అనగనగా ఒక గ్రామం. ఆ గ్రామంలో రామయ్య అనే ఆయన ఉండేవాడు. అతను కుండలు చేస్తూ తన
కుటుంబాన్ని పోషించేవాడు. వారిది చాలా బీద కుటుంబం. రామయ్యకు ఒక కొడుకూ, ఒక కూతురూ ఉండేవారు. వారిద్దరినీ బాగా చదివించి
ప్రయోజకుల్ని చేయాలని రామయ్య కలలు కనేవాడు. కొడుకు పదవ తరగతి పూర్తి చేయగానే
వాడిని కాలేజీలో చేర్పించాడు. కానీ కొడుకుతోపాటు కూతుర్నీ చదువులకు పంపటం రామయ్యకు
బరువనిపించింది. అంతేకాక, ’ఆడపిల్ల చదివి ఏమి చేస్తుంది’ అని రామయ్య
అభిప్రాయం. దాంతో అమ్మాయిని చదువు మాన్పించాడు.
అబ్బాయి కాలేజీకివెళుతూ, సినిమాలూ, షికారులకూ తిరిగి మొదటి సంవత్సరం తప్పాడు. రామయ్య
బాధపడ్డాడు. రెండవ సంవత్సరమన్నా బాగా చదువుతాడేమోనని ఆశపడ్డాడు. ఈసారి అబ్బాయిగారు
అన్ని పేపర్లూ తప్పాడు. బాగా చదివే కొడుకు ఇలా అన్ని పరీక్షల్లోనూ తప్పడానికి గల
కారణాల్ని విచారించి తెలుసుకున్న రామయ్య, ఇక లాభం లేదని కొడుకును చదువు మాన్పించాడు. అతనికి నాణ్యమైన కుండలు చేయటంలో
మంచి శిక్షణను ఇప్పించాడు. వాటిని మంచి ధరకు అమ్ముకోవటం ఎలాగో కూడా నేర్పించాడు.
అబ్బాయికి కష్టపడటంలోని తియ్యదనం తెలిసి వచ్చింది. ఇప్పుడు బుద్ధిగా ఇంటిపట్టున
ఉంటూ పనీపాటా చూసుకుంటున్నాడు.
అయితే తన సంతానాన్ని చదివించలేకపోయాననే బాధ రామయ్యను అనునిత్యమూ బాధించింది.
అమ్మాయినన్నా చదివించి ఉంటే ప్రయోజనం ఉండేది గదా అనుకునేవాడు. అయినా ఇప్పుడేమీ
పరిస్థితి చేయిదాటిపోలేదు కనుక, అమ్మాయిని
తిరిగి బడిలో చేర్పించాడు. అమ్మాయి చదువులో బాగా రాణించింది. త్వరలోనే మంచి
ఉద్యోగమూ సంపాదించింది. రామయ్య ఆనందానికి అవధులే లేవు. ఇప్పుడు తన కొడుకూ
పనిచేస్తున్నాడు; తన కూతురూ
సంపాయిస్తున్నది!
అందుకే తల్లిదండ్రులంతా ’అమ్మాయేకదా’ అని తక్కువగా అంచనా
వేయకుండా కూతుర్లనీ చదివిస్తే ఎంతో సంతృప్తిని తమ సొంతం చేసుకోవచ్చు.
తల్లిదండ్రులారా! మేల్కోండహోహోహోహోహో