జంతువులకు పక్షులకు
ముఖ్యమైన తేడా ఏమిటంటే పక్షులకు ఈకలు ఉంటాయి. ప్రపంచంలో నివసించే జీవులన్నింటిలోను
ఈకలు ఉండేది పక్షులకు మాత్రమే. ఈ ఈకలు... దాని చర్మంలా జీవంతో ఉండే శరీర భాగం కాదు.
అంటే పక్షికి ఈక తెగినా అక్కడ రక్తం రాదు. పక్షికి ఎటువంటి బాధ కలుగదు. మనిషికి కేశాలు
కత్తిరిస్తే ఏమీ నొప్పి ఉండనట్లే వాటికి ఈక తెగితే నొప్పి ఉండదు.
ఏడాదికి ఒకసారి
పక్షి తన ఈకలను రాల్చుకుని కొత్త ఈకల్ని పుట్టించుకుంటుంది. పాత ఈకలు క్రమక్రమంగా రాలిపోతూ
ఉంటే వాటి స్థానంలో కొత్త ఈకలు తయారవుతూ ఉంటాయి. దీనినే ఆంగ్లంలో ‘మౌల్టింగ్’ అంటారు.
పాత ఈకల స్థానంలో కొత్త ఈకలు నాలుగు నుంచి ఆరు వారాల కాలంలో తయారవుతాయి. పక్షుల రెక్కలు
అన్నీ ఈకలతో నిండి ఉంటాయి. ఈ ఈకల వల్ల పక్షి తన శరీరాన్ని వాతావరణపు చల్లదనం నుంచి
కాపాడుకుంటూ వెచ్చగా ఉంచుకోగల్గుతుంది. వాతావరణం చల్లదనానికి పక్షికి చలి అనిపించగానే
రెక్కలను శరీరానికి బాగా ఆనుకునేటట్లు ముడుచుకుంటుంది.
ఇలా చేయడం వల్ల
శరీర ఉష్ణం నష్ట పోకుండా రెక్కలు కాపాడతాయి. ఆ ఉష్ణానికే పక్షి వెచ్చగా హాయిగా ఉండగల్గుతుంది.
ఈవిధంగా రెక్కలు
పక్షికి ఉపయోగపడతాయి. బాతు, హంస వంటి పక్షులకు నీటితో
తడవని వాటర్‌ప్రూఫ్ ఈకలు ఉంటాయి. కొన్ని పక్షుల రెక్కలకు రంగు రంగుల ఈకలు ఉంటాయి.
ఈ రంగు ఈకల ఆడ
పక్షులు మగ పక్షులను ఆకర్షించి కలిసి జీవించేందుకు ఉపయోగపడతాయి. మరికొన్ని పక్షులు
తమ రంగు ఈకల సాయంతో పరిసరాల్లో కలిసి పోయి శత్రువులకు తమ ఉనికి దొరక్కుండా కాపాడుకోగల్గుతాయి.