ప్రపంచంలోనే అతిపెద్ద విగ్రహాన్ని ఆవిష్కరించిన మోడీ
గాంధీనగర్: భారతదేశపు ఉక్కు మనిషి అంటే ఎవరికైనా గుర్తుకు వచ్చే పేరు ఒక్కటే అదే సర్దార్ వల్లభాయ్ పటేల్. మనదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత 565 సంస్థానాలను తిరిగి భారతదేశంలో విలీనం చేసి దేశ సమైక్యతా సారథిగా దేశ ప్రజల గుండెల్లో నిలిచిపోయారు. అందుకే ఆయనకు తగిన గౌరవం ఇచ్చేందుకు నర్మదా నదీ తీరాన ప్రపంచంలోనే అతిపెద్ద విగ్రహాన్ని ప్రధాని నరేంద్ర మోడీ సారథ్యంలో నిర్మించడం జరిగింది.
కాంస్యంతో విగ్రహం..
ఇక పటేల్ విగ్రహ నిర్మాణానికి వస్తే.. పటేల్ విగ్రహాన్ని అత్యాధునిక పద్ధతుల్లో నిర్మించారు. అక్కడ నివసించే స్థానికులకు ఇబ్బంది లేకుండా, సందర్శకులు ప్రశాంతంగా చూసేలా ఏర్పాటు చేశారు. కాంస్యంతో నిర్మించడం వల్ల చూడటానికి అందంగా, ఆహ్లాదంగా ఉంటుంది.
విగ్రహంలోపలే లిఫ్టులు
కాగా, విగ్రహం ఛాతి వరకు వెళ్లి పరిసరాలను చూసేలా లోపలి నుంచి రెండు లిఫ్ట్‌లు ఏర్పాటు చేశారు. కాంక్రీట్‌తో నిర్మించిన రెండు కాళ్ల లోపలి నుంచి ఈ రెండు లిఫ్ట్‌లను ఏర్పాటు చేశారు. వాటిద్వారా 157 మీటర్ల ఎత్తు వరకూ సందర్శకులు వెళ్లవచ్చు. అంటే పటేల్ ఛాతి దగ్గర నుంచి ప్రకృతి అందాలను వీక్షించే అవకాశం ఉంది.
పర్యాటకాభివృద్ధి
రోడ్డు, రైలు అనుసంధానంతో మౌలిక వసతులను అభివృద్ధి చేశారు. విగ్రహం ఉన్న సాధు ఐలాండ్‌ను వంతెన నిర్మించి హైవేతో కలిపారు. గిరిజనుల అభివృద్ధికి ఇక్కడ పాఠశాలలు, విశ్వవిద్యాలయం ఏర్పాటవుతాయని ప్రభుత్వం తెలిపింది. మెమోరియల్, సందర్శకుల కేంద్రం, విద్యా పరిశోధనా కేంద్రం, నాలెడ్జ్ సిటీ, గరుడేశ్వర్ నుంచి బద్‌బుత్ వరకూ పర్యాటక కారిడార్, క్లీన్ టెక్నాలజీ పరిశోధనా కేంద్రం, వ్యవసాయ శిక్షణా కేంద్రం రూపుదిద్దుకున్నాయి.
అక్కడే విగ్రహం ఎందుకంటే..
సర్దార్ సరోవర్ డ్యాం ఇప్పటికే పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చెందింది. అది ప్రపంచంలోనే అత్యధిక కాంక్రీట్ వాడిన రెండో డ్యాంగా ప్రసిద్ధి చెందింది. 1210 మీటర్ల పొడవైన కాంక్రీట్ గ్రావిటీ డ్యాం ఇది. 121 మీటర్ల ఎత్తున ఉంది. విగ్రహం నుంచి చూస్తే డ్యాం అందాలు కనువిందు చేస్తాయి.
2010లోనే మోడీ నిర్ణయం
పటేల్ విగ్రహం ఏర్పాటుకు గుజరాత్ ప్రభుత్వం సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ రాష్ట్రీయ ఏక్తా ట్రస్టును (ఎస్‌వీపీఆర్‌ఈటీ) ఏర్పాటు చేసింది. ఈ సంస్థ విగ్రహం ఏర్పాటుతో పాటు ఆ ప్రాంత అభివృద్ధికి గల అవకాశాలను అధ్యయనం చేసింది. 2010లో విగ్రహం ఏర్పాటుకు అప్పటి ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ శ్రీకారం చుట్టారు. అప్పటికే ఏర్పాటై ఉన్న సర్దార్ సరోవర్ నర్మదా నిగం లిమిటెడ్ ఇందులో పాలుపంచుకుంది.
3వేల కోట్లు.. విగ్రహ విశేషాలు
విగ్రహం ఎత్తు: 182 మీటర్లు (సుమారు 597 అడుగులు)
నిర్మాణ ప్రదేశం: సాధు బెట్ ఐలాండ్. సర్దార్ సరోవర్ డ్యామ్‌కు 3.5 కిలోమీటర్ల దూరం. వింధ్యాచల్, సాత్పూర పర్వత సానువుల మధ్య.
వ్యయం: రూ.2,989 కోట్లు.
ప్రాజెక్టు మొత్తం పరిధి 19,700 చదరపు మీటర్లు.
నిర్మాణంలో 1700 టన్నుల కాంస్యం, 1,80,000 క్యూబిక్ మీటర్ల సిమెంటు, 18,500 టన్నుల స్టీల్ కాంక్రీట్‌లో కలిపి, 6500 టన్నుల స్టీల్ విడిగా స్ట్రక్చర్ కోసం వాడారు.