Page - 78
వినడం - ఆలోచించి మాట్లాడడం
-
1. చిత్రాన్ని గమనించండి. చిత్రంలో ఎవరెవరున్నారు?
చిత్రంలో గురువు, శిష్యులు, పాము, తేలు మరియు ఒక వ్యక్తి ఉన్నారు.
-
2. మీకు తెలిసిన ఇలాంటి నీతి పద్యాలు చెప్పండి.
ఉప్పుకప్పురంబు నొక్క పోలిక నుండు.. (విద్యార్థులు తమకు తెలిసిన పద్యాలు చెప్పాలి).
-
3. పాముకు విషము ఎక్కడ ఉంటుంది?
పాముకు తలలో విషము ఉంటుంది.
-
4. వృశ్చికము అనగా నేమి?
వృశ్చికము అనగా తేలు.
Page - 82
ఇవి చేయండి
-
ఉపాధ్యాయుడు చెప్పిన కింది పదాలను (ఉక్తలేఖనం) రాయండి.
క్షమ - సౌఖ్యము - మోక్షం - మైత్రి - ఘనత - పంకిలం -మేలిమి - కాళికాంబ - సూనృతవాణి - సఖ్యము - ధారణ - వైరం - నిత్యదానము - సత్యము - శీలము - వ్రతము - పసిడి - గురుభక్తి - భాస్కరా - పునశ్చరణము - వర్థిల్లు - విశేషజ్ఞుడు - సుజ్ఞాని - ఆంధ్రపుత్ర - విద్యార్థి. (విద్యార్థులు ఈ పదాలను ఉపాధ్యాయుడు చెబుతుంటే తప్పులు లేకుండా రాయాలి.)
Page - 83
అవగాహన - ప్రతిస్పందన
-
1. పాఠంలోని పద్యాలను రాగంతో, భావానికి తగినట్లుగా పాడండి.
(విద్యార్థులు పద్యాలను రాగయుక్తంగా పాడాలి.)
-
2. మానవ జీవితంలో ధనం యొక్క అవసరాన్ని గురించి మీ మాటల్లో చెప్పండి.
ధనము స్నేహాన్ని పెంచుతుంది. శత్రుత్వాన్ని కలుగజేస్తుంది. సభలలో గొప్పతనాన్ని తెచ్చిపెడుతుంది. లోకంలో ఎన్నో గుణాలకు ధనమే కారణమవుతుంది.
-
3. వృద్ధులకు సేవ చేయవలసిన అవసరాన్ని గురించి మీ మాటల్లో చెప్పండి.
పెద్దలను సేవిస్తే బుద్ధి వికసిస్తుంది. ప్రవర్తన పవిత్ర మౌతుంది. సంస్కారం ధర్మబద్ధమవుతుంది. పండితులు కూడా అటువంటి వారిని కీర్తిస్తారు.
-
4. కింది అపరిచిత పద్యం చదివి సమాధానాలు రాయండి.
చందమామ ఇచ్చు చల్లని వెన్నెల
తేనెటీగ ఇచ్చు తీపి మధువు
మనిషివైన నీవు మరి ఏమి తక్కువ
మంచిమాట లెపుడు మరువవద్దు!
అ) తేనెటీగ ఏమి ఇస్తుంది?తేనెటీగ తీపి మధువు ఇస్తుంది.ఆ) చల్లని వెన్నెల ఇచ్చేది ఏది?చల్లని వెన్నెల ఇచ్చేది చందమామ.ఇ) మనిషి ఏది మరువకూడదు?మనిషి ఎప్పుడూ మంచిమాటలు మరువకూడదు. -
5. కింది పరిచిత పద్యం చదివి భావం రాయండి.
క ॥ వృద్ధ జన సేవఁజేసిన
బుద్ధి విశేషజ్ఞుడనుచుఁబూత చరితుడున్
సద్ధర్మశాలియని బుధు
లిద్దరఁ బొగడెదరు ప్రేమయెసఁగు కుమారా!భావం: ఓ కుమారా! పెద్దలను సేవిస్తే బుద్ధి వికసిస్తుంది. ప్రవర్తన పవిత్ర మౌతుంది. సంస్కారం ధర్మబద్ధమవుతుంది. పండితులు కూడా అలాంటి వారిని కీర్తిస్తారు.
ఆ) కింది ప్రశ్నలకు 8 నుంచి 10 వాక్యాలలో జవాబులు రాయండి.
-
1. "బాధలోర్చుకున్న భవిత వర్థిల్లురా” అనే విషయాన్ని కవి ఎలా తెలియజేశారు?
బంగారం అగ్నిలో కాలి, సుత్తి దెబ్బలకు ఓర్చుకొని విలువైన ఆభరణంగా తయారవుతుంది. అదే విధంగా మనిషి కష్టాలకు, బాధలకు తట్టుకొని మనుగడ సాగిస్తే మంచి భవిష్యత్తు ఉంటుంది అని కవి తెలియజేశారు.
