_ప్రకృతిలో ప్రతి ప్రాణికీ జీవితకాలం అనేది ఒకటుంటుంది. మనిషి తయారుచేసిన ప్రాణంలేని వస్తువులకి కూడా అంతే. అందుకే ఆహార పదార్థాలు కొనేటప్పుడు తయారైన తేదీకోసం ప్యాకెట్ మీద చూస్తాం. అదే - ఫర్నిచర్ విద్యుత్ పరికరాలో మరొకటో అయితే ఎన్నాళ్లు మన్నుతాయో తెలుసుకుని మరీ కొంటాం. కానీ ఏ ఎక్స్ పైరీ డేటూ లేకుండా మన జీవితంలో భాగమైపోయిన వస్తువు- ప్లాస్టిక్. పేరుకి ఒకటే కానీ, ప్రతి పనికీ నేనున్నానంటూ పలు రూపాల్లో ప్రత్యక్షమై మనిషి చుట్టూ ఓ విషవలయంలా అల్లుకుపోయింది. వాడి పారేశాక కూడా వందల ఏళ్లయినా నాశనం కాకుండా మనిషి మనుగడకే ప్రమాదకరంగా మారుతున్న ఆ విషవలయాన్ని ఛేదించేందుకే... ఇప్పుడు ప్రయత్నాలు మొదలయ్యాయి! గాంధీజీ 150వ జయంతి సందర్భంగా సింగిల్యూజ్ ప్లాస్టిక్ వస్తువుల్ని నిషేధిస్తూ ప్రభుత్వం ప్రకటన చేయనున్న నేపథ్యంలో... ప్లాస్టిక్ కథా కమామిషు!_
〰〰〰〰〰〰〰〰
*వాడి పారేయడం ఇక వద్దు*
షాపింగ్ కి వెళ్తాం. దాహమేస్తుంది. ఓ నీళ్ల సీసా కొనుక్కుని తాగేసి అవతల పడేస్తాం.వంట చేసే ఓపిక లేదు. ఏ హోటల్ నుంచో క్యారియర్ తెప్పిస్తాం. అబ్బో... డజను వెరైటీలు ఇచ్చాడు అనుకుంటూ ఒక్కో కవరూ తెరిచి చూసి అన్నిటి రుచుల్నీ ఆస్వాదిస్తూ తినేస్తాం. ఖాళీ అయిన ఆ ప్లాస్టిక్ కవర్లన్నిటినీ మరో పెద్ద కవర్లో పెట్టి ఓ పావుకిలో చెత్తని బుట్టలో పడేస్తాం.పిల్లవాడి పుట్టినరోజు. చుట్టుపక్కల పిల్లల్నీ పెద్దల్నీ పిలుస్తాం. అందరికీ కేకుతో పాటు సమోసాలూ చిప్సూ కూల్ డ్రింకూ అది తాగని వాళ్లకి టీ... ఇస్తాం. అందుకోసం వాడిన ప్లాస్టిక్ ప్లేట్లూ, స్పూన్లూ, స్ట్రాలూ, గ్లాసులూ, టీకప్పులు అన్నీ కలిసి మర్నాడు పారేయడానికి మరో పెద్ద సంచీ చెత్త సిద్ధం. ఇలా ఎంత ప్లాస్టిక్ ని వాడి , పారేస్తున్నాం మనం? ఆ తర్వాత దాని సంగతేమిటని ఎప్పుడైనా ఆలోచించామా? లేదు కదా! అలా ఆలోచించకపోవడమే... కొంపముంచింది. ప్లాస్టికను నిషేధించక తప్పని పరిస్థితి తెచ్చింది. ఇక నుంచీ ఇలా ఒకసారి వాడి పారేసే ప్లాస్టిక్ వస్తువులు