జాబిల్లి అందిన రోజు
(జులై 20- మనిషి చంద్రుడిపై అడుగు
పెట్టిన రోజు)
భూమికి ఉన్న ఏకైక ఉపగ్రహం చంద్రుడు. అనేక ఏళ్లుగా చంద్రునిపై పరిశోధనలు జరుగుతున్నాయి.
ఇందులో భాగంగా అమెరికా, రష్యా, చైనా, ఇండియా వంటి దేశాలు అనేక
కృత్రిమ ఉపగ్రహాలను చంద్రుడిని అధ్యయనం చేయడానికి పంపాయి ఇంకా పంపుతూనే ఉన్నాయి. ఇటీవల
భారత్ చంద్రయాన్ 3ని పంపింది.
చంద్రునిపై మనిషి వేసిన మొదటి అడుగు ప్రపంచ మానవ చరిత్రలో సువర్ణాక్షరాలతో
లిఖించబడింది.1969 జూలై 16న అపోలో-11 అనే అంతరిక్ష నౌకలో నీల్ ఆర్మ్ స్ట్రాంగ్, ఎడ్విన్ ఇ.ఆల్డ్రిన్, మైకేల్ కోల్లిన్స్
అనే ముగ్గురు అమెరికా అంతరిక్ష యాత్రికులు రోదసి ప్రయాణం ప్రారంభించారు.జూలై 20న నీల్ ఆర్మ్ స్ట్రాంగ్ చంద్రుని ఉపరితలం పైన దిగి కాలు మోపాడు.
కాలు మోపుతూ..మానవజాతి కోసం వేస్తున్న చిన్న అడుగు ఇది ("That's small
step for man, one giant leap for mankind.") అంటూ వ్యాఖ్యానించాడు.
మానవుడు ఇతర గ్రహంపై కాలు మోపిన మొట్టమొదటి సందర్భం. ఆ తరువాత 20 నిమిషాలకు ఆల్డ్రిన్ దిగాడు. మూడవ వ్యోమగామి అంతరిక్ష నౌకలోనే
ఉండి ప్రయోగాలు నిర్వహించాడు. క్రిందకు దిగలేదు. ఆర్మ్ స్ట్రాంగ్ , ఆల్డ్రిన్ కలిసి చంద్రధూళిని, శిలల్ని భూమికి తీసుకువచ్చేందుకు సేకరించారు. చంద్రునిపై అమెరికా జెండా పాతారు.
అక్కడ – ‘భూగ్రహం నుంచి వచ్చిన మానవులు క్రీ.శ.జూలై 1969 లో ఇక్కడ చంద్రునిపై కాలు మోపారు. మేము మానవజాతికంతటికీ శాంతికోసం
వచ్చాము’ అని రాసిఉన్న ఫలకాన్ని అక్కడ ఉంచారు. అక్కడి నుండి అమెరికా అధ్యక్షుడు రిచర్డ్
నిక్సన్ తో వారు సంభాషించారు. చంద్రుని ఉపరితలంపై ఆర్మ్ స్ట్రాంగ్ సుమారు రెండున్నర
గంటలు గడిపారు. వారి వర్క్ స్టేషన్ లో ముగ్గురు కలిసి చంద్రునిపై ఇరవై ఒకటిన్నర గంటలున్నారు.
ఆ యాత్ర ముగించుకుని 1969 జూలై 24న భూమి పైకి తిరిగి వచ్చారు. అంతరిక్ష పరిశోధనలో ఇది ఒక కీలక
ఘట్టంగా చెప్పవచ్చు.