-
2. "రాగిపై పూసిన బంగారం చెదిరిపోవును" అని కవి అనడంలో ఆంతర్యం ఏమిటి ?
ఎంత రహస్యంగా ఉంచినా, చేసిన చెడ్డపని బయటపడక మానదు. రాగి పైన బంగారంతో ఎంత చక్కగా పూత పూసినా, క్రమంగా బంగారం అరిగిపోయినకొలదీ రాగి బయటపడుతుంది కదా అని కవి దీని ద్వారా వివరించారు. సత్యం ఎప్పుడూ దాగదు అన్నదే దీని ఆంతర్యం.
-
3. మహాత్ములకు ఉండవలసిన సహజ లక్షణాలు ఏవి?
చేతులతో నిత్యం దానం చేయడం, ఎప్పుడూ సత్యాన్నే మాట్లాడడం, గురువు పాదాలకు తలవంచి నమస్కరించడం మహాత్ముల లక్షణాలు. అలాగే తిరుగులేని విజయాన్ని కలిగించే భుజబలం, నిర్మలమైన మనస్సు, చెవులతో శాస్త్రాలు వినడం అనే గుణాలు ఐశ్వర్యం లేని సమయంలో కూడా వీరికి అలంకారాలుగా ప్రకాశిస్తాయి.
-
4. ఈ పాఠంలోని పద్యాల ఆధారంగా మీరు నేర్చుకున్న మంచి లక్షణాలను రాయండి.
ఓర్పు కలిగి ఉండటం వల్ల విద్య, సౌఖ్యాలు కలుగుతాయి. పెద్దలను గౌరవించడం వల్ల బుద్ధి వికసించి కీర్తి లభిస్తుంది. ఇతరులను నిందించకుండా మంచి మాటలు మాట్లాడాలి. సత్యం కీర్తికి మూలం కాబట్టి ఎప్పుడూ సత్యమే పలకాలి. కష్టాలను ఓర్చుకుంటేనే మంచి భవిష్యత్తు ఉంటుంది.
Page - 84
భాషాంశాలు - i. పదజాలం
అ) కింది వాక్యాలను చదవండి. గీతగీసిన పదాలకు అర్థాలు రాయండి.
-
1. క్షమ వలన సిరి లభిస్తుంది.
క్షమ = ఓర్పు / సహనం
-
2. స్నేహితులతో వైరం మంచిదికాదు.
వైరం = శత్రుత్వం / విరోధం
-
3. తామరలు పంకిలం నుండి వికసిస్తాయి.
పంకిలం = బురద
-
4. భాస్కరుడు లోకానికి వెలుగునిస్తాడు.
భాస్కరుడు = సూర్యుడు
ఆ) కింది వాక్యాలలో సమానార్థక పదాలను (పర్యాయ పదాలు) గుర్తించి రాయండి.
-
1. కరముతో అన్నం తింటాము. హస్తములో రేఖలుంటాయి.
చెయ్యి = కరము, హస్తము
-
2. ధనమే అన్నింటికీ మూలం. ద్రవ్యం లేక పేదలు ఆకలితో పస్తులుంటున్నారు.
డబ్బు = ధనము, ద్రవ్యము
-
3. ఆడపిల్ల చదువు అవనికే వెలుగు. భూకంపం వల్ల పుడమి కుంగుతుంది.
భూమి = అవని, పుడమి
-
4. పసిడితో చేసిన ఆభరణాలు అందంగా ఉంటాయి. అందుకే పుత్తడికి ధర ఎక్కువ.
కనకం = పసిడి, పుత్తడి
ఇ) కింది పదాలకు వ్యతిరేక పదాలను రాయండి.
- 1. ధర్మం X అధర్మం
- 2. సుజ్ఞాని X అజ్ఞాని
- 3. పాపం X పుణ్యం
- 4. చెడు X మంచి
- 5. సత్యం X అసత్యం
- 6. మైత్రి X వైరం / శత్రుత్వం
Page - 85
ఈ) ప్రకృతి - వికృతి
| A | Ans | B |
|---|---|---|
| 1. విద్య | ( ఆ ) | అ) అంచ |
| 2. ధర్మము | ( ఈ ) | ఆ) విద్దె |
| 3. హంస | ( అ ) | ఇ) మొగము |
| 4. ముఖము | ( ఇ ) | ఈ) దమ్మము |
ఉ) కింది పదపట్టిక ఆధారంగా శతకాలను, శతక కర్తలను గుర్తించండి. వాటి చుట్టూ గీతగీసి ఖాళీలలో రాయండి.
-
1. ధూర్జటి రాసిన శతకం?