వేటినీ ఎవరూ వాడకూడదంటోంది ప్రభుత్వం. అసలు ప్లాస్టిక్ లేకుండా మన ఇళ్లలో ఏ వస్తువూ ఉండదు. పర్సులో ఉన్న ఏటీఎం కార్డులతో మొదలు పెడితే భోజనాల బల్ల మీద నీళ్ల సీసాల వరకూ అడుగడుగునా ప్లాస్టిక్ కన్పిస్తుంది. ఎంత ఉపయోగపడకపోతే 70 ఏళ్లలో దాని ఉత్పత్తి 190 రెట్లు పెరుగుతుంది మరి! మనదేశంలో తలసరిన ఏడాదికి 11కిలోల ప్లాస్టిక్ వాడి పారేస్తున్నామట. అంతేకదా అనుకోకండి... ఇంత వాడితేనే రోజుకు 26వేల టన్నుల ప్లాస్టిక్ చెత్త తయారవుతోంది. అందులో పది వేల టన్నులమేరకు సేకరణకు అందకుండా చెత్తకుప్పల్లోకి వెళోంది. కేవలం ఫుడ్ డెలివరీ ఆప్ల వల్లనే సగటున నెలకు 22 వేల టన్నుల ప్లాస్టిక్ చెత్త తయారవుతోందని ఓ లెక్క. ఈ లెక్కలన్నీ కూడా అంచనాలే. ఎందుకంటే దేశంలో 35 ప్రాంతీయ కాలుష్య నియంత్రణ మండళ్లు ఉంటే వాటిల్లో కొన్ని మాత్రమే ప్లాస్టిక్ చెత్తకు సంబంధించిన సమగ్ర నివేదికలను ప్రభుత్వానికి ఇస్తున్నాయి. అలా ఇచ్చినవాటి ఆధారంగా తీసిన సగటు లెక్కలే ఇవన్నీ. వాస్తవం ఇంకా ఎక్కువగా ఉంటుందన్నది నిపుణుల అభిప్రాయం. ఇక, ఎన్నో రకాలుగా ఉపయోగపడే ప్లాస్టిక్ ని పూర్తిగా నిషేధించడమనేది అసాధ్యం. అయితే మిగతా వస్తువులతో పోలిస్తే ఒకసారి వాడి పారేసే వస్తువులు చేసే హాని మరీ ఎక్కువ. మనం అవసరానికి వాడుకుని నిర్లక్ష్యంగా పారేస్తున్న ఆ వస్తువులన్నీ రకరకాల మార్గాల్లో నీళ్లలో ఆహారంలో కలిసి మళ్లీ మన శరీరంలోకే వస్తున్నాయి. మరో పక్క ఈ ప్లాస్టిక్ చెత్తను ఏం చేయాలన్నది నగరాలన్నిటికీ పెద్ద తలనొప్పిగా మారింది. మరో పదేళ్లలో 160 మిలియన్ టన్నులకు చేరే మన ప్లాస్టిక్ చెత్తను ఓ చోట కుప్ప వేస్తే పది మీటర్ల ఎత్తున బెంగళూరు నగరమంత విశాలమైన చెత్తకుప్ప ఏర్పడుతుందట. అది కూడా ఇరవై ఏళ్ల చెత్తతోనే. ఈ లెక్కన మనం వాడే చెత్త కొండలూ గుట్టలుగా పేరుకుపోయి మనల్ని ముంచేయడానికి ఎన్నో ఏళ్లు పట్టదు. అందుకే అర్జెంటుగా మేలుకోక తప్పదంటున్నదీ... వాడి పారేసే ప్లాస్టిక్ వస్తువులకు వీడ్కోలు చెప్పమంటున్నదీను!
