దిశ నుంచి వచ్చిందో మనకు తెలుస్తుంది.
కీచురాయి చేసే శబ్దాన్ని బట్టి అది ఎక్కడ ఉందో చెప్పడం కష్టం. ఇది విడుదల చేసే
శబ్దం తీవ్రత ఎక్కువ. అదే విధంగా ఆ శబ్దం తరచుదనం కూడా బాగా ఎక్కువ.
కీచురాయి విడుదల చేసే ధ్వని మన రెండు చెవులకు దాదాపు ఒకేసారి వినిపిస్తుంది. అంటే
వీటి మధ్య కాలవ్యవధి బాగా తక్కువగా ఉంటుంది. అందుకే మన మెదడు కీచురాయి ఎక్కడ ఉండి శబ్దం
చేస్తున్నది కనిపెట్టలేదు.