Page - 97
ప్రశ్నలు-జవాబులు
అ) కింది ప్రశ్నలకు నాలుగైదు వాక్యాలలో జవాబులు రాయండి?
-
1. గుణదల మేరిమాత ఉత్సవానికి మూలం ఏమిటో తెలపండి?
1924 వ సంవత్సరంలో బ్రిటిష్ ప్రభుత్వం గుణదలలో "సెయింట్ జోసెఫ్స్ ఇన్స్టిట్యూట్" అనే అనాథ శరణాలయం ఏర్పాటు చేసింది. ఇటలీకి చెందిన ఫాదర్ పి. ఆర్లాటి దానికి రెక్టార్ గా నియమితుడయ్యాడు. ఆయన అదే సంవత్సరం గుణదల కొండపై ఉన్న గుహలో మేరీమాత విగ్రహాన్ని నెలకొల్పాడు. అప్పటి నుండి మేరీమాత పూజలందుకుంటోంది. ఈ ఉత్సవాలకు లూర్థు నగరంలో మేరీమాత ఒక బాలికకు దర్శనమివ్వడం వెనుక ఉన్న కథ మూలం.
-
2. కోటప్పకొండ తిరునాళ్ళ ప్రత్యేకతను వివరించండి.
మహాశివరాత్రినాడు జరిగే ప్రభల ప్రదర్శన కోటప్పకొండ తిరునాళ్ళ ప్రత్యేకత. వెదురు కర్రలతో పది నుండి వంద అడుగుల ఎత్తు వరకు ప్రభలు నిర్మించి, రంగు కాగితాలతో, విద్యుద్దీపాలతో అలంకరిస్తారు. వీటిని మేళతాళాల మధ్య ఎడ్లబండ్లపైన, ట్రాక్టర్ల పైన కొండకు తీసుకువస్తారు. జంగమ దేవరలు దండకాలు చదువుతుండగా భక్తులు భక్తి భావంతో కొండను ఎక్కుతారు. ఈ ప్రభల ఉత్సవాన్ని ప్రభుత్వం రాష్ట్ర పండుగగా గుర్తించింది.
-
3. అహోబిలం పార్వేట ఉత్సవం ప్రత్యేకత ఏమిటి?
అహోబిలంలో సంక్రాంతి నుండి 41 రోజులపాటు స్వామివారు ఉత్సవ మూర్తిగా దేవాలయం వెలుపలకి వస్తారు. చుట్టుప్రక్కల ఉన్న 35 గ్రామాలలో ప్రతీ ఇంటిని సందర్శించి తన కళ్యాణోత్సవానికి రమ్మని ప్రజలను ఆహ్వానిస్తాడు. ఈ సందర్శనలో కులమతాల ప్రసక్తిగానీ, ధనిక బీద తారతమ్యాలు కాని ఉండవు. పారువేట అనేది దుష్టశిక్షణ, శిష్టరక్షణ గురించి జరిగే దేవ ఉత్సవం.
-
4. లేపాక్షి ఉత్సవాల గురించి మీ సొంత మాటల్లో రాయండి.
లేపాక్షి ఉత్సవాలను ప్రతి సంవత్సరం ఫిబ్రవరి, మార్చి నెలలో రెండు రోజుల పాటు నిర్వహిస్తారు. ఈ సందర్భంగా అనేక సాంస్కృతిక కార్యక్రమాలు, యక్ష, హరికథా గానాలు, నృత్య, గాన, సంగీత ప్రదర్శనలు ఏర్పాటు చేస్తారు. లేపాక్షి ఆలయాలను, చారిత్రక కట్టడాలను ప్రత్యేకంగా అలంకరిస్తారు. లేపాక్షి బసవయ్య, వీరభద్రస్వామి ఆలయం, వ్రేలాడే రాతి స్తంభం ఇక్కడి ప్రత్యేకతలు.
ఆ) కింది ప్రశ్నలకు 8 నుండి 10 వాక్యాలలో జవాబులు రాయండి.
-
1. సిరిమానోత్సవం జాతర గురించి రాయండి?
సిరిమానోత్సవం విజయనగరంలో పైడితల్లి అమ్మవారికి జరిగే ఉత్సవం. దసరా తర్వాత వచ్చే మొదటి మంగళవారంనాడు ఈ ఉత్సవం జరుగుతుంది. సుమారు 60 అడుగుల పొడవు ఉండే సిరిమానును అడవి నుండి తీసుకొచ్చి, దాని చివర ఆసనం ఏర్పాటు చేస్తారు. ఆ ఆసనంపై అమ్మవారి ప్రతిరూపంగా భావించే పూజారిని కూర్చోబెడతారు. సిరిమానుకు ముందుభాగంలో బెస్తవారి వల, అంజలిరథం నడుస్తాయి. ఈ విధంగా ఆలయం నుండి రాజప్రాసాదం వరకు మూడుసార్లు ఊరేగిస్తారు. రాబోయే సంవత్సర కాలంలో జరిగే మంచి చెడులను అమ్మవారు పూజారి రూపంలో చెబుతుందని భక్తుల విశ్వాసం.
-
2. ‘మత సామరస్యానికి ప్రతీక రొట్టెల పండుగ' ఎందుకో రాయండి?
నెల్లూరులో జరిగే రొట్టెల పండుగ హిందూ ముస్లింలు ఐకమత్యంతో జరుపుకునే పండుగ. గండవరం యుద్ధంలో అసువులుబాసిన 12 మంది ఇస్లాం వీరుల (బారా షహీద్) స్మారకార్థం దీనిని జరుపుకుంటారు. ఆర్కాటు నవాబు భార్య అనారోగ్యం ఈ వీరుల సమాధుల వద్ద మట్టి రాయడంతో కుదుటపడింది. అప్పటినుండి ప్రజలు తమ కోరికలు నెరవేరాలని ఇక్కడ ప్రార్థించి, కోరిక తీరాక రొట్టెలు పంచుకుంటారు. ఈ ఉత్సవంలో అన్ని మతాల వారు కులమతాలకు అతీతంగా పాల్గొని స్వర్ణాల చెరువులో ఒకరికొకరు రొట్టెలు పంచుకుంటారు. కాబట్టి ఇది మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తుంది.
-
3. సంస్కృతి సంప్రదాయాలను మన వారసత్వ సంపదగా తరువాతి తరానికి ఎలా అందించాలో తెలియచేయండి?
ఉత్సవాలు, జాతరలు మన సంస్కృతి, వారసత్వ సంపదకు సజీవ సాక్ష్యాలు. వీటిని రాబోయే తరాలకు అందించాలంటే మనం ముందుగా మన పండుగల, జాతరల విశిష్టతను తెలుసుకోవాలి. భిన్నత్వంలో ఏకత్వం అనే భావనను చాటిచెప్పే ఇటువంటి ఉత్సవాల్లో కులమతాలకు అతీతంగా పాలుపంచుకోవాలి. రొట్టెల పండుగ లాంటి ఉత్సవాలు మతసామరస్యాన్ని, కోటప్పకొండ తిరునాళ్లు లాంటివి పశువుల పట్ల ప్రేమను తెలియజేస్తాయి. ఈ విలువలను, చారిత్రక అంశాలను మన తర్వాత తరాలకు కథల రూపంలో, పాటల రూపంలో తెలియజేస్తూ మన వారసత్వాన్ని కాపాడుకోవాలి.