〰〰〰〰〰〰〰〰
*సగం వాటా... దానిదే మరి!*
ప్రపంచంలో ఏటా మూడువేల లక్షల టన్నుల ప్లాస్టిక్ తయారవుతోంది. అంటే ఎంతో తెలుసా- ప్రపంచ జనాభా బరువంత! ఏం చేస్తున్నాం ఈ ప్లాస్టిక్తో అంటే- అన్ని పనులూ! దుస్తుల పరిశ్రమ, నిర్మాణ రంగం, రవాణా, కమ్యూనికేషన్, వినోదం, ఆరోగ్యం... అసలు ప్లాస్టిక్ వాడని రంగం అంటూ ఏదీ లేదు. తేలిగ్గా ఉండి మన అవసరాలకు అనుగుణంగా దాన్ని ఎలా కావాలంటే అలా మలచుకునే వీలుండడంతో ప్లాస్టిక్ ఇలా మన జీవితాలతో అల్లుకుపోయింది. అంతవరకూ బాగానే ఉంది. పరిశ్రమల్లో వాడేదాంతో గొడవ లేదు కానీ, తయారవుతున్న ప్లాస్టిక్ లో సగం వ్యక్తిగత వినియోగానికి సంబంధించిందే. అంటే ఒకసారి వాడి పారేసే వస్తువులకోసం వాడడమే అసలు సమస్య. కప్పులూ క్యారీబ్యాగులూ నీళ్ల సీసాలే కాదు, పొద్దున్నే పాలపాకెట్తో మొదలు పెట్టి స్నానానికి షాంపూ పాకెట్లు, వంటల్లో వాడే నూనెలూ మసాలాల పాకెట్లు, చాకొలెట్లూ చిప్సూ లాంటి పిల్లల చిరుతిళ్ల పాకెట్లు... అన్నీ ఒకసారి వాడి పారేసేవే. ఇవేవీ రీసైక్లింగ్ కి వెళ్లవు. చెత్తకుప్పల్లోకి వెళ్తాయి. ప్లాస్టిక్ కాగితాలూ చెత్త ఏరేవాళ్లు కూడా పెద్ద పెద్ద క్యారీబ్యాగులూ సంచుల్లాంటివాటినీ ప్లాస్టిక్ సీసాలనూ ఏరతారు తప్ప చిన్నచిన్నవి సేకరించరు. అందుకే చెత్త ఆంతులేకుండా పెరిగిపోతోంది. వీటి వాడకం తగ్గిస్తే తప్ప ప్లాస్టిక్ ప్రళయం నుంచి తప్పించుకునే పరిస్థితి లేదు. ఇప్పటికే దేశంలోని 20కి పైగా రాష్ట్రాలు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ని నిషేధిస్తూ చట్టాలు చేశాయి. కానీ ఆ చట్టాలకీ అమలుకీ మధ్య పొంతన ఉండడం లేదు. ఉన్నపళంగా మానేయడం ఏదైనా కష్టమే. అలాగని ప్రాణాల మీదికి తెచ్చుకోవడం కన్నా సాధ్యమైనంత త్వరగా ప్రత్యామ్నాయాలు వెతుక్కోవడం మంచిది కదా. కావాల్సిందల్లా దృఢనిశ్చయమే. అప్పుడు ప్రత్యామ్నాయాలు వెతుక్కుంటూ వస్తాయి. అసోంకి చెందిన ధృతిమాన్ బోరా చాలాకాలంగా ఒక ప్రత్యేకమైన వెదురుతో నీళ్ల సీసాలు తయారుచేసి విక్రయిస్తున్నాడు. పూర్తిగా పర్యావరణ హితమైన ఈ సీసాలు 18 నెలలు మన్నుతాయట. తమిళనాడులో నిషేధం తర్వాత ఆహారపదార్థాల ప్యాకేజింగ్ కి అరిటాకులు వాడుతున్నారు. కొబ్బరినీళ్లు తాగడానికి వెదురు గొట్టాలను ఇస్తున్నారు. వెతికితే ఇలాంటి ప్రత్యామ్నాయాలు మరెన్నో కన్పిస్తాయి.