శ్రీకాళహస్తీశ్వర శతకం
-
2. వీరబ్రహ్మం గారు రాసిన శతకంలోని మకుటం
కాళికాంబ
-
3. మారద వెంకయ్య రాసిన శతకం?
భాస్కర శతకం
-
4. తెలుగుబాల శతక కర్త?
కరుణశ్రీ / జంధ్యాల పాపయ్య శాస్త్రి
-
5. కంచర్ల గోపన్న రాసిన శతకం?
దాశరథీ శతకం
-
6. సుమతీ శతకం రాసిందెవరు?
బద్దెన
-
7. నార్ల చిరంజీవి రాసిన శతకం?
తెలుగుపూలు శతకం
-
8. సిరిసిరి మువ్వ శతక కర్త?
శ్రీశ్రీ
-
9. కాళికాంబ సప్తశతి శతక కర్త ఎవరు?
పోతులూరి వీరబ్రహ్మం
-
10. సుభాషిత రత్నావళి కర్త?
ఏనుగు లక్ష్మణ కవి
Page - 88
అభ్యాసం 1
కింది పదాలను విడదీసి, అది ఏ సంస్కృత సంధో (సవర్ణదీర్ఘ / గుణ) గుర్తించండి.
| సంధి పదం | విడదీసిన రూపం (పూర్వపదం + పరపదం) | సంధి పేరు (సవర్ణదీర్ఘ/ గుణ) |
|---|---|---|
| ఉదా : కాళికాంబ | కాళిక + అంబ | సవర్ణదీర్ఘ సంధి |
| 1. హితోక్తి | హిత + ఉక్తి | గుణ సంధి |
| 2. గురుచరణాభివాదనము | గురుచరణ + అభివాదనము | సవర్ణదీర్ఘ సంధి |
| 3. నరేంద్రుడు | నర + ఇంద్రుడు | గుణ సంధి |
| 4. గురూపదేశం | గురు + ఉపదేశం | సవర్ణదీర్ఘ సంధి |
| 5. దేవర్షి | దేవ + ఋషి | గుణ సంధి |
Page - 89
అభ్యాసం 2
తెలుగు సంధులను గుర్తించండి.
| సంధి పదం | విడదీసిన రూపం (పూర్వపదం + పరపదం) | సంధి పేరు |
|---|---|---|
| ఉదా : నిలువెల్ల | నిలువు + ఎల్ల | ఉత్వ సంధి |
| 1. ప్రేమయెసంగు | ప్రేమ + ఎసంగు | యడాగమ సంధి |
| 2. మూసినయంతటన్ | మూసిన + అంతటన్ | యడాగమ సంధి |
| 3. మేలది | మేలు + అది | ఉత్వ సంధి |
అభ్యాసం 3
విగ్రహ వాక్యం రాసి సమాసాలను గుర్తించండి.
| సమాసం | విగ్రహవాక్యం | సమాసం పేరు |
|---|---|---|
| ఉదా : గురుచరణాభివాదనము | గురువు యొక్క చరణములకు అభివాదము | షష్ఠీ తత్పురుష సమాసం |
| 1. సుత్తిదెబ్బ | సుత్తి చేత దెబ్బ | తృతీయా తత్పురుష సమాసం |
| 2. దేశభక్తి | దేశము నందు భక్తి | సప్తమీ తత్పురుష సమాసం |
| 3. లోకమిత్ర | లోకమునకు మిత్రుడు | షష్ఠీ తత్పురుష సమాసం |
| 4. ఆంధ్రపుత్ర | ఆంధ్రుల యొక్క పుత్రుడు | షష్ఠీ తత్పురుష సమాసం |
ప్రాజెక్టుపని
| క్రమ సంఖ్య | కవి | శతకం పేరు | ఇతర రచనలు |
|---|---|---|---|
| 1 | పోతన | భాగవతము | వీరభద్ర విజయం |
| 2 | పక్కి అప్పల నరసయ్య | కుమార శతకం | కుమారి శతకం |
| 3 | మారద వెంకయ్య | భాస్కర శతకం | - |
| 4 | పోతులూరి వీరబ్రహ్మం | కాళికాంబ సప్తశతి | కాలజ్ఞానం |
Page - 90
నేనివి చేయగలనా?
| అంశం | ఔను / కాదు |
|---|---|
| 1. పాఠంలోని పద్యాలను రాగయుక్తంగా, భావయుక్తంగా పాడగలను. | ఔను |
| 2. పద్యభావాలను సొంత మాటలలో చెప్పగలను, రాయగలను. | ఔను |
| 3. పాఠంలోని పదాలను సొంత వాక్యాలలో ఉపయోగించగలను. | ఔను |
| 4. పాఠంలోని ప్రశ్నలకు జవాబులు సొంతమాటలలో రాయగలను. | ఔను |