〰〰〰〰〰〰〰〰
*ప్రాణాలకే ప్రమాదం*
ప్లాస్టిక్ ని మానవాళి సౌకర్యానికి తయారైన విప్లవాత్మక వస్తువుగా పరిగణించేవారు మొన్నమొన్నటివరకూ. అలాంటిది ఇప్పుడది మానవాళి మనుగడకే ప్రమాదకరంగా పరిణమించింది. ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది కదా అని మనం ముచ్చట పడి ఇంటికి తెస్తే మనకు తెలియకుండానే అది మన ఒంట్లోకి చేరుతోంది! ప్రపంచ ఆరోగ్య సంస్థ అన్ని దేశాల్లోనూ తాగునీటి నమూనాలు సేకరించి పరీక్షించగా 88శాతం నమూనాల్లో మైక్రో ప్లాస్టిక్స్ ఉన్నాయట. ఈ తరహా నీటి కాలుష్యంలో అమెరికా, లెబనాన్ తర్వాత మూడో స్థానంలో మన దేశం ఉంది. భూమి మీద ఎక్కడ పడితే అక్కడ చెత్త కుప్పల్లో కన్పించడమే కాక జల వనరులన్నిట్లోనూ చేరిన ప్లాస్టిక్ నాశనమయ్యే క్రమంలో కంటికి కనపడని సూక్ష్మరేణువులుగా విడిపోతుంది. అదే మొక్కల ద్వారా, జలచరాల ద్వారా మన ఆహారంలోకీ నీటి ద్వారా నేరుగా మన ఒంట్లోకి ప్రవేశిస్తోందన్న మాట. ఫలితంగా హార్మోన్ల సమస్యలూ, క్యాన్సర్లూ, ఊపిరితిత్తుల వ్యాధులూ వంటి ఎన్నో అనారోగ్యాలను ఎదుర్కొనవలసి వస్తోంది. మరో పక్క పాడైపోయిన ఆహారపదార్థాల్ని క్యారీబ్యాగులో వేసి మనం చెత్తకుప్పలో పడేస్తే పశువులు ఆహారంతో పాటు ఆ పలుచని సంచుల్నీ తినేస్తున్నాయి. వీధి కుక్కలూ ఆవుల్లాంటి జంతువులకి వైద్యం చేసినప్పుడు వాటి పొట్టల్లో నుంచీ కిలోలకు కిలోలు ప్లాస్టిక్ ని బయటకు తీస్తున్నారు వైద్యులు. ఆఖరికి పిచ్చుకల్లాంటి చిన్ని పక్షుల పొట్టల్లో కూడా ప్లాస్టిక్ అవశేషాలు కన్పిస్తున్నాయంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఇక చేపలూ తాబేళ్లూ లాంటి జలచరాల సంగతి అయితే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కేవలం ప్లాస్టిక్ వల్ల కొన్ని జాతులు ఇప్పటికే అంతరించే స్థాయికి చేరుకున్నాయి.
〰〰〰〰〰〰〰〰
*నిమిషానికి పది లక్షలు*
ప్లాస్టిక్ వాడకానికి సంబంధించిన కొన్ని గణాంకాలు చూస్తే చాలు ఈ సమస్య ఎంత తీవ్రంగా ఉందో అర్థమైపోతుంది.
➤ ప్రపంచవ్యాప్తంగా నిమిషానికి పది లక్షల నీళ్ల సీసాలు అమ్ముడవుతున్నాయి. * క్యారీ బ్యాగులైతే ఇరవై లక్షలకన్నా ఎక్కువే చేతులు మారుతున్నాయి. వీటిల్లో ఒక్క శాతం కూడా రీసైక్లింగ్ కి రావటం లేదు.
➤ ఒక్కో క్యారీ బ్యాగు జీవితకాలం సగటున 12 నిమిషాలట. అంటే దాన్ని మనం వాడుకునే సమయం. కానీ ఆ తర్వాత ఐదువందల ఏళ్ల వరకూ అది చిరాయువుగా ఏ చెత్తకుప్పలోనో పడి ఉంటుంది.
➤ రోజుకు 5 కోట్ల స్టాలు చెత్తకుప్పల్లోకి వెళ్తున్నాయి.
➤ రోజుకు 18కోట్ల ప్లాస్టిక్ టీకప్పుల్ని వాడి పారేస్తున్నాం.
➤ నిమిషానికి ఓ నిండు ట్రక్కు ప్లాస్టిక్ చెత్త సముద్రంలో కలుస్తోంది. ఏడాదికి కోటిన్నర టన్నుల చెత్త సముద్రంలోకి చేరుతుండగా అందులో అత్యధిక భాగం మన హిందూమహాసముద్రంలోనే కలుస్తోందట. ఈ చెత్త అంతా బంగాళాఖాతంలో అడుగున ఎక్కడో మేట వేస్తోందనీ ఎప్పుడో దీనివల్ల ప్రళయం ముంచుకొస్తుందని శాస్త్రవేత్తలు అంటున్నారు.
➤ మనదేశంలో 86శాతం నల్లా నీటిలో సూక్ష్మ ప్లాస్టిక్ రేణువులు ఉంటున్నాయి. నీటి ద్వారానే ఎంతలేదన్నా వారానికి ఓ ఐదుగ్రాముల ప్లాస్టిక్ మన కడుపులోకి వెళోందని చెబుతోంది ఓ అధ్యయనం.
〰〰〰〰〰〰〰〰
*సరికొత్తగా... సేకరణ!*
వాడేసిన ప్లాస్టిక్ వస్తువులను పక్కాగా రీసైక్లింగ్ చేయాలంటే వాడినవన్నీ మళ్లీ వెనక్కి రావాలి. చెత్త కుండీల దగ్గరా డంపుయార్డుల్లోనూ కొంతమంది ప్లాస్టిక్ చెత్తను వేరుచేస్తున్నారు. అయితే అలా సేకరించినదాన్ని చాలా శుభ్రం చేయాలి. అలా కాకుండా వాడినవాటిని వాడినట్టే- అంటే, చెత్తకుప్పల్లోకి చేరకుండానే సేకరిస్తే శుభ్రంగా ఉంటాయి కాబట్టి చాలా తేలిగ్గా వాటిని రీసైక్లింగ్ చేయొచ్చు. అలాంటి ప్లాస్టిక్ ని సేకరించడానికి రకరకాల సృజనాత్మక విధానాలను అనుసరిస్తున్నారు కొందరు. ఎలా అంటే...
➤ ఛత్తీస్గఢ్లోని అంబికాపూర్ మున్సిపల్ కార్పొరేషన్ నిరు పేదల కడుపు నింపడానికి ఓ పథకం ప్రారంభించింది. దాని కింద డబ్బుకి బదులు ప్లాస్టిక్ తీసుకుంటోంది. అరకిలో ప్లాస్టిక్ తెస్తే టిఫినూ కిలో తెస్తే భోజనమూ పెడుతోంది. దీనివల్ల చెత్త ఏరుకునేవాళ్ల ఆకలి తీరుతోంది. సేకరించిన ప్లాస్టిక్ వస్తువుల్నేమో రీసైక్లింగ్ చేసి రోడ్లు వేస్తున్నారు.
➤ ప్లాస్టిక్ సీసాలతో ఫోన్ రీచార్జ్ చేసుకునే ఏర్పాటు రైల్వే స్టేషన్లలో చేస్తున్నారు. ఇప్పటికే 128 రైల్వే స్టేషన్లలో ప్లాస్టిక్ సీసాలను ధ్వంసం చేసే 160 మిషన్లను ఏర్పాటుచేశారు. త్వరలో వీటి సంఖ్య 400కి పెంచనున్నారు. ఎవరైనా నీసాలను అందులో పడేసి తమ ఫోన్ నంబరు ఇస్తే చాలు- వేసిన సీసాలకు తగిన ప్రతిఫలంతో ఫోన్ రీఛార్జ్ అయిపోతుంది.
➤ పశ్చిమ్ బంగలోని సిలిగురి జిల్లాలో ఉన్న గోథెల్స్ మెమోరియల్ స్కూల్లో ప్రతి శనివారమూ పిల్లలూ పెద్దలూ ఎవరైనా సరే అరకిలో ప్లాస్టిక్ వస్తువులు తెచ్చిస్తే వారికి ఉచితంగా భోజనం పెట్టి పంపిస్తారు.
➤ ఈ ఏడాది జరిగిన ప్రయాగ కుంభమేళాలో నిర్వాహకులు ప్రత్యేక కియోస్క్లను ఏర్పాటుచేశారు. ఎవరైనా ప్లాస్టిక్ క్యారీ బ్యాగులూ కప్పులూ సీసాల్లాంటివాటిని అందులో వేస్తే ప్రతిఫలంగా వారికి మట్టి కప్పులో వేడి వేడి టీ వచ్చేది. అలా సేకరించిన ప్లాస్టిక్ చెత్తనంతా సాయంత్రం మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది తీసుకెళ్లి రీసైక్లింగ్ కి పంపేవారు. దీనివల్ల పరిసరాలూ శుభ్రంగా ఉండేవి, ప్లాస్టిక్ వ్యర్థాలు నదిలో కలవకుండా రీసైక్లింగ్ కి చేరేవి.
➤ అసోంలోని పామోహి గ్రామంలో 'అక్షర్ అనే పాఠశాల ఉంది. అక్కడ చదువుకునే పిల్లలు ఫీజుగా డబ్బుకి బదులు వారానికి వాడేసిన 25 ప్లాస్టిక్ వస్తువులు ఇస్తే చాలు. ఆ వస్తువులన్నిటినీ రీసైక్లింగ్ కి పంపిస్తుంది స్కూలు యాజమాన్యం.
〰〰〰〰〰〰〰〰
*వాడితే రీసైక్లింగ్ చేయొచ్చు*
ప్లాస్టిక్ వల్ల పొంచి ఉన్న ఈ ప్రమాదాల నుంచి తప్పించుకోవాలంటే వాడిన ప్లాస్టిక్ వస్తువుల్ని రీసైక్లింగ్, అప్ సైక్లింగ్లలో ఏదో ఒకటి చేయాలి. ప్లాస్టిక్ ని కరిగించేసి లేదా పూర్తిగా చిన్నచిన్న ముక్కలుగా చేసి మరో కొత్త పనికి దాన్ని ముడిసరుకుగా వాడడాన్ని రీసైక్లింగ్ అంటారు. వాడిన ప్లాస్టిక్ వస్తువుల్నే కొద్దిగా రూపం మార్చి మరో ప్రయోజనానికి వాడడాన్ని అప్ సైక్లింగ్ అంటారు. ఈ ప్రక్రియలతో ప్లాస్టిక్ వల్ల పర్యావరణానికీ సహజ వనరులకీ హాని జరగదు, వాడినవాటినే మళ్లీ వాడటం వల్ల కొత్త వస్తువులకు డిమాండూ కర్బన ఉద్గారాలూ తగ్గుతాయి. హైదరాబాద్ కి చెందిన ప్రశాంత్ లింగం కొంతకాలంగా ఈ రంగంలో ప్రయోగాలు చేసి రీసైకిల్డ్ ప్లాస్టిక్తో ఏకంగా భవనాలనే నిర్మిస్తున్నారు. గోడలూ ఫ్లోరింగ్! వాడిన టైలూ పైకప్పూ అన్నీ రీసైకిల్ చేసిన ప్లాస్టిక్తో కట్టి చూపించిన ఆయనను ఐక్యరాజ్యసమితి డెవలప్ మెంట్ ప్రాజెక్ట్ విభాగం ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్ మెంట్ వ్యవహారాల కన్సల్టెంట్గా నియమించింది. హైదరాబాద్కే చెందిన 'బన్యన్ నేషన్' అనే సంస్థ నాణ్యతలో కొత్త ప్లాస్టిక్ కి దీటుగా ఉండేలా వాడిన ప్లాస్టిక్ వస్తువుల్ని రీసైకిల్ చేస్తోంది. ప్లాస్టిక్ సీసాలనుంచీ తయారుచేసిన దారంతో టీషర్టులు తయారుచేసి రెలాన్ అనే బ్రాండు పేరుతో విక్రయిస్తోంది రిలయన్స్ ఇండస్ట్రీస్. ఇక, అప్ సైక్లింగ్ చేస్తున్నవారి సృజనకైతే హద్దులే లేవు . వాటిల్లో మొక్కలు పెంచడం, వినియోగ, అలంకరణ వస్తువులుగా మార్చడం లాంటివెన్నో చేస్తున్నారు. ఇలాంటి చర్యల వల్ల ప్రజల్లో చైతన్యం పెరుగుతుందనీ ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గిస్తారనీ అంటున్నారు ఈ సృజనశీలురు..
〰〰〰〰〰〰〰〰
*మనం చాలా చేయగలం*
ఒక్కసారి గుర్తు చేసుకోండి... పొద్దున్నే లేచినప్పటినుంచీ ఎన్ని ప్లాస్టిక్ వస్తువులు వాడారో? వాటిల్లో తక్షణం మానేయగలవి ఏమిటో చూడండి. వస్త్రంతో కుట్టిన ఓ చేతి సంచీ వెంట ఉంచుకుంటే క్యారీబ్యాగు అక్కర్లేదు. అలా ఒక్కో వస్తువు చొప్పున ప్రయత్నిస్తే ప్లాస్టిక్ ని తరిమేయడానికి ఎంతోకాలం పట్టదు.
➤ తడిచెత్త, పొడి చెత్త విడివిడిగా వేయడానికి రెండు చెత్త బుట్టలు పెట్టుకుంటే క్యారీ బ్యాగ్ అవసరం లేకుండా చెత్తని అందులో పడేయొచ్చు.
➤ ఒక స్టీలు స్పూను, ఫోర్కు స్టా లాంటివి ఒక కిట్గా పెట్టుకుని బ్యాగులోనో, ఆఫీసు డెస్కులోనో ఉంచుకుంటే ప్లాస్టిక్ వి వాడే అవసరం రాదు.
➤ హోటల్ నుంచి క్యారియర్ తెచ్చుకోవాలనుకున్నప్పుడు ఇంటినుంచి టిఫిన్ బాక్స్ తీసుకెళ్లే సరి.
➤ నీళ్ల కోసం ప్లాస్టిక్ సీసాల బదులు స్టీలు, గాజు, రాగి, వెదురు సీసాలు అందుబాటులో ఉన్నాయి.
➤ సింథటిక్ ఫైబర్తో తయారైన దుస్తులూ ఫర్నిషింగ్స్ నుంచి సన్నని ప్లాస్టిక్ రేణువులు వెలువడి శ్వాస ఇబ్బందులకు కారణమవుతాయి. చేనేతవి ఉత్తమం.
➤ శానిటరీ న్యాప్ కిన్లూ, పిల్లలకు వాడే న్యాపీలూ ప్లాస్టిక్తోనే తయారవుతాయి. వాటి బదులు వస్త్రంతో తయారైన న్యాప్ కిన్లను ఎంచుకోవడం మంచిది.
〰〰〰〰〰〰〰〰
*తెల్లవారిని తరిమికొట్టడం కోసం... భరతజాతి స్వాతంత్ర్యం కోసం... నాడు గాంధీజీ చెప్పిన మాట క్విట్ ఇండియా'! మన ఆరోగ్యం కోసం... మన బిడ్డల మనుగడ కోసం... నేడు మనం చెప్పాల్సిన మాట 'క్విట్ ప్లాస్టిక్ ! సమాజంలో మనం కోరుకుంటున్న మార్పు మనతోనే మొదలవ్వాలంటూ మహాత్ముడు చెప్పిన మాటే మనకిప్పుడు ఉద్యమబాటైనా... బతుకు పాఠమైనా..!*